చెక్కుల మార్పిడికి మరో అవకాశం

Rythu Bandhu Cheque Distribution In Karimnagar - Sakshi

కరీంనగర్‌సిటీ: రైతు బంధు పథకంలో భాగంగా మొదటి విడతలో వివిధ కారణాలతో చెక్కులను నగదుగా మార్చుకోలేని రైతులకు ప్రభుత్వం మూడు నెలల కాలపరిమితిని ఎత్తివేసింది. ఆ కాల పరిమితిని మరో 3 నెలలు పొడగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు. జిల్లాలో రైతు బంధు పెట్టుబడి సాయం కింద మే 10 నుంచి వర్షాకాలం పంటకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అర్హులైన రైతులకు ప్రభుత్వం చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం అందించిన విష యం తెలిసిందే. ఆ చెక్కులను వివిధ దఫాల వారీగా 4 తారీఖులలో ముద్రిం చారు. ముద్రణ తేదీ నుంచి 3 నెలల కాల వ్యవధి వరకు చెల్లుబాటు సౌకర్యంతో వ్యవసాయశాఖ కమిషనర్‌ నుంచి చెక్కులను జారీ చేయడం జరి గిందని తెలిపారు. జిల్లాలో మొత్తంగా రూ.124.59 కోట్ల విలువైన 1,46,027 చెక్కులకు గాను ప్రభుత్వం రూ.116.52 కోట్ల విలువైన 1,31,268 చెక్కులు జిల్లాకు పంపిణీ చేసింది.

అందులో రూ.112.89 కోట్ల విలువైన 1,25,062 చెక్కులను రైతులు నగదుగా మార్చుకున్నారు. ఇంకా రూ.3.63 కోట్ల విలువైన 6,206 చెక్కులను నగదుగా మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం అన్ని బ్యాంకర్లతో సమావేశమై చెక్కులను నగదుగా మార్చుకునేందుకు నిర్దేశిత మూడు నెలల కాలపరిమితిని ఎత్తివేసి మరో మూడు నెలలు పొడగించారు. ఏప్రిల్‌ 19, మే 1, మే 10, మే 15 తేదీలలో చెక్కులు తీసుకుని నగదుగా మార్చుకోని వారికి అప్పటి మూడు నెలల కాలపరిమితికి మరో 3 నెలల పొడగింపు ఉంది. అయితే.. ఈనెల 10వ తేదీ నుంచి రైతులు బ్యాంకులకు చెక్కులు తీసుకొస్తే చెల్లుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించినట్లు డీఏవో శ్రీధర్‌ తెలిపారు. రైతు సోదరులు ఆలస్యం చేయకుండా సమీపంలోని రైతుబంధు బ్యాంకులలో కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు జతపరుస్తూ సంప్రదించాలని డీఏవో శ్రీధర్‌ సూచించారు.

అందని చెక్కులు..
జిల్లాలో ఇప్పటివరకు రెవెన్యూ సమస్యలతో పాసుపుస్తకాలు పొందని, తదితర కారణాలతో చెక్కులు అందని పరిస్థితి ఉంది. ఆ సమస్యలు పరిష్కారమయ్యాకే వారికి చెక్కులిచ్చేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందని చెబుతోంది. చెక్కులు అందినవారు తీసుకోవడానికి ఉన్న శ్రద్ధ ఇంకా పంపిణీ చేయని వారిపై దృష్టి కేంద్రీకరించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండో పంట వస్తున్నా రెవెన్యూ సమస్యలు తీరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పుల సవరణ తర్వాత గత రెండు పంటల పెట్టుబడి సాయం అందిస్తారా? మళ్లీ కొత్తగానే అమలు చేస్తారా? అనేది కూడా రైతుల్లో సందేహం నెలకొంది.

పాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణం తక్కువగా రావడం, పేర్లలో తప్పులు దొర్లడం, తదితర రెవెన్యూ సవరణలకు కాలయాపన జరుగుతోంది. అది రెవెన్యూ పనిభారమో? రైతులతో బేరమో? అనేది ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరముందంటున్నారు రైతులు. చెక్కుల జాప్యం ఫలితంగా అర్హులైన రైతులు పెట్టుబడి సాయానికి నోచుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.124.59 కోట్ల విలువైన 1,46,027 చెక్కులకు గాను ప్రభుత్వం రూ.116.52 కోట్ల విలువైన 1,31,268 చెక్కులు జిల్లాకు పంపిణీ చేసింది. ఇంకా 14,759 మంది రైతులకు గాను రూ.8.07 కోట్ల విలువగల చెక్కులు అందలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top