Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Horoscope Today: Rasi Phalalu On 10-06-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.48 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి రా.10.35 వరకు, తదుపరి ఆశ్రేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: ప.3.55 నుండి 5.36 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. మేషం: కుటుంబంలో వివాదాలు, సమస్యలు. ధనవ్యయం. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం.వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.మిథునం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కర్కాటకం: త్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆలయాలు సందర్శిస్తారు.సింహం: ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.కన్య: పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.తుల: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో కీర్తి దక్కుతుంది. ఆహ్వానాలు రాగలవు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం: దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో మార్చుకుంటారు. అదనపు ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Can the old Modi be the new Modi
పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?

నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే! సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధతను కలిగి ఉంటారా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోదీ ఇప్పుడు కొత్త మోదీ కాగలరా?మునుపు మీరీ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్ల సమష్టి విజ్ఞత చక్కబెట్టగలగటమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్లీ ఈ జూన్‌ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామందే ఆశించినప్పటికీ, నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవి చూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి, విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమైన మిత్ర పక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్లీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. ఇది ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియక పోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాలును సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను, లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. ఐదో విడత పోలింగ్‌ అయ్యాక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ, చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక, ఇవాళ ఆయన... కలవరపడే మనిషా లేక దులిపేసుకుని వెళ్లగలిగినంత మొద్దు చర్మం ఉన్నవారా?వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాటేమిటి? 2019లో ఆయనకు 4 లక్షల 80 వేల మెజారిటీ వచ్చింది. అదిప్పుడు కేవలం లక్షా ఐదు వేలకు పరిమితం అయింది. ‘‘గంగా మేరీ మా హై, ముఝే గంగా నే గోద్‌ లియా హై’’ (గంగానది నా మాతృమూర్తి. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుంది) అని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి.. పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు?ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా?గుర్తు చేసుకోండి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహసం చేయలేదు.పార్లమెంటు, జ్యుడీషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీ ‘పాత మోదీ’ పార్లమెంటును పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ ‘బలహీన మోదీ’ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు. తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీ పాత మోదీకి ఆ రెండూ నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక శ్రీ కొత్త మోదీ సహించటాన్ని, సమ్మతించటాన్ని మాత్రమే కాదు... రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా?మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మరిచిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు కానీ, మొత్తానికైతే నేననుకోవటం అవి గుర్తుండే ఉంటాయని! మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరచుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవడంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ, వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి. అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?మరీ ముఖ్యంగా, ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటు దారులుగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్‌లను లాక్కుని లబ్ధి పొందేవారిగా చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావసిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంబాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్నీ ఒకే ఒక సాధారణ ప్రశ్నగా కుదించవచ్చు: శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దాని పైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా! కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? - వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌- కరణ్‌ థాపర్‌

