చంద్రబాబు డైరెక్షన్లో ఖాకీ ఓవరాక్షన్
అధికారపక్షానికి జీ హుజూర్ అంటున్న పోలీసులు
ప్రతిపక్షాన్ని కట్టడిచేసేందుకు రకరకాల కుయుక్తులు
పోటీ చేద్దామనే ఆశావహులను నిలువరించే కుట్రలు
బైండోవర్ బెదిరింపులు.. పాత కేసులతో వేధింపులు
పల్నాడులో రెండు రోజుల్లో 1,688 మందిపై బైండోవర్ కేసులు
పోటీ చేస్తే బలైపోతావ్ అంటూ రాయచోటిలో మంత్రి హెచ్చరికలు
తాడిపత్రిలో కౌన్సిలర్ అభ్యర్థి కుటుంబానికి జేసీ అనుచరుల బెదిరింపులు
ప్రతిపక్ష అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ల జారీలో జాప్యం
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్న అధికారపక్షం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు స్థానిక ఎన్నికల్లో గెలిచి సాధించేది ఏముంది. అధికారపార్టీకి పోటీగా నిలిచి అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు. మంచిగా చెబుతున్నాను వినండి. మర్యాదగా పోటీ ఆలోచన విరమించుకోండి. నా మాట వినకపోతే తర్వాత పర్యవసానాలు మీరు తట్టుకోలేరు. – ఇది రైల్వేకోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు బెదిరింపు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో పోలీసుల ఓవరాక్షన్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాగైనా గెలవాలన్న దుగ్థతో అధికారపార్టీ నేతల కనుసన్నల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై బెదిరింపుల పర్వానికి తెరలేపారు. కొందరు పోలీసులు మరీ అడ్డగోలుగా పేట్రేగిపోతున్నారు. ఇందులో భాగంగానే పల్నాడు, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో పోలీస్ బాస్‌ల నుంచి సీఐ, ఎస్సై వరకు రంగంలోకి దించింది.
వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగాలనుకుంటున్న ఆశావహుల వివరాలు నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. వారిపై ఏమైనా పాత కేసులు ఉన్నాయేమో చూస్తున్నారు. లేదంటే కొత్త కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు పిలిచి బైండోవర్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేసి అనవసరంగా సమస్యలు ఎందుకు తెచ్చుకుంటారు?’, ‘కేసుల్లో ఇరుక్కుంటే ఇబ్బందులు పడతారు’ అంటూ హెచ్చరిస్తున్నారు.
అన్ని జిల్లాల్లోనూ బైండోవర్ల ఉచ్చు?
» విజయనగరం జిల్లాలో ఏకంగా 20 వేల మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం ప్రకటించారు. బైండోవర్ కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బైండోవర్ కేసుల్లో ఒక్కొక్కరి దగ్గర రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు సొంత పూచీకత్తు తీసుకున్నామన్నారు.
» తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల కుటిల పన్నాగంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బైండోవర్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నియోజకవర్గంలో మొత్తం బైండోవర్ కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్సీపీ నాయకులపై నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పుల్లంపేటలో 80, ఓబులవారిపల్లిలో 121, పెనగలూరులో 70, చిట్వేలిలో 190, కోడూరులో 120 వరకు బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు తెల్సింది. ఇప్పటికే నియోజకవర్గంలో లక్కిరెడ్డిరాజారెడ్డి, పలిగల రాజశేఖర్, జనార్ధన్, మల్లికార్జున, మహేష్, పోలిమహేంద్రరెడ్డి, సయ్యద్ ముస్తాక్, మల్లురామక్రిష్ణారెడ్డి తదితరులపై నమోదు చేసారు. ఇంకా నాయకులు, కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు అధార్ కార్డులు తీసుకొని రమ్మంటున్నారు.
» జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అధికార పక్షం పోలీసుల ద్వారా బెదిరింపుల పర్వం తీవ్రరూపం దాల్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకుంటున్న వైఎస్సార్సీపీకి చెందిన ఓ బలమైన అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని, నియోజకవర్గ ఎమ్మెల్యే పీఏ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ వేదికగా బెదిరింపులకు దిగారు. సదరు అభ్యర్థికి చెందిన వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తామని, వాటిని దెబ్బతీస్తామని హెచ్చరిస్తూ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, మరికొందరు అభ్యర్థులను సైతం ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
» పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిగుడురాళ్ల, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల్లో రెండు రోజుల్లోనే ఏకంగా 1,688మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. వారిలో దాదాపు 60శాతం వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరులే కావడం గమనార్హం.
» గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో 290మందిని బైండోవర్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి బైండోవర్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు.
» తిరుపతి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పలు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్, పార్టీ కార్యకర్తలు మూర్తి ప్రేమ్‌కుమార్, పి.మస్తాన్ తదితరులపై ఎటువంటి కారణాలు లేకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.
»నంద్యాల జిల్లా పాణ్యంలో 38మందిని, అన్నమయ్య జిల్లా పీలేరులో 133మందిని బైండోవర్ చేశారు.
» కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై బైండోవర్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలకు పోలీస్స్టేషన్ల నుంచి పిలుపులు వచ్చాయి. గతంలో మీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి.. తక్షణమే స్టేషన్‌కు వచ్చి బైండోవర్ కావాలని బుధవారం పిలుపులు రావడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఈ విషయాన్ని డీఎస్పీ ఏబీజీ తిలక్ దృష్టికి తీసుకెళ్లారు.
