
సెప్టెంబర్ 5న అవార్డు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి
భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమిలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని తిరుమల శ్రీదేవి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 24 సంవత్సరాలుగా బోధన వృత్తిలో ఉన్న ఆమె నాలుగేళ్లుగా ఇక్కడ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ‘కం టు లెర్న్ అండ్ గో టు సర్విస్ నేషన్’ అనే విధానంతో ఆమె విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఆధునిక బోధన విధానంలో డిజిటల్ బోర్డు వినియోగంతోపాటు ఆయా పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా వివరిస్తూ, వాటిపై పూర్తిస్థాయి అవగాహన కలి్పస్తున్నారు.
విద్యార్థులతో పలు అంశాలపై ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయిస్తారు. దీనివల్ల పాఠ్యాంశాలు బాగా అర్థమై విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 2015లో 8వ తరగతి విద్యార్థులు వర్షం నీటితో భూగర్భ జలాలను ఎలా పెంచాలనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐదో స్థానం లభించింది. అలాగే గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. వినూత్న పద్ధతుల్లో బోధన, దాని ఫలితాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపిక చేసింది. ఇప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. అవార్డును సెప్టెంబర్ 5వ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.
విద్యార్థులకు మేలు
మారుతున్న విద్యావిధానాలు, సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో మంచి ఆలోచన విధానం ఏర్పడటంతోపాటు ప్రతిభ కూడా తెలుస్తుంది. దీనివల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం కాకుండా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. – తిరుమల శ్రీదేవి, ప్రధానోపాధ్యాయిని, భీమిలి