Types of Gold Investment Plans in India and Their Benefits 2024
బంగారం బంగారమే

కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్‌) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ)లో ఇన్వెస్ట్‌ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. సంప్రదాయ డెట్‌ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.వివిధ సాధనాలు బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్‌ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్స్, సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీలు), డిజిటల్‌ గోల్డ్‌ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు స్టాక్స్‌ మాదిరే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్‌ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్‌ ఈటీఎఫ్‌ ధర ఏరోజుకారోజు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్‌ఐసీ గోల్డ్‌ ఈటీఎఫ్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.41 శాతంగా ఉంది. ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్‌పెన్స్‌ రేషియో కింద ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్‌ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. గోల్డ్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడమే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒక యూనిట్‌ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో గోల్డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్‌ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల అక్కడ ఎక్స్‌పెన్స్‌ రేషియో.. తిరిగి గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. డిజిటల్‌ గోల్డ్‌ ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్‌ సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్‌ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్‌ ఒక ప్లాట్‌ఫామ్‌లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్‌బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీల్లో రాబడి ఇండియా బులియన్‌అండ్‌ జ్యుయలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్‌ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్‌జీబీ 2016– సిరీస్‌1 బాండ్‌ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్‌ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్‌బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్‌ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. ఇతర వివరాలు ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్‌ బ్యాంక్‌ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్‌ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్‌జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.కేటాయింపులు ఎంత మేర? ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్‌ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్‌ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్‌టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్‌ కూడా ఉండదు. బంగారం బాండ్లు భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్‌ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్‌జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్‌ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్‌బీఐ ప్రకటిస్తుంటుంది. బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్‌ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్‌బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్‌ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్‌బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. రిటర్నుల్లో ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్‌ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్‌ఎస్‌ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్‌ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. రాబడులు బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్‌ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్‌ రాబడిని బంగారం ఇచి్చంది. ముందస్తు ఉపసంహరణ ఎలా? ఎస్‌జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్‌బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్‌బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్‌ తన వద్దనున్న బాండ్‌ను ఆర్‌బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఇక ఇన్వెస్ట్‌ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈ). కాకపోతే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్‌ తక్కువ కనుక మార్కెట్‌ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్‌ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్‌ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది.

TDP and Jana Sena clash for temple
గుడి కోసం టీడీపీ–జనసేన కుమ్ములాట

పిఠాపురం/సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో రెండ్రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ కారుపై జనసేన శ్రేణుల దాడి ఘటన మరువక ముందే.. అదే మండలం తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో రెండు పార్టీలు ఆదివారం మళ్లీ కుమ్ములాడుకున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు తమదేనని టీడీపీ నేతలు.. కాదు తమదేనంటూ జనసేన నేతలు రచ్చకెక్కారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలివీ..తాటిపర్తి అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో గ్రామంలో పూర్వం నుంచీ ఒక ఆనవాయితీ ఉంది. నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా నెగ్గితే ఆ పార్టీకి చెందిన నేతలు ఐదేళ్లూ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. వారి ఆధ్వర్యంలోనే ఉత్సవాల వంటి అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఇప్పటివరకూ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆలయ బాధ్యతలు చూసేవారు. ఇటీవల టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆలయ బాధ్యతలు అప్పగించేస్తామంటూ వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ, జనసేన నాయకులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు వస్తే అందరి సమక్షంలో ఆలయ తాళాలు ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో కూటమి నేతలు ఆదివారం ఉదయం ఆలయం వద్దకు వచ్చారు. పిఠాపురంలో జనసేన నెగ్గడంతో ఆ పార్టీకి చెందిన నేతలకు వైఎస్సార్‌సీపీ నాయకులు అందరి సమక్షంలో ఆలయ తాళాలు అందజేశారు. దీనికి గ్రామస్తులందరూ ఆమోదం తెలిపారు.సంయమనం పాటించాలి : నాగబాబుమరోవైపు.. ఈ ఘటనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందిస్తూ.. కూటమి సభ్యుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ­న్నారు. ఇటీవల గొల్లప్రోలు మండలం వన్నె­పూడిలో జరిగిన ఘటన వివరాలు సేకరిస్తున్నా­మని, ఇందులో తమ పార్టీ వారు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాటిపర్తిలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై కూడా నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పదిరోజుల్లో పవన్‌ పిఠాపురం వస్తారని చెప్పారు.వివాదానికి టీడీపీ ఆజ్యం..అయితే, ఈ విషయం టీడీపీ నియోజకవర్గ నేతకు తెలిసింది. జనసేనను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఆ నేత టీడీపీ వారికే ఆలయ పెత్తనం ఇచ్చేలా పట్టుబట్టాలని ఆదేశాలిచ్చి­నట్టు సమాచారం. దీంతో అప్పటివరకూ అన్నింటికీ అంగీకారం తెలిపిన టీడీపీ నేతలు.. ఒక్కసారిగా వివాదానికి తెరలేపారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల్లో నెగ్గింది జనసేన అయినా గెలిపించింది తామేనని.. అందుకే తమకే ఆలయ తాళాలు అప్పగించాలని టీడీపీ నాయకులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో జనసేన–టీడీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇరువర్గాలూ బాహాబాహీకి దిగడంతో ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలనూ చెదరగొట్టారు. అయినప్పటికీ తాళాలిచ్చే వరకూ కదిలేదిలేదని టీడీపీ నేతలు ఆలయం వద్ద బైఠాయించారు. ఇరువర్గాలతో చర్చించిన పోలీసులు వివాదం తేలేవరకు ఆలయ తాళాలు అధికారుల వద్ద ఉండేలా ఒప్పించారు. అనంతరం తాళాలను స్థానిక వీఆర్‌ఓకు అప్పగించారు. తమకు ఎలాగూ ఆలయం దక్కేదిలేదని గ్రహించిన టీడీపీ నేతలు ఆలయాన్ని దేవదాయ శాఖకు అప్పగించాలనే డిమాండును తెరపైకి తీసుకువచ్చారనే ప్రచారం గ్రామంలో జోరుగా జరుగు­తోంది. అపర్ణాదేవి ఆలయం దేశంలోనే పేరొందింది. ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేకమంది భక్తులు, వీఐపీలు వస్తూంటారు. ఆదాయం కూడా అంతలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆలయంపై పెత్తనం తమకు దక్కకపోతే.. జనసేనకూ దక్కకూడదని భావించిన టీడీపీ నేతలు.. ఈ ఆలయాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Kishan Reddy and Bandi Sanjay to represent Telangana in Union Cabinet
విధేయతకు పెద్దపీట!

