మాటలు సరే! చేతల మాటేమిటి?

Sakshi Editorial On G 20 Summit About Global Warming

ప్రపంచంలోని 20 భారీ ఆర్థిక వ్యవస్థలు... అంతా కలిపితే అంతర్జాతీయ వాణిజ్యంలో 75 నుంచి 80 శాతం ఉన్న దేశాలు... ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల జనాభాకూ, ప్రపంచ భూభాగంలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల అధినేతలు ఒక్కచోట కలిస్తే? ప్రపంచ పరిణామాలు, పర్యావరణ, వాణిజ్య సమస్యలపై రెండు రోజులు చర్చిస్తే? ఐరోపా సమాజం, మరో 19 దేశాల అంతర్‌ ప్రభుత్వవేదికగా ఏర్పాటైన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ప్రాధాన్యం అందుకే! ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్‌ చివర 2 రోజులు జరిగిన ఈ సదస్సులో గత రెండేళ్ళలో తొలిసారిగా దేశాధినేతలు వ్యక్తిగతంగా కలిశారు. మరి, ఈ సదస్సు ఆశించిన ఫలితాలు అందించిందా అంటే అవుననలేం. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల లోగానే నియంత్రిస్తామంటూ నేతలు లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కానీ, కర్బన తటస్థతను సాధించేందుకు కచ్చితమైన తుది గడువు పెట్టనే లేదు. కేవలం ఉద్గారాల్ని తగ్గిస్తే చాలదని తెలిసినా, కార్యాచరణ శూన్యం. అందుకే, ‘ప్రజలు, ప్రపంచం, సౌభాగ్యం’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సుతో కొంత ఆశ, ఎంతో నిరాశ మిగిలాయి.

2015 నాటి ప్యారిస్‌ వాతావరణ ఒప్పందానికి తగ్గట్టు దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాలను పెట్టుకోవాలనీ, శుద్ధమైన విద్యుత్‌ జనకాలకు త్వరితగతిన మారాలనీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని పేర్కొన్నారు. కానీ, ప్రపంచంలో మూడింట రెండు వంతులకు పైగా గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలకు కారణమైన ఈ 20 దేశాల గ్రూపు స్పష్టమైన తుది గడువుతో ముందుకు రాలేదు. కోవిడ్‌పై పోరు, ఆరోగ్య వసతుల మెరుగుదల, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం లాంటి వివిధ అంశాలపై ప్రపంచ నేతలు చర్చించారు. కానీ, రష్యా, చైనాలు తమ ప్రతినిధుల్ని ఈ సదస్సుకు పంపనే లేదు. వివిధ కారణాలతో మెక్సికో, జపాన్, దక్షిణాఫ్రికా నేతలు హాజరు కానే లేదు. వర్ధమాన దేశాలు పర్యావరణహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకొనేలా ఏటా 100 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 7.49 లక్షల కోట్లు) సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ‘జి–20’ ప్రకటించింది. కానీ, బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలకు అంతర్జాతీయ ఆర్థిక సాయం ఆపేస్తామన్న నేతలు తమ దేశంలో అలాంటి విద్యుదుత్పత్తికి ఎప్పుడు స్వస్తి పలుకుతారో మాట ఇవ్వనే లేదు. 

ప్రపంచ నేతలు ఎంతసేపటికీ బరువైన మాటలతో గారడీ చేస్తున్నారన్నది గ్రేటా థన్‌బెర్గ్‌ లాంటి పలువురు పర్యావరణ ఉద్యమకారుల వాదన. ‘జి–20’ సదస్సులో అధినేతల తుది ప్రకటన సైతం వారి వాదనకు తగ్గట్టే ఉంది. అదే విచారకరం. సదస్సు ముగింపు వేళ... పర్యావరణ సంక్షోభంలో తరచూ విస్మరణకు గురయ్యే మూడు మౌలిక అంశాలను గుర్తు చేస్తూ ఉద్యమకారులు థన్‌బెర్గ్, వానెస్సా నకాటే బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ సంక్షోభంపై జాగు చేయడానికి లేదన్నారు. ఏ పరిష్కారమైనా సరే పర్యావరణ మార్పు వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేసేదిగా ఉండాలన్నారు. అత్యంత భారీగా కాలుష్యం చేస్తున్నవారు తమ ఉద్గారాలపై అసంపూర్ణమైన గణాంకాలు చెప్పి, తప్పించుకుంటున్నారని ఆరోపించడం గమనార్హం. 

