చీకటి జీవితాల్లో ‘ఆశాజ్యోతి’

blind school teacher asha jyothi special interview - Sakshi

కళ్లులేని పిల్లలను అమ్మలా సాకుతున్న మహిళ

తన కుమారుడి దుస్థితి చూసి అంధుల పాఠశాల స్థాపన

చిన్నారుల స్వర్గధామంగా మారిన ‘ద్వారకామాయి’

కష్టాలు, కన్నీళ్ల కోర్చి ముందుకు సాగుతున్న అమ్మ

చీకటి. ఆమె జీవితంతో పెనవేసుకుపోయింది. వివాహం...  పుత్రుని జననం... ఆమెకు కన్నీళ్లే మిగిల్చాయి. అయితేనేం చీకటితో పోరాడారు. కన్నీళ్లను దిగమింగారు. భర్త చేయిపట్టుకుని అత్తవారిల్లు వదిలి వచ్చి... యాభై మంది అంధ విద్యార్థులకు అమ్మయ్యారు. చీకటి నుంచి వెలుగులోకి తాను పయనిస్తూ వారినీ నడిపిస్తున్నారు. ఆమే విజయనగరానికి చెందిన మాచేపల్లి ఆశాజ్యోతి. ద్వారకామాయి అంధుల పాఠశాల నిర్వహణలో ఆమెకు స్వలాభాన్ని బేరీజు వేసుకునే తీరిక ఉండదు. ఎందుకంటే ఉచితంగా విద్యనందిస్తూ వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తూ ఆ పిల్లలను తల్లిలా సాకడమే ఆమె ముందున్న లక్ష్యం. వారూ తన కుమారుడిలాంటివారేననీ... అందుకే వారిని అక్కున చేర్చుకుని అమ్మలా వారితో గడుపుతున్నాననీ... ఆనందంగా చెప్పే విశేషాలు ‘నేను శక్తి’ తొలి కథనంగా... మీ కోసం.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగి పెద్దయ్యాను. నాకు స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. ఖోఖో, కబడ్డీలో జాతీయ స్థాయి వరకూ వెళ్లాను. కానీ నా చదువు మధ్యలో ఉండగానే మామయ్య రవికుమార్‌తో పెళ్‌లైంది. తరువాత కుటుంబ సమస్యల కారణంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అమ్మమ్మ వాళ్ల ఇల్లు వదిలి కట్టుబట్టలతోనే విజయనగరం వచ్చేశాం. మామయ్యకు అప్పట్లో చాలా వ్యాపారాలు ఉండేవి. కానీ అవన్నీ అక్కడే వదిలేశారు. ఇక్కడికి వచ్చాక కేవలం రూ.1500ల జీతానికి పనిలో చేరారు. ఆ సమయంలో ఆనారోగ్యానికి గురైతే కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి మాది.

బాబు పుట్టాకే కొత్త జీవితం...
కొన్నాళ్లకు బాబు పుట్టాడు. వాడికి హరిస్మరణ్‌ అని పేరు పెట్టుకున్నాం. వాడు పుట్టిన గంటకే మా ఆనందం మొత్తం ఆవిరైపోయింది. వైద్యుల నిర్ణక్ష్యం వాడి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఐదేళ్ల పాటు మంచం మీదే జీవచ్ఛవంలా ఉండేవాడు. ఆ తర్వాతే వాడికి అంధత్వం ఉందని తెలిసింది. కనీసం అమ్మ అనే పిలుపు కూడా ఉండేది కాదు నాకు. ఆ సమయంలో వాడితో పాటే చీకటి గదిలోనే ఉంటూ నిత్యం కన్నీరుమున్నీరుగా ఏడ్చాను. నా సోదరుడొకరు నాకు ధైర్యం చెప్పడంతో బాబును మార్చాలని ప్రయత్నించాను. తొమ్మిది సంవత్సరాలకు వాడు కోలుకున్నాడు. సాధారణ స్కూళ్లలో చేర్చినా అక్కడ ఇమడలేకపోయాడు. బ్లైండ్‌ స్కూల్‌కు వెళ్లి అక్కడి వారి పరిస్థితిని కళ్లారా చూశాను. వారం రోజుల పాటు కోలుకోలేక పోయాను. బాబును అక్కడ చేర్చి వాడితో పాటు నేనూ స్కూల్‌కు వెళ్లడం వల్ల బ్లైండ్‌ స్కూల్‌ పిల్లలందరూ నాకు దగ్గరయ్యారు. నిత్యం వాళ్లతో మమేకమవుతూ అక్కడే ఉండిపోయేదాన్ని. మా బాబు ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు.

ఏటా విద్యాసంవత్సరం ముగియగానే గ్రామాల్లో సర్వే చేసి అంధ విద్యార్థులను గుర్తించి వారిని తీసుకు వచ్చి జాయిన్‌ చేసుకుంటుంటాం. వారి తల్లిదండ్రులకు ముందుగా అవగాహన కల్పిస్తాం. అవసరమైతే వారిని తీసుకువచ్చి వారం రోజులు పాఠశాలలో ఉంచి ఇక్కడి పరిస్థితులు వివరించి ఒప్పిస్తాం. పిల్లలకు యూనిఫాంతో పాటు అన్నీ ఇక్కడే కల్పిస్తాం. ప్రస్తుతం 14 మంది ఉద్యోగులున్నారు. బీఏబీఈడీ అర్హత కలిగిన ముగ్గురు అంధ ఉపాధ్యాయులతో పాటు మొత్తం 9 మంది ఉపాధ్యాయులున్నారు. అందరి జీత భత్యాలు, పాఠశాల నిర్వహణ ఖర్చు మొత్తం మేమే భరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో దాతలు కొందరు ముందుకు వచ్చి సహాయం చేస్తుండటం వల్ల సగం భారం తగ్గింది.

అంధుల కళాశాల స్థాపనే లక్ష్యం
పిల్లలు స్కిల్స్‌ సంపాదించి ఎవరి కాళ్లమీద వా రే నిలబడేలా చేయడమే నా లక్ష్యం. పిల్లలందరికీ మ్యూజిక్, క్విజ్, నృత్యం, నటన తదితర అంశాలపై ఆసక్తి పెంచి నేర్పిస్తున్నాను. పిల్లలు కూడా రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధిస్తున్నారు. నా సర్వస్వం స్కూలే.. నాకు వేరే ఆలోచనే ఉండదు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ స్కూల్‌ అవార్డు సాధించినప్పుడు కంటే పిల్లలకు బెస్ట్‌ అవార్డులు వచ్చినప్పుడే నేను ఎక్కువగా సంతోషపడుతుంటాను. రానున్న రోజుల్లో వారి కోసం కాలేజీ ప్రారంభించాలని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అంధుల కళాశాల లేదు. మామూలు కాలేజీల్లో వారిని చేర్చుకోవడం లేదు. ప్రభుత్వం స్థలం ఇస్తే కళాశాల భవనాలు కట్టించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.  ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అంధులైనా...  వారే నా జీవితానికి వెలుగులు
మనం ఎవరిమీద ఆధారపడకూడదు. మన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ముందుకు వెళ్లిపోవాలనేది నా అభిమతం. మా సిబ్బంది కూడా నాకు ఎంతగానో సహకరిస్తుంటారు. పిల్లలకు ఏమైనా అనారోగ్యం వస్తే నేనే స్వయంగా ప్రాథమిక వైద్యం చేస్తుంటాను. మా బాబుకు మందులు వాడీ వాడీ వారి సమస్యకు ఏ మందు వేయాలో బాగా తెలుసుకున్నాను. గతంలో ఒక పాపకు పక్షవాతం వచ్చింది. ఫోన్‌చేస్తే ఆమె తల్లిదండ్రులు పక్కన పడేయమన్నారు. విశాఖ కేజీహెచ్‌లో జాయిన్‌ చేసి నేనే వైద్యం చేయించి తర్వాత వారికి అప్పగించాను. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలున్నాయి. అయితేనేం పిల్లల్లో దాదాపు 99 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నారు. వారి ఆట, పాటల మధ్య నాకు కాలం తెలియదు. కష్టం తెలియదు. చీకటిని జయించిన చిరుదివ్వెలు నా ఈ యాభై మంది పిల్లలు. వారే నా సర్వస్వం.

స్కూల్‌పెట్టడానికి అదే కారణం...
మా బాబును చూసి బంధువుల్లో కొందరు ఛీదరించుకునే వారు. అదే నాలో పంతం పెంచేలా చేసింది. వాడిలో ఉండే టాలెంట్‌ను బయట పెట్టాలన్న తపన నాలో పెరిగింది. బాబును రోజూ బయటకు తీసుకెళ్లి అన్నింటినీ గుర్తించేలా తిప్పేదాన్ని. మేం కూడా ఆర్థికంగా నిలబడ్డాం. మావయ్య నాకు కనిపించే దైవం. మా అమ్మ నిర్మలాదేవి, నాన్న నాగభూషణరావు ఇచ్చిన స్పూర్తితోనే ఈ స్కూలు స్థాపించగలిగాం. జామి మండలం విజినిగిరిలో ఉండే  రాపర్తి రామారావు ఆశ్రమానికి మా కుటుంబ సభ్యులమంతా వెళ్లేవాళ్లం. ఆయనే నా గురువు. నా కొడుకును ఎలా తయారు చేయాలనుకున్నానో అలాగే మిగిలిన పిల్లలందరినీ తయారు చేయాలనే ఉద్దేశంతో 2013 ఆగస్టులో 18 మంది పిల్లలతో ద్వారకామాయి అంధుల పాఠశాల స్థాపించాం. తొలుత ఒకటి నుంచి 7వ తరగతి వరకూ, తరువాత 8, 9, 10 తరగతులను ప్రారంభించాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 50 మంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top