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా చాన్స్‌ దక్కింది. జి.కిషన్‌రెడ్డి కేబినెట్‌ మంత్రిగా, బండి సంజయ్‌ సహాయ మంత్రిగా నియమితుల య్యారు. ఇందులో కిషన్‌రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్‌ నుంచి గెలవగా.. సంజయ్‌ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌ నుంచి విజయం సాధించారు. ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినవారే. మోదీ మూడో కేబినెట్‌లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో పట్టుసాధించడంతో..2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ అందింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్‌రెడ్డి, సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డి, గోడెం నగేశ్‌ రెండోసారి ఎంపీలుగా గెలవగా.. డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.\కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌. డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తే చేసింది. పార్టీకి ముందు నుంచీ విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్‌రెడ్డి, సంజయ్‌ల కృషి దోహదపడటాన్ని పరిగణనలోకి తీసుకుంది.అనుభవం, సీనియారిటీతో..కిషన్‌రెడ్డి నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. గత కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్‌ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉ న్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలసివచ్చి కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్‌ మంత్రి పదవి వరించింది.దూకుడుగా పార్టీ బలోపేతంతో..2019లో కరీంనగర్‌ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్‌.. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా నియామకమైన తర్వాత దూకుడుగా వ్యవహ రించారు. అప్పట్లో అధికార బీఆర్‌ఎస్‌ను, కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్‌ షాలతో శభాష్‌ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్‌ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికితోడు తొలి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్‌కు కలసివచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.ఏపీ నుంచి ముగ్గురికి..ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడు, తొలిసారి గెలిచిన పెమ్మ సాని ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. 1991 నుంచీ పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియారిటీ, విధేయతను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం.ఉదయం ఫోన్‌లు.. మధ్యాహ్నం తేనీటి విందు..ఆదివారం ఉదయం పది గంటల నుంచే మంత్రులుగా ఎంపికైన ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచే అందుబాటులో ఉండాలని ఆ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో భేటీకి రావాలని సూచించారు. దీంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ఎంపికైన అందరినీ ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా అభినందించారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రధాని తేనీటి విందు ఇచ్చారు. తర్వాత పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా పనిచేయాలని, 100 రోజుల ఎజెండాను అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత అంతా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.హిందీలో ప్రమాణ స్వీకారంకేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ హిందీలో ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజ రైన కార్యకర్తలు ‘జై శ్రీరామ్‌’ అంటూ పెద్దపె ట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.

