టార్చ్‌ బేరర్‌! 

Sakshi Editorial On Political Torchbearer CM YS Jagan Mohan Reddy

జనతంత్రం

మనదేశంలో ఐడియాలజీ అనే ‘పదార్థం’ అంతర్ధాన మైనట్టేనా? సిద్ధాంతం అనే పేరుతో ఓ వెలుగు వెలిగిన భావసంచయానికి మన రాజకీయ వ్యవస్థ పాడె కట్టేసిందా? రాజకీయ నాయకులను ఈ ప్రశ్నలు అడిగితే వారు ఔననే సమాధానం చెబుతారు. అవకాశవాదులకు ఈ పరిస్థితి అయా చిత వరంగా పరిణమించింది. శషభిషలకు తావులేకుండా అవ లీలగా వారు అధికార పీఠం పంచన చేరగలుగుతున్నారు. లౌకిక రాజకీయాల్లో దశాబ్దాల తరబడి తలపండిన నేతలు కూడా సునాయాసంగా మతపార్టీల్లో చేరగలుగుతున్నారు. బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఎర్రజెండాలు మోసిన వందలాది భుజాలపై ఇప్పుడు కాషాయ జెండాలు ఎగురుతున్నాయి.

ఈ ధోరణి ఇప్పుడు వేగం పుంజుకున్నది కానీ, పాతికేళ్ల కిందనే ప్రారంభమైంది. అంతకుముందు కూడా అడపాదడపా ఫిరాయింపులు ఉన్నా అవి సిద్ధాంత పరిధుల్ని దాటేవి కావు. కమ్యూనిస్టులు బీజేపీలో చేరడం, బీజేపీ వారు కమ్యూనిస్టుల్లో కలవడం ఊహాతీతమైన విషయం. అలాగే లౌకికవాదులు మత పార్టీల్లో చేరడం కూడా! నిరక్షరాస్యులైన పల్లెప్రజల్లో కూడా ఈ కట్టుబాటు బలంగా ఉండేది. ఒక తండ్రికి పుట్టి మరో తండ్రి పేరు ఎట్లా చెప్పుకుంటామని వారు ప్రశ్నించేవారు. కష్టా లెదురైనా, నష్టాలెదురైనా నమ్ముకున్న పార్టీలోనే జీవితాంతం కొనసాగేవారు. ఆ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉండేవారు.

కమ్యూనిజానికి కాలం చెల్లిందనీ, ఇప్పుడున్న సిద్ధాం తమల్లా టూరిజం మాత్రమేననీ పాతికేళ్ల కిందనే చంద్రబాబు ప్రకటించారు. కమ్యూనిజం అనేది ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం. వంద సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన భావజాలం. ఆ సిద్ధాంతం వెదజల్లిన విత్తనాలు మొలకెత్తని నేల భూగోళం మీద ఏ ఖండంలోనూ లేదు. అటువంటి ఉజ్జ్వల చరితకు చావుడప్పు కొట్టడం ద్వారా చంద్రబాబు సిద్ధాంత రహిత రాజకీయాలకు స్వాగతం పలికాడు. కమ్యూనిస్టు చెట్టుకే కాసిన కుక్కమూతి పిందెలు కొన్ని అదే చంద్రబాబు పల్లకీ మోయడానికి బోయీలుగా ముందువరసలో నిలబడటాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ దౌర్భాగ్యాన్ని కూడా సిద్ధాంత రహిత రాజకీయాల్లో భాగంగానే గుర్తించాలి.

