ఆగేనా.. సాగేనా..?

Water Shortage Projects in Telangana - Sakshi

ఈ ఏడాది లక్ష్యం మేరకు కొత్త ఆయకట్టుకు నీరందేదెలా? 

8.89 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వాలనే లక్ష్యం 

ప్రాజెక్టుల్లో నీటి కొరత, భూసేకరణ సమస్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలోని ప్రాజెక్టుల కింద ఈ ఖరీఫ్‌ కోసం నిర్ణయించిన ఆయకట్టు లక్ష్యాల సాధనపై ముసుర్లు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు ప్రాజెక్టుల్లో నీటి కొరత, మరోవైపు ఇంకా పూర్తికాని భూసేకరణ తదితర సమస్యలు కొత్త ఆయకట్టు ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ ఖరీఫ్‌లోనే పది భారీ, మరో పది మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 8.89 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఎంతమేర నీరు అందించగలరన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టుల కింద కేవలం 2,500 ఎకరాల మేర భూసేకరణ పూర్తిచేస్తే.. కొత్తగా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 6.50 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉండటం గమనార్హం. 

ఎన్నికల ఏడాదిలో భారీ లక్ష్యం.. 
రానున్న సాధారణ ఎన్నికలకు ముందే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా 2014 నుంచి ఇప్పటివరకు 8 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి... 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ ఏడాది కొత్తగా 8.89 లక్షల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా ఎస్సారెస్పీ–2 కింద 1.26 లక్షలు, కల్వకుర్తి కింద 1.65 లక్షలు, దేవాదుల కింద 1.23 లక్షలు, వరద కాల్వ కింద 1.02 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. అయితే భారీ ప్రాజెక్టులు ఖాళీగా ఉండటం, భూసేకరణ పూర్తిగాకపోవడం, రైల్వే, రోడ్డు క్రాసింగ్‌ సమస్యలు వంటివాటి కారణంగా ప్రాజెక్టుల పనులకు ఆటంకం కలుగుతోంది. 

కల్వకుర్తికి నీటి కటకట 
శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుని.. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, శంషాబాద్‌ ప్రాంతాల్లో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కల్వకుర్తి ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టు కింద ఇప్పటివరకు రూ.3,872.28 కోట్లు ఖర్చు చేయగా.. గతేడాది ఖరీఫ్‌లో 2.60 లక్షల ఎకరాలకు నీరివ్వడంతో పాటు 417 చెరువులను నింపారు. ఈ ఏడాది అదనంగా మరో 1.65 లక్షల ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యం. కానీ శ్రీశైలంలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోవడం, ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్‌ నిండితేగానీ ఇక్కడికి నీరు చేరే అవకాశం లేదు. ఇక ప్రాజెక్టు పరిధిలో 1,824 ఎకరాల భూసేకరణ మిగిలి ఉంది. దీంతో ఆయకట్టుకు ఏ మేరకు నీరివ్వగలరనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు భూసేకరణ తిప్పలు 
జూరాల నుంచి 21.42 టీఎంసీల నీటిని తీసుకొని 2 లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో 2005లో రూ.1,428 కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టును చేపట్టారు. అనంతరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,331.47 కోట్లకు సవరించారు. ఇప్పటివరకు రూ.2,127.01 కోట్ల మేర ఖర్చు చేసి, 90శాతం పనులు పూర్తి చేశారు. దీనికింద గత ఖరీఫ్‌లో 1.20 లక్షల ఎకరాలకు నీరివ్వడంతోపాటు 110 చెరువులను నింపారు. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. కానీ ఇంకా మిగిలి ఉన్న 443.94 ఎకరాల భూసేకరణ కారణంగా అదనపు ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. రెండు చోట్ల రైల్వే క్రాసింగ్‌ సమస్యలున్నాయి. ఇక జూరాల నుంచి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 2.03 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,420 కోట్లతో బీమా ప్రాజెక్టును చేపట్టారు. తర్వాత వ్యయాన్ని రూ.2,509.67 కోట్లకు సవరించారు. ఈ ప్రాజెక్టు కింద 2014 వరకు 33 వేల ఎకరాలకు నీరివ్వగా.. గతేడాది గరిష్టంగా 1.70 లక్షల ఎకరాలకు అందించారు. ఈ ఏడాది పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలని భావించినా.. ఇక్కడ 501 ఎకరాల భూసేకరణ మిగిలి ఉండటం సమస్యగా మారింది. 

తుమ్మిళ్లలో సిద్ధంకాని మోటార్లు 
ఆర్డీఎస్‌ కింద సాగునీరందని 56 వేల ఎకరాలకు డి–24 నుంచి డి–40 వరకు ఉన్న చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి తుమ్మిళ్ల ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఇందులో మొదటి దశ కింద రూ.162 కోట్లతో అప్రోచ్‌ కెనాల్, పంపుహౌజ్, పైపులైన్‌ పనులను పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లోనే ఆయకట్టుకు నీరివ్వాలని భావించారు. కానీ అవసరమైన మోటార్లు, పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీంతో కనీసం ఒక్క మోటార్‌నైనా ఆగస్టు నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా మోటార్లు డిసెంబర్‌ వరకు సిద్ధమయ్యే అవకాశముంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top