Akhilesh Yadav eyes on 2027 Assembly Elections
2027 అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేష్‌ దృష్టి

2024 లోకసభ ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎస్ఫీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు విని, పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే భవిష్యత్‌లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీకి పెద్దఎత్తున ప్రజల మద్దతు లభించిందన్నారు. దీంతో సోషలిస్టుల బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రజలు చెప్పే విషయాన్ని వినాలని, వారి సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆరు సీట్లు దక్కించుకుంది.

Telangana police arrested Hawkeye app hacker
‘పోలీస్‌’ హ్యాకర్‌..20 ఏళ్ల విద్యార్థి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్‌ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్‌ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్‌(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్‌ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్‌ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్‌ఐ యాప్‌ హ్యాక్‌ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్‌ పోలీస్‌ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్‌ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్‌బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్‌ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్‌ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్‌ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్‌ సెల్‌ ద్వారక పోలీస్సే్టషన్‌లో క్రైం. నంబర్‌ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్‌ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్‌ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్‌ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్‌బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్‌ పోలీస్‌ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్‌ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్‌ ఐ ,టీఎస్‌కాప్‌ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్‌ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్‌ ఇంజినీరింగ్‌ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్‌ఐ, టీఎస్‌కాప్‌ యాప్‌లు హ్యాకింగ్‌ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్‌ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్‌ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్‌ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్‌ హాక్‌ఐ డేటాలోకి యాక్సెస్‌ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్‌కాప్‌ యాప్‌ అనేది పూర్తిగా పోలీస్‌ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్‌ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ఎస్‌ఎంస్‌ సర్వర్‌ యూఆర్‌ఎల్‌ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్‌ఎల్‌ ఏప్రిల్‌ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్‌ అయినట్టు చెబుతున్న యూఆర్‌ఎల్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌ , ఎండ్‌ పాయింట్‌లలో ఏవైనా సైబర్‌ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్‌ కేసును టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్‌ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్‌స్పెక్టర్‌ ఆశిషిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.

Five thousand is the only number that should be banned in Telugu literature
అత్యున్నత ఐదువేలు

దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్‌ వేసేవాడు పెద్ద కిట్‌ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్‌ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్‌ కనిపిస్తుంది.మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్‌’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్‌ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్‌ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్‌ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్‌.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్‌ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్‌ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్‌– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం!

Ananya Panday Request Movie Chance With Vijay
ఆ హీరోతో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న లైగర్‌ బ్యూటీ

అనుకున్నవన్నీ జరగవు.. అయినా అనుకోవడం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్‌ నటిగా రాణిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ ఈమె. ఈమె ఇంతకుముందు స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2, కాలీ పీవీ, డ్రీమ్‌ గర్ల్‌ 2, తెలుగు చిత్రం లైగర్‌ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీ లో కంట్రోల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్‌ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్‌ నాయర్‌ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్‌ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్‌లో నటుడు విజయ్‌ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోరిక నెరవేరే చాన్సే లేదనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నెలకొల్పిన నటుడు విజయ్‌ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విజయ్‌ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా? అని అనిపిస్తుంది.

State students who have excelled in JEE Advanced results
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు

సాక్షి, అమరావతి : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో టాప్‌–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్‌ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్‌ కుమార్‌ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్‌ సుహాస్‌ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్‌ జోన్‌)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్‌ కుమార్‌ పటేల్‌ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్‌ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్‌సీస్‌ ఇండియన్స్‌ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్‌ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్‌మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభు­త్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌లో 987 మార్కు­లు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్‌ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్‌ ఇండియాలో మొదటి ర్యాంక్‌ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివి, సివిల్స్‌ పరీక్ష రాసి ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్‌.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్‌ మార్కులుజేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్‌ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్‌ ర్యాంకు కటాఫ్‌ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్‌ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్‌ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్‌ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్‌ కుమారుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్‌ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement