సాక్షి, అన్నమయ్య: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పుంగనూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పచ్చ మూక దాడిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ మిథున్ రెడ్డికి గాయలయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిపై కర్రలతో దాడి చేయడంతో ఆయన తలకు గాయమై రక్తస్త్రావం జరిగింది. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పుంగనూరు మున్సిపాలిటీ లో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ వాహనాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) October 16, 2026
వివరాల మేరకు.. పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. దాదాపు 10 వాహనాలు ధ్వంసమైనట్టు సమాచారం. ఇంత జరుగుతన్నా ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. టీడీపీ నేతల దాడిలో పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి గాయాలైనప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు.

వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఆఫీసులోకి వెళ్లిన అనంతరం.. టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయాయి. నామినేషన్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఆఫీసు బయట ఉన్న గేట్ల నుంచి తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆఫీసు బయట ఉన్న వైఎస్సార్సీపీ నేతల కార్లను ధ్వంసం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు.. ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక రూమ్కు తరలించారు. గంట సేపటి నుంచి మిథున్ రెడ్డి నామినేషన్ సెంటర్లోనే ఉన్నారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ నేతల వాహనాలకు నిప్పు అంటించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

ఇదీ చదవండి: ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!


