
నత్తనడకన సా..గుతూ..
ఫ ఖరీఫ్ వ్యవసాయంలో ఎడతెగని జాప్యం
ఫ వరి సాగు లక్ష్యం 76,941 హెక్టార్లు
ఫ ఆకుమడుల అంచనా 3,847 హెక్టార్లు
ఫ ఇప్పటి వరకూ పూర్తయినవి
1,857 హెక్టార్లు
ఫ ఇంకా పడాల్సినవి 1,990 హెక్టార్లు
ఫ కాలువలకు నీళ్లు వదలడంతో సరిపెట్టిన సర్కారు
ఫ పెట్టుబడి కోసం అన్నదాతల ఇక్కట్లు
పెరవలి: ఖరీఫ్ సీజన్ జూన్ ఒకటిన ప్రారంభమవుతుంది. జూలై వచ్చేసరికి వరి ఆకుమడులు పూర్తయి, నాట్లు పడే దశ ప్రారంభం కావాలి. కానీ, జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ వరి సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాధారణంగా రైతులు మే నెలలో దుక్కులు దున్ని పొలాలను ఖరీఫ్ సాగుకు సిద్ధం చేసుకుంటారు. జూన్ మొదటి వారంలో కాలువలకు నీరు వదిలిన వెంటనే వరి ఆకుమడులు వేస్తారు. అనంతరం దమ్ములు చేసి, మడులు కట్టి, నాట్లు ప్రారంభిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అయితే జూలై రెండో వారం పూర్తయ్యేసరికే నాట్లు ముగిసేవి. కానీ, ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలో దుక్కులు చేసి, జూలై నెలలో ఆకుమడులు వేస్తున్నారు. దీనికి కారణాలు కోకొల్లలు.
అందరి వేళ్లూ ప్రభుత్వం వైపే..
సాగు జాప్యానికి సంబంధించి అందరి వేళ్లూ ప్రభు త్వం వైపే చూపిస్తున్నాయి. రైతులు ముందస్తు సాగు ప్రారంభించాలనే పేరుతో ప్రభుత్వం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు కేవలం నీరు విడుదల చేసి ఊరుకుంది. కానీ, గత రబీలో ధాన్యం అమ్మిన చాలా మంది రైతులకు డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతోంది. మరోవైపు అన్నదాతా సుఖీభవ పథకం కింద ఇస్తామన్న డబ్బులూ ఇవ్వ డం లేదు. ఈ పరిస్థితుల్లో అటు ఆరుగాలం పడిన కష్టానికి ప్రతిఫలం రాక.. ఇటు అప్పులు పుట్టక రైతు లు పెట్టుబడి కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వం బదిలీల ప్రక్రియ కూడా చేపట్టింది. దీంతో, కోరుకున్న చోటు కోసం అధికారులు, సిబ్బంది అధినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో బిజీ అయిపోయారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులను పక్కన పెట్టేశారు. ఒకవేళ ఎవరైనా వెళ్దామనుకున్నా రైతులు ఎక్కడ ధాన్యం డబ్బులు అడుగుతారోననే భయంతో వెనుకంజ వేశారు. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. అలాగే, విత్తనాలు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో కావలసినంతగా లభ్యం కావడం లేదని రైతులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓవైపు సమయం మించిపోతున్న తరుణంలో చేతికి అంది వచ్చే దశలో పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
● పెట్టుబడి ఎలా..?
ఏటా ఖరీఫ్ ఆకుమడులు జూన్ నెలలో వేసేవాళ్లం. కానీ, ఈ ఏడాది పెట్టుబడికి సొమ్ము లేదు. గత్యంతరం లేక అప్పులు చేసి ఆకుమడులు వేస్తున్నాం. పంట సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకుని రావాలో తెలియడం లేదు.
– వలవల బాలాజీ, వరి రైతు, ముక్కామల
సగం కూడా పడని ఆకుమడులు
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు 76,941 హెక్టార్లలో జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. దీనికి 3,847 హెక్టార్ల మేర ఆకుమడులు అవసరం. ఇందులో ఇప్పటి వరకూ 1,857 హెక్టార్లలో (సుమారు 48 శాతం) మాత్రమే రైతులు ఆకుమడులు వేశారు. ఇంకా 1,990 హెక్టార్లలో నారు పోయాల్సి ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో పదెకరాల్లో కూడా ఆకుమడులు పడలేదు. ఉదాహరణకు కడియం మండలంలో 107 హెక్టార్ల ఆకుమడులు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 8 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో సకాలంలో పంట పూర్తయి, సజావుగా చేతికొస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నత్తనడకన సా..గుతూ..