
విచారణలో ఉన్న ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్) కోర్టులు జోక్యం చేసుకో రాదని హరియాణా ముఖ్యమంత్రి భజన్‌లాల్ కేసులో హరియాణా హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. – (1992 : సుప్రీం. ఏఐఆర్. పేజీ 604)
అమరావతిలో జరిగిన భూకుంభకోణా లపై రాష్ట్ర ఏసీబీ రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ సుప్రీం న్యాయమూర్తి తాలూకు ఇరువురు సన్నిహిత బంధువులు సహా మొత్తం 13 మందిపైన నమోదు చేసిన కేసును రాష్ట్ర హైకోర్టు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉందని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. – పత్రికల వార్తలు (17–09–2020)
‘భూకుంభకోణంపై ఎలాంటి వార్తలు రాయొద్దు, ప్రసారం చేయొద్దు’ – హైకోర్టు ఆదేశం
ఏసీబీ కేసు 15–09–2020న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దోనాటి రమేశ్ ముందు విచారణకు రాగా, విచారణ ప్రారంభించడానికి ముందే ఆయన ఈ కేసును తాను విననని చెప్పి సదరు కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు’ – వార్త
న్యాయం తప్పేవాళ్లకు ఏ ఆచార్యుల కటాక్షమూ అక్కర్లేదని తెలుగువారి సామెత. అంతేకాదు, న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు కాచి దోచుకునే వాడు కూడా ఒకటేనని మరో సామెత. అంతేకాదు, భారత పౌరహక్కుల పరిరక్షణ నేతగా, రాజ్యాంగం గ్యారంటీ చేసిన ప్రాథమిక హక్కులను కాపాడటంలో ఉద్ధండ పిండంగా ఎనలేని సేవలందించిన సుప్రసిద్ధ సుప్రీం న్యాయవాది ప్రశాంత భూషణ్‌పైన కోర్టు ధిక్కారం పేరిట జస్టిస్ అరుణ్ మిశ్రా (ఇక రిటైర్డ్) శిక్షించడానికి చేసిన ప్రయత్నం శాశ్వత చర్చగానే పరిష్కారం లేని ప్రతిపాదనగానే మిగిలిపోతుందని ప్రభుత్వ సీనియర్ అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ స్పష్టం చేశారని మరిచిపోరాదు. అలాంటి మచ్చలేని ప్రశాంత భూషణ్ సైతం తాజా ‘హైకోర్టు’ ఉత్తర్వు సరైన పద్ధతిలో లేదని, గతంలో ఇలాంటి పరిణామం ఎన్నడూ చూడ లేదని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ ప్రజలు సమాచారం తెలుసుకోకుండా చేయడం ద్వారా అనేక వదంతులకు (రూమర్లకు) దారితీస్తుందనీ విమర్శించారు.
అలాగే సుప్రసిద్ధ హిందూ దినపత్రిక పూర్వ సంపాదకుడు.. నేడు దేశవిదేశాల్లో ప్రసిద్ధిలోకి వచ్చి పరిశోధనాత్మక జర్నలిజంలో తల మానికంగా ఉన్న ‘ది వైర్’ సంస్థ ప్రధాన సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ రాష్ట్ర హైకోర్టు నిషేధిత ఉత్తర్వును విమర్శిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో భూకుంభకోణాలను బహిర్గతం చేస్తూ వెలువడిన ప్రాథమిక విచారణా నివేదిక ఎఫ్‌ఐఆర్ బతికింది కొద్దిసేపే అయినా, ప్రయోజనకరంగా జీవించింది. ఈ దేశంలో రోజూ వేలాది ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి. కానీ ఈ ఎఫ్‌ఐఆర్‌ను తొక్కి పడేశారు. దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపైన ఎప్పుడు ఎలా దర్యాప్తు జరపాలో నిర్ణయి స్తున్నవారే అసలైన అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.’’ ఇలా ఒకరిద్దరు కాదు.. దేశవ్యాప్తంగానే లెక్కకు మించి ఒక రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుపై స్పందనలు వెల్లువెత్తడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మరొక విశేషం.. తన ఈ ఆదేశాన్ని అమ లయ్యేలా చూడాలని ఒక్క ఏపీ డీజీపీనే కాకుండా కేంద్రాన్ని కూడా హైకోర్టు ఆదేశించడం! కానీ అంతకుముందు కేసు విచారణ నుంచి గౌరవ న్యాయమూర్తి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో కారణం మాత్రం ప్రజలకూ, విమర్శకులకూ వివరంగా వెల్లడి కావలసి ఉంది. ఎందుకంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల హయాంలో నిర్బం ధపూరిత శాసనాలు, క్రిమినల్ లా చట్టాలు ఎలాంటి ప్రధానమైన మౌలిక మార్పులు లేకుండానే హెచ్చు భాగంగా నేడు దేశంలో యథే చ్ఛగా అమలు జరుగుతున్నాయి. దీనివల్ల దేశంలో 1960ల నుంచీ ఎలాంటి ఫలితాలు ప్రజల్ని పీడిస్తున్నాయో, స్వతంత్ర భారత న్యాయవాదుల సంఘానికి, తొలి బార్ అసోసియేషన్‌కూ అధ్యక్షుడైన మచ్చలేని సుప్రసిద్ధ న్యాయవాది, భారత లా కమిషన్ తొలి అధ్య క్షుడు, పద్మవిభూషణ్ అయిన రాజ్యాంగ నిపుణుడు ఎం.సి. సెతల్వాడ్ చెప్పిన మాటల్ని ఎదిగి రావలసిన యువ న్యాయవాదులు ఒంట బట్టించుకోవాలి. సెతల్వాడ్ మాటల్లో: ‘లాయర్ల, న్యాయమూర్తుల వృత్తి నైపుణ్యం మొత్తంమీద పెరిగింది కానీ– ఒకనాడు ప్రజాసేవలో పాటించిన ఆదర్శాలను నేడు ఈ వృత్తి చాలావరకు కోల్పోయింది. ఎంతసేపూ స్వార్థ దృష్టిపైనే దాదాపు కేంద్రీకరణ అంతా. ఇక వృత్తి ధర్మంలో పాటించాల్సిన ఆదర్శాలూ దాదాపు దారుణంగా పతనమవు తున్నాయి. చివరికి పన్నుల ఎగవేత కేసుల్లో ప్రముఖ సీనియర్ లాయర్లే మునిగిపోతున్నారు’.
చివరికి అవినీతి కేసుల్లో ఉన్న సుమారు 16–17 మంది ప్రధాన న్యాయమూర్తులలో కనీసం 8–9 మంది అవినీతికి లోనవడం గురించి ప్రశాంత్‌భూషణ్ 2009 సెప్టెంబర్ 7న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంలో ఆ విషయమై రాగల పరిణామాల గురించి అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించడం జరిగిందేగానీ గత పదేళ్లు గానూ ఆ విషయాన్ని అరుణ్‌మిశ్రా విచారణకు తీసుకోవడం మాత్రం జరగలేదు. నిప్పు లేనిదే పొగ రాదన్న పెద్దల నానుడికి ఇది నిదర్శనం కాదా? అసలు ‘క్రిమినల్‌లా’కు ప్రాణమే ఎఫ్‌ఐఆర్. విచారణ సాగా లంటే ఆ ప్రాథమిక కర్మకాండ జరగాల్సిందే. అందుకే భజన్‌లాల్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ని హైకోర్టు కొట్టేయడానికి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోవాల్సి వచ్చింది (1992). అదే సుప్రీం, ఎస్.ఎస్. బసాక్ 2, ఎస్.సి.ఆర్ 52 (1963) వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో ఇలా తీర్పు చెప్పింది:''The allegations made in the complaint, do clearly constitute a cognijable offence, and this does not call for the extrordinary or inherent powers of the high court to quash the FIR itself (307 B)''
అలాగే, సుప్రసిద్ధ దివంగత సుప్రీం న్యాయమూర్తి వీఆర్ కృష్ణయ్యర్ మొత్తం న్యాయ వ్యవస్థ నైతిక స్థాయి గురించి అత్యున్నత స్థాయి హై పవర్ కమిషన్‌ను నియమిస్తే, ఆ విచారణ ఫలితం షాకింగ్‌గా ఉంటుందని చెబుతూ ఇలా అన్నారు: ‘సామాజికంగా న్యాయవ్యవస్థకు ఉండాల్సిన సహనశక్తీ, దమ్ము, నైతిక స్థాయి, స్వతంత్రంగా వ్యవహరించగల సత్తా దిగజారిపోయినప్పుడు– ఎలాంటి సామాజిక విప్లవమూ రాజాలదు. ఎందుకంటే, ఆర్థిక తాత్విక దృక్పథంగానీ, లేదా సాంఘికాభ్యున్నతిని సాధించాలన్న తపనగానీ, న్యాయవ్యవస్థకు కొరవడితే అది ప్రయోజనకర సంస్క రణలకు, ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి, ఎప్పటికప్పుడు ఆధునిక ప్రాపంచిక దృక్పథం వైపునకు న్యాయవ్యవస్థను నడిపిం చడం సాధ్యపడదు. కనుకనే న్యాయవ్యవస్థలో నైతిక సత్తా దీపించాలి. (జస్టిస్ కృష్ణయ్యర్: ‘లీగల్ స్పెక్ట్రమ్’ 2011, పే:197).
అందువల్ల, గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధి కారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, కేంద్రం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెప్పే వాదనలు వినాల్సిన అవసరం లేదంటూ ప్రకటించడం ఏ రకమైన పాలసీ కిందకు లేదా న్యాయ సూత్రాల కిందకు వస్తుందో మనకు తెలియడం లేదు. ఈ వాదనే నిజమనుకుని నమ్మాల్సి వచ్చే పక్షంలో– భారత సెక్యులర్ రాజ్యాంగాన్ని కనీసం మాటవరకైనా గౌరవించి వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ విధానాలను మార్చి ‘దారి మార్చకుండానే దిక్కుమార్చిన’ బీజేపీ విధానాలను ఏమని పిలవాలి? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను.. అల్లుడి పేరుతో ఇంట్లోకి చేరిన చంద్రబాబు అర్థాంత రంగా ‘కడతేర్చి’ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ‘బిల్మక్తా’గా, చుప్తాగా ఎన్టీఆర్ అంతకుముందు చేపట్టి అమలు చేస్తున్న కొన్ని కీలకమైన ప్రజా సంస్కరణలను శంకరగిరి మాన్యాలు పట్టించినప్పుడు ఏ ‘సంపూర్ణాధికారం’ చెలాయించగలిగాడు? ఏ న్యాయస్థానం ఆ ‘సంపూర్ణాధికారాన్ని’ అడ్డుకోగలిగింది?
కాకపోతే ఈ కప్పలతక్కిడి రాజకీయాలకూ కృష్ణయ్యర్ ఆశిం చినట్టు సామాజిక పరిస్థితులను మూలమట్టుగా కుదిపి, కదిపే సాంఘిక విప్లవాలకు, వాటి పర్య వసానంగా ఆవిష్కరించుకునే రాజ కీయ పరిణామాలకూ చాలా తేడా ఉంది. ఇది న్యాయస్థానాలు సకాలంలో గుర్తించి జాగ్రత్తపడకపోతే ఆ లోపాన్ని, న్యాయస్థానాల రూపాన్ని సరిదిద్దుకోలేవు. ఢిల్లీలో సిక్కుల ఊచకోతను, గుజరాత్‌లో మైనారిటీల ఊచకోతనూ నిలువరించడంలో విఫలమైన జస్టిస్ ఆర్.ఎన్. మిశ్రాను, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎమ్. సిక్రీ నిశితంగా విమర్శించగా, గుజరాత్ ఊచకోతపై న్యాయస్థానాల వైఖరిపట్ల సుప్రీంకోర్టు ప్రత్యేక సలహా దారుగా ఉన్న ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్ పాతిక– ముప్పయి పేజీల డిస్సెంట్ పత్రం సమర్పించాల్సి వచ్చింది. అంతే గాదు, 1950–1989 మధ్య సుప్రీం న్యాయమూర్తులు కొంతమందిమీద తన పరిశోధనా ఫలితాల్ని నమోదు చేస్తూ జార్జి హెచ్ గ్యాడ్ బోయి వేసిన అంచనాలో ‘భారత దేశంలో కమీషన్లు కొట్టే సంస్కృతి ఉందనే ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చెప్పారని ఈ కమీషన్ల సంస్కృతి సంస్థాగత సంప్రదాయంగా ఉందని.. ఇది రాజకీయ సంస్కృతిలో పాతుకుపోయిందని రాశాడు. రిటైర్మెంట్ తర్వాత ‘క్విడ్ ప్రోకో’ (ఇచ్చిపుచ్చుకునే) సంస్కృతి కూడా ప్రభుత్వాలకు, జడ్జీలకు మధ్య స్థిరపడి ఉందనీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రసిద్ధ హిందీ వ్యంగ్య రచయిత హరిశంకర్ పర్యాయి గుర్తు చేసిన మాటలు వెన్నాడుతున్నాయి:
‘ఎన్నడైనా నిజాయితీపరుడైనవాడు గెలిచిన కేసేదైనా ఉందా? దుర్యోధనుడికి గెలిచి తీరుతానన్న దమ్ము ఎలా వచ్చింది? డబ్బు మదంవల్ల! ఎందుకంటే డబ్బు అనేది పైకి కనిపిస్తుంది. కానీ, దాన్ని దేవుడనే వాడొక్కడే చూడగల్గుతాడుగానీ అతడికి నిజం అయినా, సత్యమైనా కన్పించదు’’.
-ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in