
రూపే క్రెడిట్ కార్డుతో చక్కని వెసులుబాటు
జీపే, ఫోన్‌పే, పేటీఎంతో అనుసంధానం
ప్రతీ రూ.100 చెల్లింపులపై రివార్డులు
బ్యాంకుల మధ్య పోటీతో మెరుగైన ప్రోత్సాహకాలు
అన్నీ తెలుసుకున్న తర్వాతే ఎంపిక
ప్రీతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వేతనంతోపాటు ఖర్చులూ ఎక్కువే. దీంతో క్రెడిట్ కార్డును వినియోగిస్తోంది. దీనిపై రివార్డు పాయింట్లతో పాటు, తర్వాత చెల్లించే వెసులుబాటు ఆమెకు సౌకర్యంగా అనిపించింది. కానీ, చిన్న చిన్న చెల్లింపులకు, కొన్ని షాపుల్లో క్రెడిట్ కార్డు స్వైప్‌నకు అవకాశం ఉండకపోవడం అసౌకర్యంగా భావించింది. ఇదే సమయంలో రూపే కార్డు గురించి విన్న ఆమె వెంటనే దానికి దరఖాస్తు చేసుకుంది.
రూపే క్రెడిట్ కార్డు అయితే యూపీఐకి లింక్ చేసుకుని సులభంగా చెల్లించడం ప్రీతిని ఎంతగానో ఆకర్షించింది. ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులను రూపే కార్డు నుంచే చేస్తోంది. నిజమే సాధారణ క్రెడిట్ కార్డులతో పోల్చితే.. రూపే క్రెడిట్ కార్డుతో ఎక్కడైనా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులకు అవకాశం ఉండడం ఎంతో మందికి అనుకూలించే అంశం. ఇందుకు ఆర్‌బీఐ ఎప్పుడో అవకాశం కల్పించింది. ఈ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు, రిస్‌్కల గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. – సాక్షి, బిజినెస్ డెస్క్
అన్ని క్రెడిట్ కార్డుల మాదిరే యూపీఐ కార్డు కూడా పనిచేస్తుంది. ఒక్క రూపే క్రెడిట్ కార్డ్‌ను మాత్రం యూపీఐతో లింక్ చేసుకుని సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తూ 2022 జూలైలోనే ఆర్‌బీఐ నిర్ణయం ప్రకటించింది. నాన్ రూపే క్రెడిట్ కార్డులకు ఈ వెసులుబాటు లభించలేదు. దాంతో రూపే క్రెడిట్ కార్డులు ఆకర్షణీయంగా మారాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులకు బ్యాంకులు అదనపు (యాడ్–ఆన్) రూపే కార్డులను ఇవ్వడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు నేరుగా కో–బ్రాండెడ్, సొంత రూపే కార్డులనే కొత్త కస్టమర్లకు జారీ చేస్తున్నాయి. సాధారణంగా యూపీఐ చెల్లింపులు ఏ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసినా.. బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తం వెళుతుంది. రూపే క్రెడిట్ కార్డును అనుసంధానం చేసుకుంటే.. యూపీఐ చెల్లింపుల సమయంలో బ్యాంక్ ఖాతా లేదంటే రూపే క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకుని లావాదేవీలను పూర్తి చేయొచ్చు.
అనుకూలతలు
రూపే క్రెడిట్ కార్డుతో ఉన్న ప్రధాన సౌకర్యం.. కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చెల్లింపుల సమయంలో స్వైప్ చేయాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. యూపీఐ యాప్‌నకు ఒక్కసారి లింక్ చేస్తే చాలు. భౌతిక కార్డు లేకుండానే లావాదేవీ ముగించొచ్చు. పీవోఎస్‌పై క్రెడిట్ కార్డు స్వైప్‌నకు కొందరు వర్తకులు అంగీకరించరు. మర్చంట్ డిస్కౌంట్ రేటు చెల్లించాల్సి వస్తుందని సుముఖత చూపించరు. రూపే క్రెడిట్ కార్డు విషయంలో యూపీఐ ద్వారా చెల్లిస్తారు కనుక ఈ ఇబ్బంది ఉండదు. ఒక రూపే క్రెడిట్ కార్డును ఒకటికి మించి యూపీఐ యాప్‌లపై లింక్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ లేని సందర్భాల్లోనూ రూపే క్రెడిట్ కార్డు సాయంతో చెల్లింపులు చేయొచ్చు. ఎంత చిన్న మొత్తం అయినా క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేసి చెల్లించొచ్చు. దీనివల్ల ప్రతీ లావాదేవీ బ్యాంక్ ఖాతాలో బదులు క్రెడిట్ కార్డు, యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో నమోదవుతుంది. బ్యాంక్ ఖాతాలో చిన్న చిన్న లావాదేవీలు లేకుండా చేసుకోవచ్చు.
