అర్హులందరినీ ఓటర్లుగా చేర్చేలా.. | Sakshi
Sakshi News home page

అర్హులందరినీ ఓటర్లుగా చేర్చేలా..

Published Wed, Mar 27 2024 12:05 AM

ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ రాజర్షి షా (ఫైల్‌) - Sakshi

● స్వీప్‌ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ● విద్యాసంస్థల్లో ముమ్మరంగా అవగాహన కార్యక్ర మాలు ● ఏప్రిల్‌ 14 వరకు ఓటరు నమోదుకు అవకాశం

కై లాస్‌నగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణపై జి ల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా ముందుకు సాగుతుంది. ఇందుకోసం సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌( స్వీప్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 14 వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఉండటంతో 18 ఏళ్లు నిండిన యువత తమ పేర్లు నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఓటు ప్రాధాన్యత తెలియజేయడంతో పాటు ఓటరుగా నమోదు చేసుకునేలా యువతను చైతన్యపరుస్తున్నారు.

ముమ్మర ప్రచారం

కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాల మేరకు స్వీప్‌ ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్‌, గి రిజన సంక్షేమ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు ప్రాధాన్యత తెలియజేసేలా ఆదిలాబాద్‌లో 5కే రన్‌ చేపట్టారు. అలాగే ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించి విద్యార్థులకు ఓటు అవశ్యకతను వివరించారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో యువతకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మహిళలతో ఓటు హక్కుపై కలెక్టర్‌ ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ వంటి ప్రదేశాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

పోలింగ్‌ శాతం పెంచే దిశగానూ

ఓటు నమోదు ప్రచార, అవగాహన కార్యక్రమాలతో పాటు త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచే దిశగానూ చర్యలు చేపట్టింది. తమ తల్లిదండ్రులు, కుటుంబీకులు ఓటు హక్కు వినియోగించునేలా చూడాలంటూ పాఠశాల విద్యార్థులకు స్వీప్‌ ఆధ్వర్యంలో సంకల్ప పత్రాలు అందజేశారు. 16వేల మంది విద్యార్థులకు వాటిని అందజేసి తమ తల్లిదండ్రులు, కుటుంబీకులతో ఓటు హక్కు వినియోగించుకుంటామనేలా సంతకాలు తీసుకున్నారు.

యువత ఓటర్లుగా నమోదు కావాలి

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి 18 ఏళ్ల నిండిన యువత ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వచ్చే నెల 14వరకు ఇందుకు అవకాశమముంది. ఫారం–6 ద్వారా సంబంధిత బీఎల్‌ఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించి ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో ఓటర్స్‌ హెల్ప్‌లైన్‌, ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం–6తో పాటు ఆధార్‌ కార్డు, వయస్సును నిర్ధారించేలా ఎస్సెస్సీ మెమోను జత చేయాల్సి ఉంటుంది. గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారు మే 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటర్ల నమోదుతో పాటు పోలింగ్‌శాతం పెంచేలా జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా మారాలి.

– రాజర్షి షా, జిల్లా ఎన్నికల అధికారి

Advertisement
Advertisement