నోకియా కంపెనీ ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో ఉన్న తన కేంద్ర కార్యాలయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థకు అందజేయనున్నది.
హెల్సింకి: నోకియా కంపెనీ ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో ఉన్న తన కేంద్ర కార్యాలయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థకు అందజేయనున్నది. ఇక్కడకు సమీపంలోని ఇస్పూలో ఉన్న బిల్డింగ్‌ను మైక్రోసాఫ్ట్‌కు బదలాయించనున్నామని నోకియా గురువారం తెలిపింది. నోకియా-మైక్రోసాఫ్ట్ డీల్ పూర్తయితే ఈ కార్యాలయం పూర్తిగా మైక్రోసాఫ్ట్ అధీనంలోకి వెళుతుందని, తమ కార్యాలయాలన్నీ మైక్రోసాఫ్ట్ కార్యాలయాలుగా మారిపోతాయని పేర్కొంది. కాగా నోకియా మొబైల్ వ్యాపారాన్ని అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ 544 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడాన్ని నోకియా వాటాదారులు ఆమోదించారు. ఈ విక్రయం కారణంగా తాము మళ్లీ లాభాల బాట పడతామని నోకియా ఆశిస్తోంది. ఒకప్పుడు నోకియా కేంద్ర కార్యాలయం 1990, 2000ల్లో ఫిన్‌లాండ్ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబంగా నిలిచింది. మొబైల్ ఫోన్లను తయారు చేసే అతి పెద్ద కంపెనీ స్థాయి నుంచి పతనమైన కంపెనీగా నోకియాను ఈ కార్యాలయం గుర్తు చేస్తుందని నిపుణులంటున్నారు.