సోవియట్‌ యూనియన్‌ పతనం (1991) తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది ఇక సిద్ధాంతాలకు కాలం చెల్లినట్టేనని భావించారు. అప్పటివరకూ రెండు ప్రధాన సిద్ధాంతాలైన కమ్యూనిజం – కేపిటలిజమ్‌ ప్రపంచాన్ని రెండుగా చీల్చాయి. ఒక వ్యవస్థ పతనమయింది కనుక ఇక సిద్ధాంతాలతో పనేముంది అనేది ఒక వాదన. ఇది పూర్తిగా అవకాశవాద ధోరణి. కేపిటలిస్టు ఆర్థిక వ్యవస్థకు ప్రజాస్వామ్యమే ఆలంబన. ప్రజాస్వామ్యమూ, సైద్ధాంతికత అనేవి అవిభాజ్యమైన అంశాలు. తత్త్వవేత్తలు సిద్ధాంతీకరించిన ప్రమాణాల పునాదుల పైనే ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం జరిగింది. జాన్‌లాక్, మాంటెస్క్యూ, రూసో వంటి తత్త్వవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఫ్రెంచి, అమెరికా విప్లవాలను మండించాయని మనకు తెలుసు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆ విప్లవా ల్లోనే ప్రభవించాయన్న సంగతి కూడా తెలిసిందే.

కేపిటలిస్ట్‌ మార్కెట్‌ ఎకానమీని అనుసరించే ‘ప్రజా స్వామ్య’ దేశాల్లో కూడా క్రమంగా కొన్ని మార్పులు వచ్చాయి. అది కమ్యూనిస్టు శిబిరంతో ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావం వల్ల కావచ్చు. ఆయా దేశాల్లోని సోషలిస్టు రాజకీయ శక్తుల ఒత్తిడి వల్ల కావచ్చు. వాటికంటే ముఖ్యమైనది – నియంత్రణ లేని మార్కెట్‌ ఎకానమీ వల్ల అసమానతలు పెరిగి అన్నార్తులు తిరుగుబాటు చేసే ప్రమాదం పొంచి ఉండటం. ఈ కారణంగా పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య దేశాలన్నీ క్రమంగా ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలుగా పరావర్తనం చెందాయి. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం, లౌకిక విధానాలు, బహుళ పార్టీ రాజ కీయ వ్యవస్థ తదితర సంస్కరణలతో సైద్ధాంతిక విభజనకు దారితీసే అవకాశాలను తగ్గించే ప్రయత్నం చేశారు.

ఈ సంస్కరణల వల్ల అసమానతలేమీ తగ్గలేదు. ఆకలి కేకలను తగ్గించగలిగారు. కానీ, అవకాశాల్లో సమానత్వం సిద్ధించలేదు. ఆధునిక ప్రజాస్వామ్య సిద్ధాంతానికి మూల స్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి సంపన్నులకే దఖలుపడ్డాయి. సమాజంలోని మెజారిటీ ప్రజలు పేదరికం చెరలో ఉండగా, వెనుకబాటుతనంలో ఉండగా ఈ ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు నిరర్థకాలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంతకంటే మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం కొన్ని ప్రతిపాదనలూ, ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాల్లోంచి పుట్టిన భావనే ‘సోషల్‌ కేపిటలిజమ్‌’ అనే ఆర్థిక వ్యవస్థ. ఇక్కడా ప్రైవేట్‌ పెట్టుబడి ఉంటుంది.

చైనా వంటి కమ్యూనిస్టు దేశంలో కూడా ప్రైవేట్‌ పెట్టుబడి అనివార్య మైనప్పుడు అది లేని వ్యవస్థను ఊహించడం అసాధ్యం. అయితే ఇక్కడ ప్రైవేట్‌ పెట్టుబడితోపాటు మానవ వనరులను, ప్రకృతి వనరులను కూడా పెట్టుబడిగానే పరిగణిస్తారు. ప్రస్తుత లిబరల్‌ డెమోక్రసీ అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానంలో ఈ రెండు వనరులనూ పెట్టుబడులుగా కాకుండా సరుకులుగా పరిగణిస్తున్నారు. మానవ వనరులు పెట్టుబడిగా పరివర్తన చెందడానికి వీలుగా వారి నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ పెంచవలసి ఉంటుంది. వారిని పేదరికం నుంచి వెలికితీయవలసి ఉంటుంది. అందుకోసం ప్రజాస్వామ్య వ్యవస్థ కొంత పెట్టుబడిని పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టు అర్థం.

ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలకు మనదేశం కూడా దూరంగా ఏమీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి మనదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను, ప్రణాళికాబద్ధమైన ఆర్ఢిక విధానాలను అమలు చేసింది. నెహ్రూ ప్రవచించిన సోషలిస్టు తరహా లౌకిక సూత్రాలను అనుసరించింది. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలను, రాజ్యాంగ ఆశయాలను సాకారం చేసే ప్రయత్నాలు చేసింది. అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ సిద్ధాంతబద్ధమైన వైఖరిని అనుసరించింది. సోవియట్‌ యూనియన్‌ పతనమైన సమయం, మన దేశం ఆర్థిక సంస్కరణలను తలకెత్తుకున్న సమయం కాకతాళీయంగా ఒక్కటే. ఉదారవాద ఆర్థిక విధా నాలు దేశంలో సంపదను పెంచిన మాట నిజం. అదే సమ యంలో అసమానతలు మునుపటి కంటే పెరిగిన మాట కూడా యథార్థం.

ప్రభుత్వం ఏ పార్టీదైనా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం రివాజైంది కనుక ఇక సిద్ధాంతాలతో పనేమిటి అనే అవకాశవాద ఆలోచన ఆ రోజుల్లోనే తెరపైకి వచ్చింది. ఈ ఆలోచనకు ఆద్యుడు చంద్రబాబునాయుడు. కమ్యూనిజం కంటే టూరిజం గొప్ప తరహా వాక్యాలు ఆయన నోటి వెంట జాలు వారాయి. ఆయన వ్యతిరేకత కేవలం కమ్యూనిజంపై మాత్రమే కాదు, సిద్ధాంత నిబద్ధత మీదనే ఆయన వ్యతిరేకత. సైద్ధాంతిక నిబద్ధత విలువల్ని కూడా కోరుకుంటుంది. విలువల్ని తుంగలో తొక్కడం ద్వారానే ఆయన అధికారంలోకి రాగలిగారు. కొనసాగ గలిగారు. కనుక సిద్ధాంత నిబద్ధత, విలువలు ఆయనతో మ్యాచ్‌ కాలేని విషయాలు.

సిద్ధాంత రాహిత్యం అనేది అవకాశవాదానికి, స్వార్థపర త్వానికి, అవధుల్లేని దోపిడీకి అద్భుతంగా ఉపయోగపడే సాధనం. దాదాపుగా ఆ తరం రాజకీయ నాయకులందరికీ ఈ సిద్ధాంత రాహిత్య వైరస్‌ అంతో ఇంతో సోకింది. ఫలితంగా దేశంలో అసమానతలు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. సంపద పెరిగిన సంతృప్తిని ఈ అసమానతలు మింగేస్తున్నాయి. ఒక్కశాతం కుబేరుల చేతిలో 55 శాతం దేశ సంపద బందీగా ఉండటం ఎవరికి గర్వకారణం? 10 శాతం శ్రీమంతుల కుటుం బాల్లో 70 శాతం జాతి సంపద పోగుబడటం ఎవరికి గొప్ప? 119 మంది బిలియనీర్ల సంపద మనదేశ వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉన్నందువల్ల మనం సిగ్గుపడాలా? ఆనందపడాలా? ఏటా ఆరున్నర కోట్లమంది ప్రజలు ఆస్పత్రి ఖర్చుల ఫలితంగా అప్పులపాలై దారిద్య్రంలో జారిపోవడం దుఃఖదాయకం కాదా? సంపన్న పెట్టుబడిదారులూ – పేదప్రజల మధ్య వ్యత్యాసం మాత్రమే కాదు.

