ఎలన్‌ మస్క్‌ సంచలనం: వెహికల్స్‌ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర‍్వాతే ఏదైనా | Sakshi
Sakshi News home page

Elon Musk: వెహికల్స్‌ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర‍్వాతే ఏదైనా

Published Sun, Nov 7 2021 5:21 PM

Tesla Electric Vehicles Reviews Pricing and Specs - Sakshi

వాతావరణ మార్పు (క్లైమేట్‌ చేంజ్‌).. ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తున్న హాట్‌ టాపిక్‌. అడ్డగోలుగా పర్యావరణానికి తూట్లు పొడిచి మనం నిర్మించుకున్న నగరాలు, పరిశ్రమలు, వాహనాలు, లగ్జరీలు ఇప్పుడు ధరిత్రికే కాదు... మానవాళి మనుగడకే ముప్పుగా మారాయి. భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) దెబ్బకు ఈ శతాబ్దం చివరికల్లా ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలను సముద్రాలు ముంచెత్తనున్నాయని పర్యావరణవేత్తలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారు. మరోపక్క పెట్రోలు, డీజిల్‌ రేట్లు ‘సెంచరీ’ కొట్టి జేబు గుల్ల చేస్తున్నాయి. 

కట్‌ చేస్తే...
ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఆగమేఘాలపై ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్‌’ రాగం అందుకున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ఇతరత్రా శిలాజ ఇంధనాల కాలుష్యానికి చెక్‌ చెప్పేందుకు ప్రభుత్వాలు, ప్రపంచ ఆటోమొబైల్‌ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల బాట పట్టాయి. చకచకా తమ ప్లాంట్లను ‘ఎలక్ట్రిక్‌’ వేగంతో కొత్త టెక్నాలజీ వైపు పరుగులు తీయిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు... ప్రజల్లో వీటికున్న ఆదరణ... కంపెనీలు, ప్రభుత్వాల ప్రణాళికలు వంటి సంగతులను తెలుసుకోవడానికి  ఓ లాంగ్‌ డ్రైవ్‌ చేద్దాం!!

కార్లు, స్కూటర్లు, బైక్‌లు, విమానాలు, ట్రక్కులు, నౌకలు ఇలా ఒకటేంటి ప్రపంచ వాహన, రవాణా రంగం మొత్తం ‘ఎలక్ట్రిక్‌’ మయం అయ్యే రోజు మరెంతో దూరంలో లేదా? ఈ రంగంలో పెను విప్లవం చోటుచేసుకోబోతోందా? అంటే కచ్చితంగా అవుననే అంటున్నారు విశ్లేషకులు. క్లైమేట్‌ చేంజ్‌ భయాలకు తోడు పెట్రోలు, డీజిల్‌ ధరలు అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు ఇటీవలి కాలంలో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) కొనుగోళ్లను ప్రోత్సహించే విధంగా తీసుకొస్తున్న పాలసీలు, చట్టాలు, సబ్సిడీలు కూడా ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే 2030 నాటికి మొత్తం ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో ఈవీల వాటా 40 శాతానికి చేరుకోవచ్చనేది ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ అంచనా. 2016లో ప్రపంచవ్యప్తంగా 13 లక్షల ఈవీలు అమ్ముడవగా, 2020లో ఈ సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. మొత్తం ప్రపంచ లైట్‌–డ్యూటీ వెహికల్‌ మార్కెట్‌ (కార్లు, వ్యాన్‌లు ఇతరత్రా తక్కువ లోడ్‌ గల వాహనాలు)లో ఇది దాదాపు 5 శాతానికి సమానం. కాగా, 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న ఎలక్ట్రిక్‌ కార్ల సంఖ్య  ఒక కోటి మైలురాయిని అధిగమించింది. అంతేకాదు ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య 6 లక్షలు, ట్రక్కులు 31,000 మార్కును అందుకున్నాయి. కోవిడ్‌ దెబ్బతో ప్రపంచ కార్ల అమ్మకాలు 16 శాతం క్షీణించినప్పటికీ ఈవీ కార్ల సేల్స్‌ 41% ఎగబాకడం విశేషం. ప్రపంచ ఈవీ మార్కెట్లో ఇప్పటికీ చైనాదే అగ్రస్థానం.

టార్గెట్‌ 2030...
అగ్ర దేశాలతో పాటు భారత్‌ వంటి పలు వర్ధమాన దేశాలు ఈవీలపై గట్టిగా దృష్టి సారించడంతో ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా ఈవీల ఉత్పత్తి, అమ్మకాలను పరుగులు పెట్టిస్తున్నాయి. 2030 నాటికి దేశంలో పెట్రోలు, డీజిల్‌ వాహనాలకు పూర్తిగా అడ్డుకట్టవేసి (నెట్‌–జీరో), మొత్తం ఈవీల విక్రయాలే ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా బ్రిటన్‌ 2030, ఫ్రాన్స్‌ 2040 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే 10–30 ఏళ్లలో నెట్‌–జీరో లక్ష్యాలను ప్రకటించిన దేశాలు 2020 చివరి నాటికి 20కి పైగానే ఉన్నాయి. మరో 130 దేశాలు సైతం కొన్ని దశాబ్దాల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించాయి.

కంపెనీల మెగా ప్లాన్స్‌....
ఈవీల డిమాండ్‌కు అనుగుణంగా, ప్రపంచంలోని టాప్‌–20 వాహన తయారీ సంస్థలు ఈవీ వాహన మోడళ్ల సంఖ్యతో పాటు ఉత్పత్తిని కూడా భారీగా పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇక హెవీ–డ్యూటీ ఈవీల (బస్సులు, ట్రక్కులు ఇతరత్రా) తయారీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ఆల్‌–ఎలక్ట్రిక్‌ సంకేతాలిచ్చాయి. 2020లో ఎలక్ట్రిక్‌ కార్లపై వినియోగదారుల వ్యయం 120 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. ప్రభుత్వాలు కూడా ఈవీలకు మద్దతుగా 14 బిలియన్‌ డాలర్లను ఈవీ కొనుగోళ్లపై వెచ్చించాయి. కాగా, ఐఈఏ అంచనాల ప్రకారం 2030 నాటికి నార్వే, ఫిన్లాండ్‌ మొత్తం వాహన అమ్మకాల్లో 75  శాతం పైగా ఈవీలే ఉండనున్నాయి. ఇక ఆస్ట్రేలియా, అమెరికా, చైనాల్లో కూడా 2030 నాటికి అమ్మకాల్లో ఈవీల వాటా 50–60 శాతానికి చేరే అవకాశం ఉంది. భారత్‌ విషయానికొస్తే, ఇది 20–30 శాతానికి చేరుకోవచ్చని అంచనా.

భారత్‌లో ఈవీల జర్నీ ఇలా...
1993 – దేశంలో మొదటి రెండు సీట్ల ఎలక్ట్రిక్‌ కారు ‘లవ్‌బర్డ్‌’ ఆవిష్కరణ.

1996 – తొలి ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ (ఆటో) ‘విక్రమ్‌ సాఫా’ను స్కూటర్స్‌ ఇండియా ప్రవేశపెట్టింది.

1999 – మహీంద్రా అండ్‌ మహీంద్రా ‘బిజిలీ’ పేరుతో ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ను తీసుకొచ్చింది.

2000 – బీహెచ్‌ఈఎల్‌ 18 సీట్ల ఎలక్ట్రిక్‌ బస్సును రూపొందించింది.

2001 – బెంగళూరుకు చెందిన మైనీ గ్రూప్‌ రెండు సీట్ల ‘రేవా’ కారును విడుదల చేసింది. వాణిజ్యపరంగా భారత్‌లో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్‌ కారు ఇది.

2006 – ఎలక్ట్రిక్‌ టూవీర్లను తొలిసారిగా వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన కంపెనీ గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రోథర్మ్‌ ఇండియా. 2006లో తొలిసారి ఇది ‘యో బైక్స్‌’ పేరుతో తీసుకొచ్చింది.
 
2007 – ఈవీ స్కూటర్ల రంగంలోకి హీరో ఎలక్ట్రిక్‌ (అప్పట్లో అల్ట్రా మోటార్స్‌) భారీ స్థాయిలో అడుగుపెట్టింది.

 2013 – టయోటా భారత్‌లో ప్రియస్‌ ఈవీని ప్రవేశపెట్టింది. అలాగే ‘క్యామ్రీ హైబ్రిడ్‌’ కారును తెచ్చింది.

► 2015 – కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌ ఇండియా స్కీమ్‌ను ప్రవేశపెట్టడం, భారీగా సబ్సిడీలను ఆఫర్‌ చేయడం వంటివి మళ్లీ ఈవీలు జోరందుకున్నాయి. మారుతీ స్మార్ట్‌ హైబ్రిడ్‌ సియాజ్, ఎర్టిగా మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. 

  2020 – భారత్‌లో తొలి హైడ్రోజన్‌ ఎఫ్‌సీఈవీ ప్రోటోటైప్‌ వాహనాన్ని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), కార్పొరేట్‌ దిగ్గజం కేపీఐటీ కలసి విజయవంతంగా పరీక్షించాయి.

► 2020 – భారత్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రపంచ ఎలక్ట్రిక్‌ దిగ్గజం టెస్లా ప్రకటించింది.

 2021 – ఫేమ్‌–2 స్కీమ్‌ రాయితీని కేంద్రం భారీగా పెంచింది. మరోపక్క, పెట్రోలు టూవీలర్లపై 28 శాతం జీఎస్‌టీ ఉండగా, ఎలక్ట్రిక్‌ టూవీలర్లపై జీఎస్టీ 5 శాతమే. అంతేకాదు రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు లభిస్తుంది. ఈవీల కొనుగోలు కోసం తీసుకునే రుణాలపై చెల్లించే వార్షిక వడ్డీపై రూ.1.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును కూడా ప్రకటించింది.

2021 – ఉత్పత్తి ఆధారిత రాయితీ (పీఎల్‌ఐ) స్కీమ్‌ను ఈవీ పరిశ్రమకూ కేంద్రం ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ప్యాసింజర్‌ ఈవీ, హైబ్రిడ్‌ వాహన రంగంలో టాటా మోటార్స్, మెర్సిడెస్‌ బెంజ్, మహీంద్రా ఎలక్ట్రిక్, టయోటా, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, హ్యుందాయ్, అశోక్‌ లేలాండ్, ఎంజీ మోటార్స్, జేబీఎం మోటార్స్, వోల్వో, ఆడి తదితర కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులను విక్రయిస్తున్నాయి.
    
హీరో ఎలక్ట్రిక్, ఎలక్ట్రోథర్మ్‌ (యో బైక్స్‌), ఎథర్‌ ఎనర్జీ, ఒకినవా, ప్యూర్‌ ఈవీ, సింపుల్‌ ఎనర్జీ, టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఆటో, ఓలా ఎలక్ట్రిక్‌ తదితర కంపెనీలు ఈ–స్కూటర్లను విక్రయిస్తున్నాయి. రివోల్ట్‌ ఈవీ బైక్‌లను విక్రయిస్తోంది. ఫేమ్‌ స్కీమ్, వివిధ రాష్ట్రాల సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుని చూస్తే వీటి ధరలు రూ.70,000 నుంచి రూ.1.13 లక్షల మధ్యనున్నాయి. బీహెచ్‌ఈఎల్, సన్‌ మొబిలిటీ, ఎక్సైడ్, కైనటిక్‌ ఇంజినీరింగ్, టాటా పవర్‌ వంటివి దేశీయంగా లిథియం ఆయాన్‌ బ్యాటరీల తయారీ, ఇంకా పబ్లిక్‌ చార్జింగ్‌ సర్వీసులకు సంబంధించి భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నాయి.

ఈవీ... పాస్ట్‌ అండ్‌ ఫ్యూచర్‌!
1832: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని స్కాట్లాండ్‌కు చెందిన రాబర్ట్‌ ఆండర్సన్‌ రూపొందించారు.

1889: అమెరికాలో ఎలక్ట్రిక్‌ కార్లు రోడ్డెక్కాయి. పదేళ్ల పాటు వీటికి ప్రాచుర్యం లభించింది.

1901: ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్‌ వాహనాన్ని (పెట్రోలు, విద్యుత్‌ రెండింటితో నడిచేది) విఖ్యాత జర్మనీ ఆటోమోటివ్‌ ఇంజినీర్‌ ఫెర్డినాండ్‌ పోర్ష్‌ (లగ్జరీ కార్ల కంపెనీ పోర్ష్‌  వ్యవస్థాపకుడు) కనుగొన్నారు.

1920–35: తక్కువ ధరల్లో పెట్రోలు, డీజిల్‌ కార్లు హల్‌చల్‌ చేయడంతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు జనాదరణ కరువైంది. 1935 నాటికి మార్కెట్లో ఇవి పూర్తిగా మాయమయ్యాయి.

1972: జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్‌ వాహనం 

‘1602ఈ’ మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో ఆవిష్కృతమైంది. అయితే, వాణిజ్యపరంగా మాత్రం ఇది ఉత్పత్తికి నోచుకోలేదు.

1974: అమెరికాలో సెర్బింగ్‌–వ్యాన్‌గార్డ్‌ తయారు చేసిన వ్యాన్‌గార్డ్‌ సిటీ కార్‌ గొప్ప సక్సెస్‌ సాధించింది. 2,300 కార్లు అమ్ముడయ్యాయి.

1996: అమెరికా వాహన దిగ్గజం జనరల్‌ మోటార్స్‌ (జీఎం) ఎలక్ట్రిక్‌ కారు ప్రియుల కోసం ప్రత్యేకమైన ‘ఈవీ1’ కల్ట్‌ కారును విడుదల చేసింది.

1996: ప్రపంచంలో తొలిసారి వాణిజ్యపరంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ప్యూజో స్కూటెలెక్‌’ను ఫ్రాన్స్‌ వాహన కంపెనీ ప్యూజో విడుదల చేసింది.

1997: కొత్త జనరేషన్‌ హైబ్రిడ్‌ కారు (పెట్రోలు, ఎలక్ట్రిక్‌) ‘ప్రియస్‌’ను జపాన్‌ దిగ్గజం టయోటా మార్కెట్లో ప్రవేశపెట్టింది. వాణిజ్య పరంగా మంచి విజయం సాధించింది.

2008: స్టార్టప్‌ కంపెనీ టెస్లా మొట్టమొదటి లగ్జరీ ఈవీ ‘రోడ్‌స్టర్‌’ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన బీవైడీ ఆటో కూడా ఎఫ్‌3డీఎం పేరుతో ప్రపంచంలోనే మొదటి ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ను విడుదల చేసింది.

2010: జపాన్‌ కంపెనీ నిస్సాన్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘లీఫ్‌’ను ప్రవేశపెట్టింది.

2014: అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో టెస్లా గిగా ఫ్యాక్టరీ 1 పేరుతో అత్యంత భారీ బ్యాటరీ, ఈవీ ప్లాంట్‌కు తెరతీసింది.

2016: క్లైమేట్‌ చేంజ్‌పై ‘ప్యారిస్‌ ఒప్పందం’ అమల్లోకి వచ్చింది. గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ కాలుష్యానికి చెక్‌ చెప్పాలని అంగీకరించడంతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు జోష్‌ మొదలైంది. జీఎం తన తొలి ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘షెవీ బోల్ట్‌’ను విడుదల చేసింది.

2017: భారత్, యూకే ప్రభుత్వాలు 2030 నాటికి దేశంలో పూర్తిగా ఈవీల విక్రయం మాత్రమే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించాయి. ఫ్రాన్స్‌ 2040 టార్గెట్‌గా పేర్కొంది.

2020: ఏడాదికి 10 లక్షల ఈవీ విక్రయాలను టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2040 నాటికి తమ రవాణా అవసరాలన్నింటికీ ఈవీలనే వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

► 2021: పెట్రోలు, డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని 2030 నాటికి పూర్తిగా నిలిపేస్తామని, కేవలం ఈవీలనే విక్రయిస్తామని స్వీడన్‌ దిగ్గజం వోల్వో ప్రకటించింది.

2021: అమెరికాలో మూడు బ్యాటరీ ప్లాంట్లు, ఒక ఈవీ తయారీ ప్లాంట్‌ నిర్మాణం కోసం 11.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ఫోర్డ్‌ ప్రకటించింది.

2025: జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ 2025 నాటికి ఏటా 20 నుంచి 30 లక్షల ఈవీ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. బీఎండబ్ల్యూ కూడా అమ్మకాల్లో 20 శాతం ఈవీలే ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

2030: ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ఈవీలు రోడ్లపై పరుగులు తీస్తాయని అంచనా.

2040: మొత్తం ప్రపంచ వాహన విక్రయాల్లో 32 శాతం ఈవీలే ఉంటాయని అంచనా.

టెస్లా.. సంచలనం
ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో, ఆ మాటకొస్తే ప్రపంచ ఆటోమొబైల్‌ రంగంలోనే టెస్లా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఒక స్టార్టప్‌ కంపెనీగా 2003లో సిలికాన్‌ వ్యాలీలో అడుగుపెట్టిన టెస్లా... కేవలం 15 ఏళ్ల కాలంలోనే ప్రపంచ వాహన రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. 2008లో మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు ‘రోడ్‌స్టర్‌’ను విడుదల చేసింది.

