ఎక్కడ పడితే అక్కడ ఇక చెల్లదు

ఎక్కడ పడితే అక్కడ ఇక చెల్లదు


మార్గదర్శకాలతో నూతన పార్కింగ్‌ పాలసీ

ప్రైవేటు పార్కింగ్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు

ఆస్తిపన్నులో మినహాయింపు.. భవనం ఎత్తు పెంచుకునే వెసులుబాటు

నివాస, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పార్కింగ్‌కు కొత్త నిబంధనలు

నూతన విధానం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం..




ఆఫ్‌స్ట్రీట్‌ పార్కింగ్‌ లాట్స్‌కు ప్రోత్సాహకాలు



బీవోటీ విధానంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పార్కింగ్‌ లాట్‌ల ఏర్పాటుకు ప్రోత్సాహం



ఖాళీ స్థలాల్లో పార్కింగ్, మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సదుపాయాలు కల్పించే వారికి పార్కింగ్‌ నిర్వహణ లైసెన్స్‌ల జారీ.



పార్కింగ్‌ సదుపాయం కల్పించే వ్యక్తులకు అంతే స్థల

పరిమాణంతో

100 శాతం టీడీఆర్‌ హక్కులు కల్పిస్తారు.



జోన్ల నిబంధనలను సడలించి

వాణిజ్య ఉపయోగాలకు అనుమతిస్తారు.



పార్కింగ్‌కు మల్టిపుల్‌ ఫ్లోర్‌లను కేటాయిస్తే

భవన ఎత్తు విషయంలో నిబంధనల సడలింపు.



నిర్ణీత కాలం పాటు పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తే 100 శాతం ఆస్తి పన్ను మినహాయింపు.



100 శాతం భవన నిర్మాణ రుసుం మినహాయింపు .




సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం, రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ‘పార్కింగ్‌ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండగా వాహనాల పార్కింగ్‌ సదుపాయం మాత్రం పరిమితం ఉంది. దీంతో రోడ్లు, వీధుల్లో వాహనాల అక్రమ పార్కింగ్‌ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయాలను పెంపొందించేందుకు కొత్త మార్గదర్శకాలతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఈ పాలసీని ప్రకటించింది. అందులోని ముఖ్యాంశాలివీ..



నివాస ప్రాంతాల్లో పార్కింగ్‌ ఇలా..

నివాస ప్రాంతాల్లో వాహనాలను రోడ్ల వెంట పార్కింగ్‌కు అనుమతించరు.



పార్కింగ్‌ ఏర్పాట్లు ప్రోత్సహించేందుకు బిల్డింగ్‌ బైలాస్‌ అమలు చేస్తారు.



ప్రైవేట్‌ ఆఫ్‌స్ట్రీట్‌ ప్రాంతాల్లో పార్కింగ్‌ను ప్రోత్సహించేలా భవన నిర్మాణ అనుమతుల్లో మార్పులు.



ప్రైవేట్‌ పార్కింగ్‌లను ప్రోత్సహించేందుకు ఆస్తిపన్ను చెల్లింపులో మినహాయింపు.



పార్కింగ్‌ల కోసం నిర్మాణాలు చేసే వారికి ఆ మేరకు భవనం ఎత్తు పెంచుకునే వెసులుబాటు.



ఫ్లాట్ల యజమానులు, సందర్శకులు ఆన్‌స్ట్రీట్‌ రోడ్లపై పార్కింగ్‌ చేయడంపై నిషేధం.



ప్రభుత్వ కార్యాలయాలు, థియేటర్లు తదితర ప్రాంతాల్లో...

 విద్యా సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, వినోద కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తమ సిబ్బంది, సందర్శకులకు ఆఫ్‌స్ట్రీట్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి.



వివిధ సంస్థలు తమ ఉద్యోగులు, సందర్శకుల అవసరాలకు తగినంతగా పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి

ఆయా సంస్థల్లో పార్కింగ్‌ సదుపాయాలు చాలని వారికి రోడ్లపై పార్కింగ్‌ను అనుమతించరు. ∙పని వేళల తర్వాత పార్కింగ్‌ సదుపాయాలు కల్పించే సంస్థలను ప్రోత్సహిస్తారు.



భారీ వాహనాల పార్కింగ్‌ ఇలా...

బస్సులు, ట్రక్కులు, ఓమ్ని బస్సులు, టూరిస్టు బస్సులు, వ్యాన్లు, వాటర్‌ ట్యాంకర్లు, కంటైనర్‌ లారీలు రాత్రిళ్లు మేజర్‌ రోడ్లపై పార్కింగ్‌ చేయడాన్ని అనుమతించరు. వాటికోసం ప్రత్యేకంగా ఆఫ్‌స్ట్రీట్‌ పార్కింగ్‌ సదుపాయాలు కల్పిస్తారు. వినియోగంలో లేని వాహనాలను కూడా అక్కడ పార్కింగ్‌ చేయవచ్చు. ∙తగిన ఫీజులతో నిర్దేశిత ప్రాంతాల్లో ప్రైవేట్‌ వాహనాలు రాత్రంతా పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. క్యాబ్స్, బస్సులు, ట్రక్కులు వాణిజ్య కార్యకలాపాల లైట్‌ వెహికల్స్‌ను రాత్రివేళల్లో నివాస ప్రాంతాల్లో పార్కింగ్‌కు అనుమతించరు.



బస్, రైల్వే స్టేషన్లలో...

సబర్బన్‌ రైల్వే, ఎంఎంటీఎస్, మెట్రోస్టేషన్లు, ఆర్టీసీ బస్‌ టెర్మినల్స్‌ వద్ద ప్రయాణికుల కోసం పార్కింగ్‌ సదుపాయాలు మెరుగుపరచాలి.

అవసరమైతే ఈ ప్రాంతాల్లో ప్రైవేటు పార్కింగ్‌ సదుపాయాన్ని ప్రోత్సహించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top