» శ్రీకాకుళం జిల్లాలో బైండోవర్ కేసుల నమోదు చేస్తున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం ప్రకటించారు. వజ్రపుకొత్తూరు మండలంలోని 37 పంచాయతీల్లో 393 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వజ్రపుకొత్తూరు ఇన్చార్జి ఎస్ఐ అప్పలరెడ్డి తెలిపారు. హిరమండలంలో 55 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి.
» వైఎస్సార్ కడప జిల్లాలో రెండు రోజుల నుంచి పోలీసులు బైండోవర్లను ప్రారంభించారు. కడప కార్పొరేషన్‌తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలు, రెండు మేజర్ పంచాయతీలు, 39 మండలాల పరిధిలో పోలీసు యంత్రాంగం బైండోవర్లు చేస్తున్నారు. కడప నగర కార్పొరేషన్ పరిధిలో దాదాపు 110 మందిని బైండోవర్ చేస్తే వారిలో కేవలం 85 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కావడం గమనార్హం. కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 350 మందిని బైండోవర్ చేస్తే వారిలో ఏకంగా 290 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతి పార్టీల వారు ఉన్నారు.
పిడుగురాళ్ల.. ‘నో డ్యూ’ ఇవ్వకుండా వేధింపులు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు పాక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న అధికారులు అదే అధికారపక్షం అభ్యర్థులకు ఆగమేఘాలపై ఇచ్చి పంపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిప్పుతూ, సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి, చివరకు మరుసటి రోజు రావాలని చెబుతున్నారు.
పెడన.. భయపెట్టి తప్పించారు....
కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని 18వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ కావడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఒక ప్రైవేటు ఉద్యోగిని అభ్యర్థిగా రంగంలోకి దించారు. విద్యావంతుడు, స్థానికంగా మంచి పేరున్న వ్యక్తి కావడంతో పాటు వైఎస్సార్సీపీ అంటే అభిమానంతో బరిలో నిలబడేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. తాను కాకపోయినా తన భార్యనైనా నిలబెట్టడానికి ఆసక్తి చూపారు. వీరిద్దరిలో ఎవరు నిలబడినా సీటు వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని భావించిన అధికార పార్టీ నాయకులు సదరు అభ్యర్థిని పరోక్షంగా తాను ఉద్యోగం చేస్తున్న సంస్థలోని ఉన్నతస్థాయి వ్యక్తులతో హెచ్చరించినట్లుగా సమాచారం. దీంతో ఈ గొడవలు తనకెందుకని భావించి ఆయన విషయాన్ని వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చి, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేశారు.
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలు..
స్థానిక ఎన్నికల కోడ్‌ను అధికారపక్షం యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. విజయనగరం రైతు బజారులో చంద్రబాబు ఫొటోతో బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఆయన చిత్రంతోనే అమ్మకాలు చేయాలంటూ అధికారులు ఆదేశించినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. గుంటూరు నగర వ్యాప్తంగా టీడీపీ నేతల ఫ్లెక్సీలు, ఎమ్మెల్యేతో పాటు మేయర్ పదవిని ఆశిస్తున్న నేతల ప్రచార చిత్రాలు కనిపిస్తున్నాయి. వాటిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
‘‘కర్నూలులోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ప్రశాంత్, పెయింటర్ చిట్టిబాబు, ఎలక్ట్రీషియన్ నూర్ అహ్మద్‌లను పోలీసులు టార్గెట్ చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడమే వారు చేసిన నేరం. తెల్లవారు జామున వాళ్ల ఇళ్లలోకి చొరబడి తనిఖీల పేరుతో భయాందోళనలకు గురిచేశారు. బీరువాలు తెరిచి సామాన్లు చిందరవందరగా పడేశారు.’’

తాడిపత్రి.. జేసీ అనుచరుల దాష్టీకం...
తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేస్తే నీ భర్తను చంపేస్తామంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి సాయిజ్యోతిని టీడీపీ నేత జేసీ అనుచరుడు రఘు, రౌడీలతో కలిసి ఇంటికి వెళ్లి మరి బెదిరింపులకు దిగాడు. తాడిపత్రి పట్టణంలోని నగరంలోని శాస్త్రినగర్‌లో ఉంటున్న వైఎస్సార్సీపీ నేత మడ్డిపల్లి వేణుగోపాల్‌రెడ్డి, తన భార్య సాయిజ్యోతితో 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
విషయం తెలుసుకున్న జేసీ అనుచరుడు రఘు 25మంది పచ్చమూకతో వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి హల్చల్ చేస్తూ భయాందోళనలు రేకెత్తించారు. ఈ ఘటన వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎస్పీ జగదీష్‌కు చెప్పినట్టు తెల్సింది. జిల్లా ఎస్పీ సూచనతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాయచోటి... ‘బలైపోతావ్’ అంటూ మంత్రి బెదిరింపులు..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆశావహులను లక్ష్యంగా చేసుకుని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి బెదిరింపులకు దిగారు. గౌస్ అనే మైనారిటీ నాయకుడికి ఫోన్ చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని, బలైపోతావంటూ మంత్రి చేసిన హెచ్చరికల ఫోన్‌కాల్ వైరల్ అవుతోంది. ‘రిక్వెస్ట్ అనుకుంటారో.. బెదిరింపు అనుకుంటారో.. ఇంకేమనుకుంటారో మీ ఇష్టం’, ‘మీరు బలిపశువులు కావద్దు’ అంటూ హెచ్చరించడం గమనార్హం. ఈ ఎన్నిక తనకు ప్రతిష్టాత్మకమని, ఎవరూ పోటీకి దిగవద్దని, ఇంకా రెండున్నరేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి భయపెట్టేలా మాట్లాడడం శోచనీయం. రాయచోటిలోని వివిధ వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు మంత్రి ఇదే మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.


