
శనైశ్చరస్వామి క్షేత్ర ప్రతిష్ఠను పెంచేందుకు చర్యలు
కొత్తపేట: శనిదోష నివారణకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర)స్వామి క్షేత్రంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్ర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారి (ఈఓ) డి.సురేష్‌బాబు అన్నారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఇన్‌చార్జి ఈఓగా వ్యవహరించారు. పూర్తిస్థాయి ఈఓగా రాజానగరం అన్నదాన సత్రం ఈఓగా పనిచేసిన సురేష్‌బాబు నియమితులయ్యారు. ముందుగా ఆయనకు దేవస్థానం సిబ్బంది, అర్చకులు వేదాశీర్వచనాలతో స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం సిబ్బందితో కలిసి ఆలయ ప్రాంగణం, పరిసరాలు, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఈఓ పరిశీలించారు. స్వామివారికి పూజలు, తైలాభిషేకాలు, ఇతర సేవలు, విధివిధానాలపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు.
నా భర్త ఆచూకీ తెలపండి
సామర్లకోట: బయటకు వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాలేదని, అతడి ఆచూకీ తెలియజేయాలంటూ పేకేటి శరణ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాట్లాడుతూ చంద్రంపాలెం గ్రామంలోని మసీదు చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకంపై తన భర్త శ్రీనివాసరావు ప్రశ్నించాడని, వారే అతడిని మాయం చేశారనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటకు బయటకు వెళ్లిన శ్రీనివాసరావు రాత్రి వరకు రాలేదని, దీంతో బంధువుల ఇంటిలో వాకబు చేయగా ఫలితం కనిపించలేదని తెలిపింది. కాగా.. చంద్రపాలెం మెయిన్ రోడ్డు సెంటర్‌లో శ్రీనివాసరావు జ్యూస్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో నీలం రంగు ప్యాంటు, ఎరుపు, నీలం గళ్ల షర్టు ధరించాడు. సుమారు 5.1 అడుగుల ఎత్తు ఉంటాడు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ శరణ్య చేసిన ఫిర్యాదుపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమర్థవంతంగా
మూల్యాంకన
రాజానగరం: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మూల్యాంకన ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అధ్యాపకులకు సూచించారు. గోదావరి జిల్లాల్లోని 40 అనుబంధ బీఈడీ కళాశాలల 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకణ ప్రక్రియ యూనివర్సిటీ సెమినార్ హాలులో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ ప్రక్రియను బుధవారం సందర్శించిన ఆమె.. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
అనపర్తి: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్‌పీ ఎస్సై పెబ్బిలి లోవరాజు బుధవారం తెలిపారు. ద్వారపూడి – అనపర్తి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై సుమారు 35 ఏళ్లు వ్యక్తి మృతదేహం పడి ఉందన్నారు. అతడి ఒంటిపై లేత నీలి రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు తెలిపారు. దీనిపై సమాచారం కోసం ఎస్సై 94914 44022, సీఐ 94406 27551, ల్యాండ్ లైన్ 0883 2442821 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కోత అనంతర పద్ధతులతో
పంటకు విలువ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలలో కోత అనంతరం పాటించే పద్ధతుల ద్వారా వాటి విలువ, మార్కెట్ సామర్థ్యం, నిల్వ సమయం పెరుగుతాయని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్–నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. స్థానిక జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ కార్యాలయంలో నాబార్డు సహకారంతో మంజూరు చేసిన చిల్లీ హీట్ పంప్ డ్రైయర్, టర్మిక్ ప్రాసెసింగ్ యూనిట్లను బుధవారం నాబార్డు ఏజీఎం ఎం.రాజశేఖరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. నాబార్డు ఏజీఎం ఎం.రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఐకార్–నిర్కా, నాబార్డు సంయుక్త భాగస్వామ్యంతో వాణిజ్య రంగం మరింత స్థిరంగా మారుతుందన్నారు. నాబార్డు డీడీఎం ఆర్.చక్రధర్, ఫోస్ట్ హార్వేస్ట్ విభాగాధిపతి డాక్టర్ కేఎల్ ప్రసాద్ మాట్లాడారు.

శనైశ్చరస్వామి క్షేత్ర ప్రతిష్ఠను పెంచేందుకు చర్యలు