యూపీఐ క్రెడిట్ కార్డుపై ఇప్పుడు చాలా బ్యాంక్‌లు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్నా యి. వీటన్నింటినీ పరిశీలించాక మెరుగైన ప్రయోజనాలతో కూడిన కార్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకుల మధ్య ఈ ప్రయోజనాలు, ఫీజులు వేర్వేరుగా ఉన్నాయి. ప్రతి రూ.100 వ్యయంపై సాధారణంగా ఒక పాయింటు రివార్డుగా లభిస్తుంది. ఉదాహరణకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ అయితే.. ‘ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు’పై రూ.2,000 లావాదేవీపై రూ.60 రివార్డు పాయింట్లను ఆఫర్ చేస్తోంది.
ఈ రివార్డు పాయింట్లతో బహుమతులు కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే డిస్కౌంట్ పొందొచ్చు. కొన్ని బ్యాంక్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. సకాలంలో బిల్లు చెల్లింపులు చేయడం ద్వారా క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో రుణాలను సులభంగా చౌక రేటుకే పొందొచ్చు. రోజువారీ యూపీఐ చెల్లింపులు చేసే వారికి రూపే క్రెడిట్ కార్డు ఎంతో సౌకర్యం, అనుకూలం. ఒక యూపీఐ యాప్‌పై ఎన్ని రూపే క్రెడిట్‌కార్డులను అయినా లింక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు.
పరిమితులు
⇒ రూపే క్రెడిట్ కార్డుతో ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా నగదు బదిలీకి అవకాశం లేదు.
⇒ క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ యాప్ నుంచి చెల్లింపులకు పిన్ తప్పనిసరి. పిన్ లేకుండా చెల్లింపులు కేవలం యూపీఐ లైట్ ద్వారానే సాధ్యం. యూపీఐ లైట్‌లో బ్యాలన్స్ లోడ్ చేసుకోవడం అన్నది రూపే క్రెడిట్ కార్డుతో సాధ్యపడదు. కేవలం యూపీఐ లింక్డ్ సేవింగ్స్ ఖాతా నుంచే చేసుకోవాల్సి ఉంటుంది.
⇒ యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు నుంచి ఒక రోజులో గరిష్టంగా రూ.లక్ష వరకే చెల్లించగలరు. ఎందుకంటే దాదాపు అన్ని యూపీఐ యాప్‌లు, బ్యాంక్‌లు రోజువారీ యూపీఐ పరిమితి రూ.లక్షగానే అమలు చేస్తున్నాయి. విడిగా రూపే క్రెడిట్ కార్డు రోజువారీ లిమిట్ ఇంకా తక్కువ ఉండొచ్చు. రూ.లక్షకు మించి ఉన్నప్పటికీ యూపీఐ ద్వారా రూ.లక్ష వరకే చెల్లింపులు చేయగలరు.
⇒ విద్య, ఆరోగ్యం, బీమా తదితర కొన్ని విభాగాల చెల్లింపులకు రోజువారీ యూపీఐ పరిమితి రూ.లక్షకు బదులు రూ.2 లక్షలుగా ఉంటుంది.
⇒ విదేశీ ప్రయాణాలు చేసే వారికి రూపే క్రెడిట్‌కార్డు కంటే రెగ్యులర్ కార్డులు అనుకూలం.
⇒ రూపే క్రెడిట్ కార్డుతో ఫ్యుయెల్ స్టేషన్లలో చెల్లింపులు చేస్తే సర్‌చార్జీ పడుతుంది. చాలా బ్యాంక్‌లు వీటిని మాఫీ చేస్తున్నాయి.
క్రెడిట్ లిమిట్
కార్డు వినియోగ పరిమితి (రుణం) వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో రెగ్యులర్ క్రెడిట్ కార్డులకు వర్తించే నిబంధనలే వీటికీ అమలవుతాయి. కొన్ని బ్యాంక్‌లు ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తాయి. వినియోగ తీరు, చెల్లింపుల ఆధారంగా భవిష్యత్తులో ఈ లిమిట్‌ను క్రమంగా పెంచుకునేందుకు అనుమతిస్తుంటాయి.
కొన్ని భద్రతా చర్యలు
⇒ రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులను ప్రతి రోజూ ఒకసారి పరిశీలించుకోవాలి. కార్డు స్టేట్‌మెంట్‌ను చూడడం వల్ల ఏవైనా మోసపూరిత లావాదేవీలు ఉంటే వెంటనే గుర్తించొచ్చు.
⇒ యూపీఐ యాప్‌లకు తప్పకుండా ఫింగర్‌ప్రింట్ లేదా పిన్ నంబర్ పెట్టుకోవాలి. పిన్ అయితే ఊహించడానికి సులభంగా ఉండకూడదు.
⇒ యూపీఐ చెల్లింపులకు పేరొందిన గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, బ్యాంక్ యూపీఐ యాప్‌లను వినియోగించడం మంచిది.
చార్జీలు
⇒ రూపే కార్డుతో చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీల్లేవు. కానీ, కొన్ని యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు రూపే కార్డు ఆధారిత యూపీఐ చెల్లింపులు, రీచార్జ్‌లపై కనీ్వనియెన్స్ చార్జీలు విధించొచ్చు.
⇒ క్రెడిట్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే లేట్ పేమెంట్ చార్జీలు పడతాయి. గడువులోపు చెల్లించని మొత్తంపై వడ్డీ 18 శాతం నుంచి 48 శాతం మధ్య పడుతుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ అయితే క్రెడిట్ స్కోరు ఆధారంగా 9 శాతం రేటును కూడా ఆఫర్ చేస్తోంది. అదే యాక్సిస్ బ్యాంక్ అయితే నెలవారీ 45 శాతం వడ్డీ రేటును యూపీఐ క్రెడిట్‌పై అమలు చేస్తోంది.
⇒ కొన్ని చెల్లింపులను ఈఎంఐ కింద మార్చుకునేందుకు బ్యాంక్‌లు అనుమతిస్తుంటాయి. అలాంటి సమయంలో రెగ్యులర్ క్రెడిట్‌కార్డుల మాదిరే ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది.
⇒ కొన్ని బ్యాంక్‌లు జీవితకాలం పాటు ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా రూపే కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని వార్షిక చార్జీలు అమలు చేస్తున్నాయి.
కార్డులు – ప్రయోజనాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్
⇒ పేజాప్ (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్), గ్రోసరీలు, సూపర్ మార్కెట్, డైనింగ్, యూపీఐ లావాదేవీలపై 3 శాతం క్యాష్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. నెలవారీ గరిష్ట పాయింట్లు 500.
⇒ యుటిలిటీ చెల్లింపులపై 2 శాతం క్యాష్ పాయింట్లు (నెలకు గరిష్టంగా రూ.500), ఇతర వ్యయాలపై 1 శాతం క్యాష్ పాయింట్లు (నెలవారీ గరిష్ట పాయింట్లు 500) లభిస్తాయి.
⇒ ఏడాదిలో కార్డుపై వ్యయం కనీసం రూ.25వేలు చేస్తే వార్షిక ఫీజు మాఫీ అవుతుంది.
మింత్రా కోటక్ క్రెడిట్ కార్డు
⇒ మింత్రాపై రూ.750 వరకు లావాదేవీలపై 7.5 శాతం తగ్గింపు లభిస్తుంది.
⇒ స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, పీవీఆర్, క్లియర్‌ట్రిప్, అర్బన్ కంపెనీ ప్లాట్‌ఫామ్‌లపై నెలలో రూ.1,000 వరకు చేసే వ్యయాలపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
⇒ ఇతర లావాదేవీలపై 1.25 అపరిమిత క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
⇒ త్రైమాసికంలో కార్డుపై వ్యయం రూ.50,000 తక్కువ కాకుండా ఉంటే, రెండు పీవీఆర్ టికెట్లు (ఒక్కోటీ రూ.250 చొప్పున) ఉచితంగా లభిస్తాయి.
యస్ బ్యాంక్ పైసా బజార్ పైసాసేవ్ క్రెడిట్ కార్డు
⇒ ఆన్‌లైన్ కొనుగోళ్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు (నెలకు గరిష్టంగా 5,000 పాయింట్లు) అందుకోవచ్చు. 5,000 పాయింట్ల పరిమితి తర్వాత చేసే చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు వస్తాయి.
⇒ ఇతర చెల్లింపులు, యూపీఐ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు లభిస్తాయి.
⇒ ఈ పాయింట్లను క్రెడిట్ బిల్లులో సర్దుబాటు చేసుకోవచ్చు.
⇒ ఏడాదిలో రూ.1.2 లక్షల వ్యయం చేస్తే రెన్యువల్ ఫీజు రూ.499 మాఫీ అవుతుంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు
⇒ జాయినింగ్ ఫీజు రూ.200, రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు రూ.199 అమలవుతుంది.
⇒ రూ.2,000లోపు యూపీఐ చెల్లింపులపై ఒక శాతం రివార్డులు, రూ.2,000 మించి చేసే చెల్లింపులపై 3 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి.
⇒ అన్ని యుటిలిటీ, బీమా చెల్లింపులపై ఒక శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి.