రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి 

Forest resources that will bring vannet to new district - Sakshi

కొత్త జిల్లాకు వన్నెతెచ్చే అటవీ సంపద 

సస్యశ్యామలం చేసే నదులు 

ఆదాయం ఆర్జించి పెట్టే ఉద్యాన తోటలు 

అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఆవిర్భవిస్తున్న రాయచోటి ప్రాంతానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వం కడప జిల్లాలో ఉన్న తాలూకాలు ఇతర జిల్లాల్లో కలిశాయే తప్ప ఏవీ జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఆ అవకాశం రాయచోటికి మాత్రమే దక్కింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. పునర్విభజన అంటూ జరిగితే కడప, ప్రొద్దుటూరు కేంద్రాలుగా రెండు జిల్లాలు ఏర్పాటు అవుతాయని ఇంతకాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ మహదవకాశం రాయచోటిని వరించింది. 
– కడప సెవెన్‌రోడ్స్‌

సరిహద్దులిలా..  
కడప జిల్లా ఉదక మండలంగా పిలువబడే ఈ ప్రాంతం 14.0586 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.7519 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1185 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. కొత్తగా ఆవిర్భవిస్తున్న అన్నమయ్య జిల్లాకు తూర్పున తిరుపతి, నెల్లూరు జిల్లాలు, ఉత్తరాన వైఎస్సార్‌ జిల్లా, పడమర పుట్టపర్తి, దక్షిణాన చిత్తూరు జిల్లాతోపాటు కర్నాటక సరిహద్దులుగా ఏర్పాటు కానున్నాయి. 

పరవశింపజేసే ప్రకృతి అందాలు 
రాయచోటి అంటే అందరికీ గుర్తుకొచ్చేది కొండలు, గుట్టలు. ఇక్కడ ఎటుచూసినా వివిధ ఆకృతులతో అందంగా ప్రకృతి తీర్చిదిద్దిన రాక్‌ గార్డెన్స్‌ చూపరులను ఆకట్టుకుంటాయి. ఉత్తరం, తూర్పు దిశన తూర్పు కనుమలు పెట్టని కోటలా ఉంటాయి. వీటిని ఈ ప్రాంతంలో పాలకొండలు లేదా శేషాచలం కొండలుగా పిలుస్తారు. దుప్పులు, జింకలు, మనుబోతులు, కోతులు, ఎలుగుబంట్లు, చిరుతలు, అడవి పందులు, నక్కలు, రేచు కుక్కలు తదితర వన్యమృగాలు సందడి చేస్తుంటాయి. ఔష«ధి వృక్షాల సౌరభాలతో, వనపుష్పాల సోయగాలతో ఈ కొండలు కనువిందు చేస్తాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన, అత్యంత నాణ్యతగల ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నందున ఎర్రచందనానికి చైనా, జపాన్‌ తదితర గ్లోబల్‌ మార్కెట్‌లో విపరీత డిమాండ్‌ ఉంది. ఎర్రబంగారంగా పిలిచే ఈ సంపదను సక్రమంగా వినియోగించుకోగలిగితే పెద్ద ఎత్తున విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. వీటిపై పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 

నదుల సంగమం.. 
కర్నాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా రాయలపాడు కొండల్లో ఉద్భవించే బహుదానది ఇక్కడి సుండుపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. పుంగనూరు ప్రాంతంలోని ఆవులకొండలో జన్మించే పింఛా నది కూడా ఇదే మండలంలోకి ప్రవేశించి రాయవరం గ్రామ సమీపంలో బహుదాలో కలుస్తుంది. పింఛాపై సుండుపల్లె మండలంలో చిన్న ప్రాజెక్టు నిర్మించారు. బహుదాను నందలూరు ప్రాంతంలో చెయ్యేరుగా పిలుస్తారు. చిత్తూరు జిల్లా రెక్కలకొండలో జన్మించే మాండవ్యనది చిన్నమండెం మండలం కేశాపురం బంగ్లా వద్ద ప్రవేశించి ప్రవహిస్తుంది. గంగనేరు, ఎర్రవంకలాంటి చిన్న వాగులు ఇందులో కలుస్తాయి. మాండవ్యనది పాలకొండల సానువుల ద్వారా ప్రవహిస్తూ చెయ్యేరులో విలీనమవుతుంది. కర్నాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా నంది దుర్గపు ఉత్తరానగల స్కంధగిరిలో జన్మించే పాపాగ్ని నది చిత్తూరు, అనంతపురం జిల్లాలను దాటుకుని గాలివీడు మండలం వెలిగల్లు వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇది సురభి వ్యాలీ, గండిక్షేత్రం మీదుగా సాగుతూ కమలాపురం సమీపంలో పెన్నాలో ఐక్యమవుతుంది. ఇవి కాకుండా గంగనేరు, కుషావతి లాంటి చిన్నచిన్న నదులు ఉన్నాయి. 

వీరబల్లి బేనీషాతో అంతర్జాతీయ ఖ్యాతి 
కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో అధికశాతం ఇసుకతో కూడిన ఎర్ర నేలలు ఉన్నాయి. ఇక్కడ అత్యధికశాతం వర్షాధారంపైనే పంటలు సాగు చేస్తారు. ప్రధానంగా వేరుశనగ, కంది, పెసర, అనప, మినుము, ఉలవ, అలసంద, జొన్న, ఆముదం పంటలు వేస్తారు. గతంలో సాగు చేస్తుండిన అరికలు, సామలు, బరిగలు, కొర్రలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి పంట సాగవుతుంది. తరుచూ కరువులతో వేరుశనగ దెబ్బతినడం వల్ల రైతులు ఉద్యాన పంటలవైపు దృష్టి సారిస్తున్నారు. చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో మామిడి తోటలు అధికంగా ఉంటాయి. వీరబల్లి బేనీషాకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇక చిన్నమండెం, సంబేపల్లె మండలాల్లో టమాటా విస్తారంగా సాగవుతోంది.

ఖనిజ సృష్టి.. ఆదాయంపై దృష్టి 
ఈ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల గ్రానైట్‌ లభ్యమవుతుంది. దీనికి మార్కెట్‌లో అంతగా డిమాండ్‌ లేదు. ఇక్కడి కొండలు, గుట్టల నుంచి తవ్వే తెల్లరాయి ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. దీని నుంచి తయారు చేసే కంకర రోడ్ల నిర్మాణాల్లో వాడుతారు. గాలివీడు మండలం వెలిగల్లు వద్ద బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ఒక మెట్రిక్‌ టన్ను ఖనిజం వెలికితీస్తే అందులో తొమ్మిది గ్రాముల బంగారం లభ్యమైతే తవ్వకాలు లాభసాటిగా ఉంటాయి. అయితే ఇక్కడ తక్కువ మోతాదులో బంగారు లభ్యమవుతుండడం వల్ల ఆర్థికంగా లాభసాటి కాదని మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారులు అంటున్నారు. పలుగురాయి, పెల్‌స్పర్, ఫైరోఫిలైట్‌ నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. 

అధిక ఉష్ణోగ్రతలు.. 
ఈశాన్యం నుంచి వచ్చే గాలులతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుంది. మార్చి నుంచి వేసవి తీవ్రత పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు మండిపోతుంటాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేడిగాలులు, ఉక్కపోత అధికం. జూన్‌లో నైరుతి రుతు పవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడుతుంది. ప్రధానంగా ఈ రుతు పవనాల ద్వారానే వర్షపాతం నమోదవుతుంది. తుఫాన్లు సంభవిస్తే ఈశాన్యంలో వర్షాలు కురుస్తాయి. రాయచోటిలో సాధారణ వర్షపాతం 650 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండడం వల్ల క్రానికల్లీ ›డ్రౌట్‌ ప్రోన్‌ ఏరియా కింద ఈ ప్రాంతం ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top