వరిలో కొంగ ఈక (తెల్లకంకి) నివారణ | Instructions for paddy farmers | Sakshi
Sakshi News home page

వరిలో కొంగ ఈక (తెల్లకంకి) నివారణ

Mar 24 2014 12:15 AM | Updated on Oct 1 2018 2:00 PM

వరిలో కొంగ ఈక (తెల్లకంకి) నివారణ - Sakshi

వరిలో కొంగ ఈక (తెల్లకంకి) నివారణ

వరిలో కొంగ ఈక(తెల్లకంకి) కారణంగా పది నుంచి 20 శాతం పంట నష్టం జరుగుతున్నది. దీన్ని నివా రించడానికి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

 వరిలో కొంగ ఈక(తెల్లకంకి) కారణంగా పది నుంచి 20 శాతం పంట నష్టం జరుగుతున్నది. దీన్ని నివా రించడానికి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వరి చేను వెన్ను వేసే సమయంలో ఆశించే ఓ రకమైన శిలీంద్రం కారణంగా తెల్లకంకి ఏర్పడుతుంది. శిలీంద్రం కారణంగా వెన్నుల మీద వెల్వెట్ గుడ్డను తలపించే చిన్న చిన్న బుడిపెలు ఏర్పడి క్రమంగా పెరిగి పెద్దవి అవుతాయి. వెన్ను వేసి గింజ గట్టిపడే సమయంలో తేమ వాతావరణం ఏర్పడినట్లయితే ఈ శిలీంద్రం మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ఈ శిలీంద్రం విస్తరించడం వలన పంటను నష్టపర్చడమే కాకుండా చుట్టుపక్కల వెన్నులు పాలు పోసుకోకుండా ప్రభావితం చేస్తాయి. దీని వలన తెల్లకంకులు ఏర్పడతాయి. తెల్లకంకి సమస్య బీపీటీ 5204తో పాటు ఇతర పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆలస్యంగా నాటిన పైర్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
 
 తెల్లకంకి నివారణ చర్యలు:   
 
  ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
  రైతువారీ విత్తనం సేకరించిన పక్షంలో ఎట్టి పరిస్థితిలో తెల్లకంకి ఉధృతి ఉన్న పొలంలోని ధాన్యాన్ని విత్తనంగా ఉపయోగించ కూడదు.
  పంట కోత సమయంలో చేలోని తెల్లకంకి వెన్నువేసిన మొక్కలను తొలగించాలి.
  పొలం గట్లు, నీటి కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలి.
  నిపుణులు సిఫారసు చేసిన మోతాదుకు మించి నత్రజని ఎరువు వినియోగించ కూడదు.
 
  రసాయనిక పద్ధతి: లీటరు నీటికి 2.5 గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్ లేదా ఒక మిల్లీలీటర్ ప్రొపికొనాజోల్‌ను కలిపి పిచికారీ చేస్తే ఫలితం కనిపించవచ్చు.
  సేంద్రియ విధానం: ఐదు లీటర్ల ఆవు మూత్రం, ఐదు కేజీల ఆవు పేడ, ఐదు లీటర్ల నీరు తీసుకొని ఒక డ్రమ్ములో కలిపి ఉంచాలి. మూడు రోజులు మురగబెట్టిన తరువాత ఇందులో గోరువెచ్చని నీటిలో కరిగించిన పావు కిలో పాల ఇంగువ ద్రావణాన్ని కలిపి వడకట్టాలి. లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఆవు మూత్రం, ఆవు పేడ, ఇంగువ.. ఈ మూడింటిలోనూ శిలీంద్ర నాశక గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement