
ముక్తేశ్వరస్వామి ఆలయంలో చోరీ
పెదపూడి: సంపర గ్రామ శివారున గల వీక్షణ ముక్తేశ్వరస్వామి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. స్వామివారి వెండి కిరీటాన్ని, అమ్మవారి బంగారు మంగళ సూత్రాన్ని దొంగలు అపహరించారు. ఎస్సై ఎస్.తులసీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ముందుగా ఆలయంలో సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. ఆలయం బయట తలుపులు పగలగొట్టి, గర్భగుడి తలుపులను ధ్వంసం చేశారు. అనంతరం స్వామివారి 1,330 గ్రాముల వెండి కీరిటం, పూజా సామగ్రి, అమ్మవారికి చెందిన ఒక గ్రామున్నర బంగారం మంగళ సూత్రాన్ని అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం అర్చకుడు ఆలయానికి వచ్చేసరికీ తలుపులు ధ్వంసం చేసి, లైట్లు వేసి, పరిసరాలు చిందరవందరగా ఉన్నాయి. ఆయన వెంటనే ఆలయ ఈఓ వడ్డాది సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. ఈఓ ఫిర్యాదు మేరకు కాకినాడ నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర వివరాలు సేకరించాయి. ఎస్సై తులసిరామ్ సంఘటన స్థలంలో స్థానికులు, ఆలయ అర్చకుడు, ఈఓతో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.