
రుడా వైస్ చైర్మన్‌గా జేసీకి అదనపు బాధ్యతలు
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ (జేసీ) ఎస్.చిన్నరాముడు గురువారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ రుడా వైస్ చైర్మన్‌గా పనిచేసిన కమిషనర్ కేతన్ గార్గ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. బాధ్యతలు చేపట్టిన అనంతరం చిన్నరాముడు రుడా చేపట్టిన అభివృద్ధి అంశాలపై సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ అధికారి జీవీఎస్‌ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.నాగేశ్వరి, ఇతర అధికారులతో చర్చించారు.
తల్లీబిడ్డల మృతిపై
విచారణకు కలెక్టర్ ఆదేశం
గోపాలపురం: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి, గర్భంలోని బిడ్డ మృతి చెందిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తీవ్రంగా పరిగణించారు. దీనిపై గురువారం విచారణకు ఆదేశించారు. గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన వారా లక్ష్మికి నెలలు నిండటంతో కుటుంబ సభ్యులు సీహెచ్‌సీలో చేర్పించారు. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్లు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి తల్లి, బిడ్డ మృతి చెందారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో రాజమహేంద్రవరం జీజీహెచ్ గైనకాలజిస్ట్ కె.రూబినా, ఎనస్తీషియన్ బి.రాణి, అక్కమాంబ, డాక్టర్ అరుణతో కూడిన బృందం గోపాలపురం సీహెచ్‌సీలో విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.
ఆగస్టులో పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: విశాఖపట్నం డివిజన్ దువ్వాడ – తాడి సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఆగస్టు 26, 28, 30 తేదీల్లో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందుగానే ఈ విషయం ప్రకటిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (17268), గుంటూరు – విశాఖపట్నం (22876), విశాఖపట్నం – గుంటూరు (22875), విజయవాడ – విశాఖపట్నం (12718), విశాఖపట్నం – విజయవాడ (12717) రైళ్లను ఆ తేదీల్లో రద్దు చేశామని వివరించారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు
186 మంది హాజరు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు 186 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేశామన్నారు. శుక్రవారం 1,04,001 నుంచి 1,20,000 వరకు ర్యాంకు కలిగిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పరిశీలన జరుగుతుందన్నారు. అలాగే 50,001 నుంచి 90 వేల ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు.
3 నుంచి రైల్వే గేటు మూసివేత
సామర్లకోట: రైల్వే ట్రాక్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టనున్న దృష్ట్యా కడియం – ద్వారపూడి మధ్య 407 రైల్వే గేటును వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకూ మూసివేస్తున్నారు. సామర్లకోట సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రామసుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ మేరకు ద్వారపూడి పోలీసు స్టేషన్, పంచాయతీ కార్యాలయం, కేశవరం పంచాయతీ కార్యాలయం, కేశవరం కోకాకోలా కంపెనీకి, మండపేట రెవెన్యూ అధికారికి, ద్వారపూడి, కేశవరం, లారీ ఓనర్స్ అసోసియేషన్‌కు, ద్వారపూడి ఆటో అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చామని వివరించారు. ఆ రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని కోరారు.

రుడా వైస్ చైర్మన్‌గా జేసీకి అదనపు బాధ్యతలు