ఈ 16వ ‘జి–20’ సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీ విడిగా పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, సింగపూర్‌ ప్రధాని సహా పలువురితో సమావేశమయ్యారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని హరిత ప్రాజెక్టులకు అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక శాతం ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ పేర్కొన్నారు. చైనా వ్యతిరేకించడంతో ఆగిన న్యూక్లియర్‌ సప్లయిర్స్‌ గ్రూప్‌ సభ్యత్వాన్ని భారత్‌కు ఇవ్వాలనీ, అలాగే అవసరమైన సాంకేతికతను అందించాలనీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను భారత్‌ చేరుకోవడం వాటితో ముడిపడి ఉందనీ వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చేశారు. భారత్‌ అలా తన వాదన వినిపించడం బాగానే ఉంది. సదస్సు ఫలవంతమైందన్న మోదీ మాటలను ఆ మేరకే అర్థం చేసుకోవాలేమో! ఎందుకంటే, పర్యావరణ అంశాలపై పెట్టుకున్న అనేక ఆశలను ‘జి–20’ సదస్సు నెరవేర్చనేలేదని సాక్షాత్తూ ఐరాస ప్రధాన కార్యదర్శే అనేశారు. వెనువెంటనే గ్లాస్గోలో జరుగుతున్న ‘కాప్‌–26’ సదస్సులోనైనా మెరుగైన ఫలితాలు వస్తాయన్నదే ఇక మిగిలిన ఆశ. 

ఈ ఏడాది చివరికే జనాభాలో 40 శాతానికి కోవిడ్‌ టీకాల లాంటి మాటలైతే ‘జి–20’ దేశాధినేతలు అన్నారు. ధనిక, బీద దేశాల మధ్య టీకాల అందుబాటులో తేడాలను తగ్గించే వ్యూహం లేదు. ప్రస్తుతం ప్రపంచం ముంగిట ఉన్న పర్యావరణ అత్యవసర పరిస్థితి పరిష్కారంలోనూ అదే ధోరణి. రోమ్‌ నుంచి నేరుగా గ్లాస్గోలో ‘కాప్‌–26’కు వారు హాజరవుతున్నారు. అక్కడ 100కు పైగా దేశాల నేతలతో రెండు రోజులు చర్చలు... గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను తగ్గించే బృహత్‌ ప్రణాళికపై రెండు వారాల పాటు అధికారుల మల్లగుల్లాలు. కానీ, పర్యావరణ సంక్షోభంపై విజయం సాధించాలంటే ప్రగాఢమైన వాంఛ, మరింత పకడ్బందీ కార్యాచరణ అవసరం. వివిధ దేశాధినేతల సమష్టి రాజకీయ సంకల్పంతోనే అది సాధ్యం. అందుకు ప్రధాన భాగస్వామ్యదేశాల మధ్య నమ్మకం కీలకం. కానీ, ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలకు కారణమైన చైనా పక్షాన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‘కాప్‌–26’కు హాజరవడం లేదు. లిఖితపూర్వక ప్రకటనతోనే సరిపెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో. అందుకే, నిన్నటి ‘జి–20’ లానే, నేటి ‘కాప్‌–26’లోనూ అద్భుతమైన ఫలితాలు ఆశించడం కష్టమే. సదస్సులన్నీ అరుదైన ఫోటో సందర్భాలుగానే మిగిలితే, అసలు సమస్యలు తీరేదెలా? 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top