వృషభం.. అద్భుతం | Sakshi
Sakshi News home page

వృషభం.. అద్భుతం

Published Fri, Nov 17 2023 12:28 AM

- - Sakshi

ఆత్మకూరు: వ్యవసాయ పద్ధతులనే కాదు... చివరకు పశు పోషణ అంశంలోనూ ప్రస్తుతం చాలా మంది రైతులు పూర్వీకుల విధానాలను అనుసరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పశు పోషణను భారంగా భావించిన అన్నదాతుల.. వ్యవసాయ యాంత్రీకరణ వైపు మొగ్గుచూపారు. తాజాగా ఎద్దులతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మేలు జాతి వృషభాల పెంపకంపై చాలా మంది రైతులు దృష్టి సారించారు. అందులోనూ పందెం కోడెలకు ప్రాధాన్యతనిస్తూ ఒంగోలు జాతి వృషభాల పోషణపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందు కోసం ఒక్కో కోడెకు రూ.2 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తుండడం గమనార్హం.

వాటి హుందానే వేరు

ఎత్తయిన మూపురం, రాజసం కనిపించే నడక, నడకకు లయబద్ధంగా ఊగే గంగడోలు, కాటుక దిద్దినట్లుండే కళ్లు.. ఒంగోలు జాతి వృషభాల సొంతం. ఏనుగులను తలపించే బలీష్టమైన చక్కని శరీర సౌస్ఠవం ఎంతటి వారినైనా చూపు తిప్పుకోకుండా చేస్తాయి. వీటన్నిటి మించి యజమాని అభీష్టాన్ని బట్టి నడుచుకోవడం వీటి ప్రత్యేకత. వీటికి సెంటిమెంటు కూడా ఎక్కువే. యజమాని పట్టించుకోకుంటే ఇవి దిగులు పెట్టుకుంటాయి. ఆహారం తీసుకోకుండా మారాం చేస్తాయి. దీంతో వీటిని పసి పిల్లలతో సమానంగా చూసుకుంటారు రైతులు. ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కడుపునిండా దాణా పెడతారు. గ్రామీణ పండుగల్లో ఒక్కసారి దూలం కడితే వాటిని నియంత్రించేందుకు ఐదుగురు వ్యక్తులు అందుబాటులో తప్పనిసరిగా ఉండాలి.

ఎంత కష్టమైన కనపడదు

ఇటీవల జిల్లాలో దూలం లాగుడు పోటీలకు అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామానికి చెందిన రైతు వాసుదేవరెడ్డి నాలుగు జతల వృషభాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోటీలు జరిగినా వాటిని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి పందెంలో పాలుపంచుకుని విజేతగా తిరిగి వస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఓ మెనును పాటిస్తూ క్రమ పద్ధతిలో ఆహారాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క ఎద్దుకు ఉదయం పది లీటర్లు, సాయంత్రం పది లీటర్ల పాలు తాగిస్తారు. అనంతరం దూలం లాగుడుకు సంసిద్ధతత చేయడంలో భాగంగా రెండు పూటలా ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఉలవలు ఉడికించి తయారు చేసిన ముద్దలు, రాగి సంగటి – బెల్లం కలిపి ప్రత్యేకంగా వండిన ఆహారం తినిపిస్తారు. పందేల్లో పాల్గొన్నప్పుడు త్వరగా అలసి పోకుండా ఉండేందుకు కొబ్బరి బొండాం నీళ్లల్లో గ్లూకోజ్‌ కలిపి తాగిస్తారు. ఇలా ఒక్కొ కోడెకు నెలకు రూ.25 వేల వరకూ ఖర్చు పెడుతున్నారు. కంటి ముందు హుందాగా ఆ వృషభాలు నడుస్తూంటే వాటిపై పెట్టిన వ్యయం కనిపించడం లేదని రైతు వాసుదేవరెడ్డి అంటున్నారు.

మేలుజాతి పశుపోషణపై రైతుల ఆసక్తి

రూ.లక్షలు ఖర్చు పెట్టి

ఒంగోలు వృషభాల పెంపకం

ఒక్కొ వృషభానికి

నెలకు రూ.15 వేలకు పైగా ఖర్చు

ఎద్దు ఒకనాడు స్టేటస్‌ సింబల్‌! ఎన్ని ఎకరాల పొలం ఉందనే దాని కంటే... ఎన్ని ఎద్దులున్నాయనే లెక్కే అప్పట్లో గొప్ప! రైతు ఇంటి ముంగిట రంకెలు వేస్తూ... మెడలో గంటలతో చిరుసవ్వడి చేస్తూ... యజమాని గొంతు వినగానే విశ్వాసంతో మోర పైకెత్తి నేనిక్కడున్నానంటూ హుందాగా చూసే ఎద్దులు సాగు పనుల్లోనే కాదు.. ప్రేమానురాగాలు పంచడంలోనూ తమకు సాటి లేవని నిరూపిస్తుంటాయి. అలాంటి ఎద్దుల పోషణ మరోసారి స్టేటస్‌ సింబల్‌గా మారుతోంది. మేలుజాతి వృషభాలను పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందు కోసం రూ.లక్షల ఖర్చును సైతం భరించేందుకు వెనుకాడడం లేదు.

Advertisement
Advertisement