జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు | Sakshi
Sakshi News home page

జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు

Published Fri, May 10 2024 1:30 PM

జాతీయ

కపిలేశ్వరపురం: జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లకు ప్రత్యేక స్థానం ఉంది. జమీందారు బలుసు బుచ్చిసర్వారాయుడు, లక్ష్మీ వెంకట సుబ్బమ్మారావు దంపతుల కుమారులైన ఎస్‌బీ ప్రభాకర పట్టాభిరామారావు, ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కేంద్ర సహాయ మంత్రులుగా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు మంత్రి పదవులను చేపట్టిన జమీందార్లు ఎన్నికల సమయాల్లో జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లోని రాజకీయాల నుంచి వాజ్‌పేయి పాలన వరకూ జమీందార్లు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తమదైన చతురతను ప్రదర్శిస్తూ పలు పదవులను అలంకరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలోని తొలి ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గంలో పట్టాభిరామారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత బెజవాడ గోపాలకృష్ణ మంత్రి వర్గంలోనూ పనిచేశారు. తరువాత కాలంలో ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ, ఆర్ధిక శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. ఐదవ (1971), ఆరవ (1977), ఏడవ(1980) లోక్‌సభలలో సభ్యుడిగా పనిచేశారు. 1955లో తూర్పు గొదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పట్టాభిరామారావు 1953లో ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.

వాజ్‌పేయి మంత్రి వర్గంలో సత్యనారాయణరావు

కపిలేశ్వరపురం జమీందారు ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పలు కీలక పదవులు చేపట్టారు. చంటి దొరగా పిలిచే ఈయన పూర్తిపేరు శ్రీబలుసు ప్రభాకర బుచ్చికృష్ణ సత్యనారాయణరావు. 1999 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది అటల్‌బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వ్యవసాయశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. బీఏ చదివిన ఈయన 1953 జూలై 8న కపిలేశ్వరపురం గ్రామ అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ పదవిలో 1959 వరకూ కొనసాగారు. తరువాత 1959 నవంబర్‌ 1న కపిలేశ్వరపురం పూర్వపు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పదవిని చేపట్టి 1964 వరకూ కొనసాగారు. 1958 నుంచి 1964 వరకూ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ స్థానం నుంచి మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1964 సెప్టెంబర్‌ 11 నుంచి –1976 వరకూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా పనిచేశారు. తన 25వ ఏట కపిలేశ్వరపురం ఉత్పత్తిదారుల, వినియోగదారుల సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై సుమారు ఇరవై ఏళ్లు పనిచేశారు. సత్యనారాయణరావు అఖిల భారత స్థాయిలో ఇండియన్‌ సుగర్స్‌ మిల్సు అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

కేంద్ర మంత్రులుగా శ్రీబలుసు సోదరులు

జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
1/2

జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు

జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
2/2

జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు

Advertisement
 
Advertisement