వేతన జీవుల మధ్య వ్యత్యాసం కూడా కలవరం కలిగించే మరో అంశం. ఒక పెద్ద గార్మెంట్‌ పరిశ్రమలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌కు ఒక సంవత్సర కాలంలో వచ్చే వేతనం మొత్తాన్ని సంపాదించాలంటే, కనీస వేతనం పొందే గ్రామీణ కార్మికునికి 961 సంవత్సరాలు పడుతుందట! ఎన్ని తరాలు గడిచిపోవాలి? మన డెమోక్రసీ సృష్టించిన ఈ అసమానతలను తొలగించి మానవీయ సమాజానికి పునాదులు వేయగల సోషల్‌ డెమోక్రసీ వైపు ఈ వ్యవస్థను ఎవరు నడిపించాలి?.

అటువంటి మార్పులకు టార్చ్‌ బేరర్‌గా నిలబడగలిగిన నాయకుడెవరైనా ఉన్నారేమో చూడాలంటే మనం నవతరం నాయకత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. పార్టీ వ్యవస్థల ప్రభావం తగ్గుతూ, నాయకుల ప్రాబల్యం పెరుగుతున్న దశ కనుక నాయకత్వ పరిశీలనే సమంజసమైనది. అందులోనూ ప్రభావవంతమైన నాయకత్వ దక్షత గలిగిన వారిని పరికిం చడమే ఉచితం. అరవై నుంచి ఎనభై యేళ్ల వయసున్న నేత లంతా సంప్రదాయ రాజకీయ విధానాల్లోంచి వచ్చినవారే. కొందరికి ఉద్యమాల నేపథ్యం ఉన్నది. కానీ, ప్రజలందరినీ సాధికారం చేయడం, వ్యవస్థను సోషల్‌ డెమోక్రసీ వైపు మళ్లించడం వంటి ఎజెండాను చేపట్టలేదు. నవతరం నేతల్లో ఫిఫ్టీ (50) క్లబ్, ఆ క్లబ్‌కు చేరువవుతున్న నాయకులున్నారు.

ఫిఫ్టీ క్లబ్‌లో ప్రభావం చూపగల నాయకుల్లో రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్, ఆదిత్యనాథ్‌ ఉన్నారు. అమిత్‌ షా (58) అరవైకి చేరువలో ఉన్నారు. రాహుల్‌గాంధీ తనకు జాతీయ స్థాయిలో క్రియాశీల పాత్ర పోషించే అవకాశం లభించినప్పటికీ సిద్ధాంత రాహిత్య పరిపాలనలోనే కొనసాగారు. పేదలకు ఉపకరించిన ఒక్క ‘నరేగా’ కార్యక్రమం తప్ప మహిళా సాధికార తకు గానీ, విద్యా, వైద్య రంగాల పటిష్ఠతకు గానీ చేపట్టిన మరో కార్యక్రమం లేదు. కేజ్రీవాల్‌ కొంత భిన్నమైన నాయకుడు. విద్య – వైద్య రంగాల్లో ఆయన తన మార్కును ప్రదర్శించాడు. అయితే 70 శాతం గ్రామీణ ప్రజలున్న దేశంలో ఆయన పూర్తి పట్టణ ప్రాంతమైన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పంజాబ్‌ పాలనా ఫలితాలను చూసిన తర్వాతనే ఆయనను అంచనా వేయగలం. ఆదిత్యనాథ్‌కు సిద్ధాంతాలున్నాయి. ఆయనవి హిందూ రాష్ట్ర సిద్ధాంతాలు. లౌకికత్వానికి చోటు లేని డెమోక్రసీ అసలు డెమోక్రసీగానే పరిగణించలేము. ఇక సోషల్‌ డెమోక్రసీ గురించి ఆలోచించడం వృథా!

ఫిఫ్టీ క్లబ్‌కు చేరువవుతున్న ప్రభావశీల నేతల్లో అఖిలేశ్‌ యాదవ్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేటీ రామారావు తదితరు లున్నారు. అఖిలేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో క్యాస్ట్‌ (కుల) పోలరైజేషన్‌ తీసుకురాగలిగారు గానీ క్లాస్‌ (వర్గ) పోలరైజేషన్‌ను సాధించలేకపోయారు. పేదవర్గాల సాధికారత సాధనకు వర్గ చైతన్యం కూడా అవసరం. కేటీఆర్‌ నాయకత్వ పటిమను చాటుకుంటున్నప్పటికీ ఇంకా తండ్రిచాటు బిడ్డకిందే లెక్క. ఆయన సొంతంగా పగ్గాలు చేపట్టిన తర్వాతనే సోషల్‌ డెమోక్రసీ పట్ల ఆయనకున్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేది.

ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే త్రిరత్నాలకు జగన్‌మోహన్‌రెడ్డి తన పరిపాలనలో పెద్దపీట వేశారు. పౌరులకు నిజమైన స్వేచ్ఛ, సమానత్వం అనేవి వారిని పేదరికం నుంచి విముక్తి చేసినప్పుడే సాధ్యమవుతాయనే తన విశ్వాసాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానం తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నదని ప్రకటించారు. రాజ్యాంగ పీఠికలోని అంశాలతోపాటు ప్రపంచ బ్యాంకు సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కూడా గమనంలోకి తీసుకుంటూ బడ్జెట్‌లకూ, ప్రభుత్వ విధానాలకూ రూపకల్పన చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఇప్పటికే పలు రాష్ట్రాల బృందాలను ఆకర్షించాయి. మహిళా సాధికారతకు చేపట్టిన కార్యక్రమాలు ప్రత్యేకంగా అధ్యయనం చేయదగినవి. పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శక పాలనకు సంబంధించి ఇంతకంటే ఇంకా ముందుకు వెళ్లడం అసాధ్యం.

నిన్ననే జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ మాట్లా డుతూ ప్రభుత్వ పేదల అనుకూల విధానాలపై పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారనీ, మనం ఓడిపోతే పేద ప్రజలు నష్టపోతా రనీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇది నిజం. సాధికారత కోరుకుంటున్న పేద ప్రజల మీద, సోషల్‌ డెమోక్రసీని కాంక్షిస్తున్న వర్గాల మీద, పేదరికం నుంచి విముక్తిని కోరు కుంటున్న ప్రజల మీద ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదవడాన్ని వారు ఈసడించుకుంటున్నారు. రాజధాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు ఇస్తే ‘కుల’ సమతౌల్యం దెబ్బతింటుందని చీదరించు కుంటున్నారు. ‘మీ వర్గాల్లో ఎవరు పుడతార’ని అసహ్యించు కుంటున్నారు.

‘మగపిల్లాడు పుట్టాలి గానీ ఆడపిల్ల పుట్టడమే మిట’ని ఎకసెక్కాలు చేస్తున్నారు. ‘దళితులకు మీకెందుకురా అధికారాలు, పదవులూ’ అంటూ దబాయిస్తున్నారు. పేద మహిళలు 30 లక్షలమందికి ఇళ్లు కట్టించడాన్ని ఆక్షేపిస్తూ కోర్టుల మెట్లెక్కుతున్నారు. ఈ వర్గాలకు అండగా నిలబడిన జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం మీద కత్తిగట్టారు. ‘కట్టుకథకూ – పెట్టు బడికీ పుట్టిన విషపుత్రిక... ఆంధ్రపత్రిక’ అని అప్పుడెప్పుడో శ్రీశ్రీ అన్నారు. ఇప్పుడు ‘రంకుతనానికీ – బొంకుతనానికీ పుట్టిన మాఫియా... ఎల్లో మీడియా’ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని దాడులకు గురవుతున్న సోషల్‌ డెమోక్రసీ వైపు జరుగుతున్న ప్రయాణానికి వైఎస్‌ జగన్‌ టార్చ్‌ బేరర్‌గా నిల బడ్డారు. ఆ రాష్ట్ర పేద ప్రజలు మరో మూడు రోజుల్లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురుచూస్తున్నారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top