రాష్ట్రపతి ముఖ్యఅతిధిగా ‘జాతీయ సరస్‌ మేళా-2026’ | President as Chief Guest to National Saras Mela 2026 in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ముఖ్యఅతిధిగా ‘జాతీయ సరస్‌ మేళా-2026’

Oct 13 2026 9:03 AM | Updated on Oct 13 2026 9:05 AM

President as Chief Guest to National Saras Mela 2026 in Andhra Pradesh

గ్రామీణ మహిళా వ్యాపారవేత్తల ప్రతిభకు జాతీయ వేదికను కల్పిస్తూ దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్‌సీఆర్‌) వెలుపల తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వేదికగా ‘జాతీయ సరస్‌ మేళా-2026’ ప్రారంభం కానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో పున్నమి ఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31 వరకు ఈ వేడుక జరుగనుంది.

ఈ నెల 15న ఉదయం 11.30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేళాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమ స్ఫూర్తితో సాగుతున్న ఈ మేళా.. 2029 నాటికి ఆరు కోట్ల మందిని ‘లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తరలివచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 1,500 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్న ఈ మేళా ద్వారా వారి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ లభించనుంది.

సంస్కృతి, సంప్రదాయాల సంగమం

మేళాలో పంజాబ్‌ ఫుల్కారీ, జమ్మూకశ్మీర్‌ పష్మీనా, తెలంగాణ ఇకత్‌, తేలియా రుమాల్‌తో పాటు దేశవ్యాప్త హస్తకళలు, మీనాకారీ, డోక్రా కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 50 ఆహార విక్రయ కేంద్రాల ద్వారా వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు సిద్ధం చేయనున్నారు. మహిళల సమష్టి శక్తికి ప్రతీకగా 16 అడుగుల ఎత్తైన ‘శక్తి–ది స్పిరిట్‌ ఆఫ్‌ లఖ్‌పతి దీదీ’ ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement