గెలుపోటముల వెనుక దైవయోగం! | Devotion Story On Destiny Time Victory Defeat | Sakshi
Sakshi News home page

గెలుపోటముల వెనుక దైవయోగం!

Oct 9 2026 4:54 AM | Updated on Oct 9 2026 4:54 AM

Devotion Story On Destiny Time Victory Defeat

ఇద్దరు సమఉజ్జీల మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్నది. ఇద్దరూ ఘనులే. తమ తమ శక్తి సామర్థ్యాలలో తమ తమ దేశాలను ఏకచ్ఛత్రంగా ఏలి, ఎంతో వైభవం అనుభవించిన వాళ్లే. చివరికి యుద్ధంలో ఒకడు ఘన విజయం సాధించాడు. మరొకడు ఘోర పరాజయం పాలయ్యాడు. గెలిచిన వాడు, ‘‘నేను నా శత్రువు కంటే నూటికి నూరు పాళ్లు ఎక్కువ బలశాలిని, పరాక్రమశాలిని, వ్యూహ చతురుడిని, ధీమంతుడనైన వాడిని. అందుకే నా శత్రువును మట్టి కరిపించాను’’ అంటాడు.

ఓడిన వాడు మాత్రం, ‘‘ఓడే వరకూ నేనూ అలాగే అనుకొనే వాడినే. ఇంతకు పూర్వం నేనూ ఎన్నో యుద్ధాలు గెలిచిన వాడినే. ఈ శత్రువుకంటే గొప్ప బలశాలురను ఓడించిన శూరుడినే. కాలం, దైవం కలసి రాక ఈరోజు నా శౌర్యం పని చేయలేదు. అలాగే ఈరోజు కాలం, దైవం అనుకూలించి నా శత్రువు విర్రవీగుతున్నాడు గాని, ఈయన పూర్వం ఎందరి చేతిలోనో ఓడిన వాడే. రేపు నాకు మంచి రోజులు వస్తే, మళ్లీ నా చేతిలో చిత్తుగా ఓడిపోతాడు!’’ అంటాడు.

చరిత్రలో ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. వ్యక్తుల జీవితాలను మలుపులు తిప్పే ప్రధాన ఘట్టాలన్నింటిలోనూ వాళ్ల స్వయంకృషితో పాటు, వాళ్ల చేతిలోలేని, అనుకోని అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. వజ్రం తృణాయతే, రాజన్‌ దైవ యోగాత్‌ న సంశయః/ తృణం వజ్రాయతే క్వాపి సమయే, దైవ యోగతః అంటుంది సుభాషితం. కొన్ని సమయాలలో, వజ్రం కూడా విలువ కోల్పోయి, గడ్డి పరక పాటి చేయదు. కారణం ‘దైవ యోగం’. అదే దైవ బలం వల్ల మరొకప్పుడు, గడ్డి పోచ కూడా వజ్రమంత విలువ పొందుతుంది.
– ఎం. మారుతి శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement