
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు
గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
జిల్లాలో బాధితులు అధికమే...
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్‌లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్‌లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు.
చట్టం ఏం చెబుతోందంటే..
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్‌లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్‌లు, జనసంచారం ఉండే మార్కెట్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి.
పొగాకు వినియోగంతో క్యాన్సర్
క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్‌కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్‌పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు.
– డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు
ధూమపానంతో గుండెజబ్బులు
పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే.
– డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్
జీజీహెచ్‌లో ఉచిత కౌన్సెలింగ్
గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్‌థర్మల్ ప్యాచ్‌ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు.

పొగాకు.. ఆరోగ్యానికి చేటు

పొగాకు.. ఆరోగ్యానికి చేటు

పొగాకు.. ఆరోగ్యానికి చేటు