ఇన్వెస్టర్‌గా కంపెనీలోకి అడుగుపెట్టి 2008లో సీఈఓగా మారిన ఎలాన్‌ మస్క్‌.. హయాంలో మోడల్‌ ఎస్, మోడల్‌ 3, మోడల్‌ వై, మోడల్‌ ఎక్స్‌ కార్లను ప్రవేశపెట్టింది. పెట్రోలు, డీజిల్‌ కార్లకు సమాన సామర్థ్యంతో ఈ ఎలక్ట్రిక్‌ కార్లు పరుగులు పెట్టడం, ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 375 నుంచి 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుండటంతో వీటికి డిమాండ్‌ జోరందుకుంది. మరోపక్క, సోలార్, బ్యాటరీలు, ఈవీల ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీల పేరుతో టెస్లా అత్యంత భారీ ప్లాంట్లను నెలకొల్పుతూ వస్తోంది.

2016లో మొదటి గిగా ఫ్యాక్టరీ అమెరికాలోని నెవాడాలో నెలకొల్పింది (ప్రస్తుతం 4 ఉన్నాయి). జర్మనీ ఇతరత్రా దేశాల్లో (భారత్‌ సహా) మరిన్ని గిగా ఫ్యాక్టరీలను నెలకొల్పే యత్నాల్లో ఉంది. ప్రస్తుతం టెస్లా మార్కెట్‌ విలువ దాదాపు 800 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ.60 లక్షల కోట్లు). టయోటా, ఫోక్స్‌వ్యాగన్, చైనా దిగ్గజం బీవైడీ, జనరల్‌ మోటార్స్, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలన్నింటి మార్కెట్‌ విలువ కంటే టెస్లాదే ఎక్కువ కావడం ఎలక్ట్రిక్‌ వాహనాల భవిష్యత్తుకు నిదర్శనం. అంతేకాదు, ప్రపంచ కుబేరులందరినీ వెనక్కి నెట్టి, మస్క్‌ ప్రపంచంలోకెల్లా అపర కుబేరుడిగా (ప్రస్తుత సంపద 200.4 బిలియన్‌ డాలర్లు) అవతరించడం కూడా ఎలక్ట్రిక్‌ చలవే!!

అంకెల్లో...
5,20,000.. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 జూలై నాటికి దేశంలో రిజిస్టర్‌ అయిన మొత్తం ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య. ఇందులో దాదాపు 4–5 లక్షల వరకూ టూ, త్రీ వీలర్లే. మిగిలిన వాటిలో కార్లు, బస్సులు ఉన్నాయి. 2020–21లో భారత్‌లో మొత్తం 2,38,000 ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధికం స్కూటర్లు, ఆటోలే.
రూ.12.5 లక్షల కోట్లు.. 2030 కల్లా భారత్‌ ఈవీ లక్ష్యాల కోసం వాహనాల ఉత్పత్తి, చార్జింగ్‌ మౌలిక సదుపాయాల కోసం అవసరమయ్యే పెట్టుబడి మొత్తం.

4,00,000.. దేశంలో 2026 నాటికి అవసరమయ్యే పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్లు. ప్రస్తుతం 2,000 చార్జింగ్‌ పాయింట్లున్నాయి.

63 లక్షలు.. 2027 నాటికి భారత్‌లో వార్షిక ఈవీ అమ్మకాల సంఖ్య అంచనా.

14 కోట్లు.. ఐఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరగవచ్చని అంచనా వేస్తున్న ఈవీల (టూ, త్రీవీలర్స్‌ మినహా) సంఖ్య.

38 కోట్లు..  ఐఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి చేరుకోనున్న మొత్తం టూ, త్రీవీలర్‌ ఈవీల సంఖ్య.

13 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్ల సంఖ్య. వీటిలో 30 శాతం ఫాస్ట్‌ చార్జర్లు.

29 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి అవసరమయ్యే ఈవీ చార్జింగ్‌ పాయింట్ల సంఖ్య.

లిథియం అయాన్‌ బ్యాటరీలదే హవా...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీల్లో లిథియం అయాన్‌ బ్యాటరీల హవా కొనసాగుతోంది. ఈవీ ధరలో 40–50 శాతం వరకు వ్యయం బ్యాటరీదే. గడచిన పదేళ్లుగా దేశంలో లిథియం అయాన్‌ బ్యాటరీ రేట్లు వార్షికంగా 20 శాతం మేర దిగొస్తున్నాయి. 2026 నాటికి ఈవీ బ్యాటరీ మార్కెట్‌ మొత్తం విలువ 166 బిలియన్‌ డాలర్లను చేరే అవకాశం ఉంది. కాగా, 2020లో లిథియం అయాన్‌ బ్యాటరీ ఉత్పత్తి 160 గిగావాట్‌–అవర్స్‌ (జీడబ్ల్యూహెచ్‌)కు ఎగబాకింది.

2030 నాటికి ఇది 1,300 జీడబ్ల్యూహెచ్‌కు దూసుకెళ్లొచ్చని బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎనర్జీ ఫైనాన్స్‌ (బీఎన్‌ఈఎఫ్‌) నివేదిక పేర్కొంది. కాగా, ప్రపంచ ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో చైనా 70 శాతం వాటాతో టాప్‌లో ఉంది. లిథియం అయాన్‌ బ్యాటరీల్లో గ్రాఫైట్, నికెల్, అల్యూమినియం, లిథియం, కోబాల్ట్‌ ఇంకా మాంగనీస్‌లను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇందులో లిథియం మైనింగ్‌ అనేది అత్యంత క్లిష్టతరం కావడం, ఈ లోహపు లభ్యత పరిమితం కావడం కూడా బ్యాటరీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

100% కాలుష్య రహితం కాదా?
ఎలక్ట్రిక్‌ వాహనాలు నిజంగానే 100% పర్యావరణహితమైనవి కావా... ఇవి కూడా కాలుష్యానికి ఎంతో కొంత కారణమవుతాయా? దీనికి అవుననే చెప్పక తప్పదు. ఎందుకంటే, ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలను చార్జింగ్‌ చేయడానికి ఉపయోగించే విద్యుత్‌ ఉత్పత్తి వల్ల భారీగా కర్బన ఉద్గారాలు విడులవుతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 29 శాతమే. అంటే 71% ఉత్పత్తి కాలుష్యకారకమైనదే.

అదేవిధంగా ఈవీల తయారీ ప్రక్రియ కూడా గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతుంది. ఉదాహరణకు సంప్రదాయ పెట్రోలు/డీజిల్‌ కారు తయారీతో పోలిస్తే ఈవీ ఉత్పత్తిలో 15 శాతం అధిక కర్బన ఉద్గారాలు విడుదలవుతాయని అంచనా. ఈవీల లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో వాడే లోహాల కోసం జరిపే గనుల తవ్వకం ఇతరత్రా ప్రక్రియల రూపంలో భారీగా వాతావరణంలోకి కాలుష్యం విడుదలవుతుంది. అయితే, ఒక్కసారి ఈవీలు తయారయ్యాక వాటి జీవితకాలంలో నెట్‌–జీరో కాబట్టి కాలుష్య ప్రభావం అనేది పాక్షికమేననేది పరిశ్రమవర్గాల మాట.

చార్జింగ్‌ స్పీడ్‌ పెరగాలి...
ఎలక్ట్రిక్‌ వాహనాలను ఇంట్లో సాధారణ ప్లగ్‌ సాకెట్‌ (13 లేదా 15 యాంప్‌)తో కూడా చార్జ్‌ చేసుకోవచ్చు. అయితే పూర్తి చార్జింగ్‌కు కనీసం 6–12 గంటలు పడుతుంది. అదే పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లో అయితే డీసీ ఫాస్ట్‌ చార్జర్లతో 60–110 నిమిషాల్లో, ఏసీ స్లో చార్జర్లతో 6–7 గంటల్లో ఫుల్‌ చార్జ్‌ చేసుకోవచ్చు. సగటున ఫాస్ట్‌ చార్జర్లతో నిమిషానికి 1.5–3 కిలోమీటర్ల రేంజ్‌ చార్జింగ్‌ అవుతుంది. అయితే, ఈ చార్జింగ్‌ వ్యవధి భారీగా దిగొస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలను డిమాండ్‌ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది.

దీనికి అనుగుణంగానే ఆటోమేషన్‌ రంగంలో ప్రపంచ దిగ్గజం ఏబీబీ తాజాగా అల్ట్రా ఫాస్ట్‌ చార్జర్‌ ‘టెరా 360’ని విడుదల చేసింది. దీంతో 100 కిలోమీటర్ల రేంజ్‌ వరకు కార్‌ బ్యాటరీని చార్జ్‌ చేయడానికి కేవలం 3 నిమిషాలే పడుతుంది. అంతేకాదు ఎలాంటి ఎలక్ట్రిక్‌ కారునైనా 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్‌ చేసేయొచ్చని కంపెనీ ప్రకటించింది. దీంతో ఏక కాలంలో 4 కార్లను చార్జ్‌ చేయొచ్చని కూడా అంటోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement