మాతోనే రామాలయ అభివృద్ధి | Sakshi
Sakshi News home page

మాతోనే రామాలయ అభివృద్ధి

Published Fri, May 10 2024 6:40 PM

మాతోనే రామాలయ అభివృద్ధి

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి హామీకి కట్టుబడి ఉన్నామని, ముమ్మాటికి భద్రాచలం అభివృద్ధి తమతోనే సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన భద్రాచలం పట్టణంలోని జ్ఞాన మందిరం గుట్టపై నుంచి రామాలయం వ్యూ పాయింట్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో మాట్లాడుతూ.. అభివృద్ధిలో భాగంగా తొలగించాల్సిన ఇళ్ల నివేదికను త్వరాగా అందజేయాలని ఆదేశించారు. మాడ వీధుల విస్తరణతో పాటు భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. భద్రాచలం వచ్చిన భక్తులు ఎక్కువ సమయం గడిపేలా ఉపాలయాల విస్తరణతో పాటు టూరిజం హబ్‌ను కేంద్రీకృతం చేసేలా ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో సోలార్‌ అమర్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తద్వారా విద్యుత్‌ ఆదాతో పాటు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో కచ్చితంగా రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. దేశంలో అయోధ్య మాదిరిగా భద్రాచలం రామాలయం పేరు వినిపించేలా పనులు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, నాయకులు రసూల్‌, యశోద రాంబాబు, తోటకూరి రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వాహనం తనిఖీ..

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాహనాన్ని స్థానిక కూనవరం రోడ్డులోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఎఫ్‌ఎస్‌టీ బృందాలు తనిఖీ చేశాయి. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో గురువారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి తుమ్మల.. కూనవరం రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా చెక్‌పోస్ట్‌ వద్ద ఎఫ్‌ఎస్‌టీ బృందాలు వాహనాన్ని తనిఖీ చేశాయి.

సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుతాం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Advertisement
 
Advertisement