కమలం.. కొత్త దళం | Sakshi
Sakshi News home page

కమలం.. కొత్త దళం

Published Sat, Nov 17 2018 9:43 AM

KAMALAM - Sakshi

జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ మూడు విడతల్లో ఖరారు చేసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను, మూడు విడతల్లో ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరిలో దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావు మినహా, మిగతా ఏడుగురు అభ్యర్థులు తొలిసారిగా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థులను ప్రకటించని మిగతా మూడు నియోజకవర్గాల్లోనూ కొత్త వారికే బీజేపీ టికెట్‌ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ మూడు విడతల్లో విడుదల చేసింది. పదకొండు అసెంబ్లీ స్థానాలకు గాను గజ్వేల్, నర్సాపూర్, జహీరాబాద్‌ మినహా మిగతా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర నాయకుడు రఘునందన్‌రావు మాత్రమే 2014 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేశారు. బాబుమోహన్‌ అందోలు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేతలందరూ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారే కావడం గమనార్హం.

సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తమ్‌ రెడ్డి, హుస్నాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న చాడ శ్రీనివాస్‌ రెడ్డి, మెదక్‌ అభ్యర్థి ఆకుల రాజయ్య కొంత కాలంగా బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తూ, టికెట్‌ దక్కించుకున్నారు. సంగారెడ్డి నుంచి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకున్న రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే సుమారు రెండు నెలల క్రితం టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. నారాయణఖేడ్‌ అభ్యర్థి రవికుమార్, పటాన్‌చెరు అభ్యర్థి కరుణాకర్‌ రెడ్డికి టికెట్‌ దక్కడం పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది.

ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీకి చెందిన కీలక నేతలు నామినేషన్ల నాటికి పార్టీలో చేరతారని బీజేపీ అంచనా వేసింది. టీఆర్‌ఎస్‌ నేతలెవరూ బీజేపీ వైపు మొగ్గు చూపక పోగా, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ఏకంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. కీలక స్థానాలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో కాంగ్రెస్, టీడీపీ తాత్సారం చేస్తుండడంతో.. కొత్త ముఖాలను బరిలోకి దించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు జాబితా వెల్లడిస్తోంది.

మరో మూడు స్థానాల్లో కొత్తవారే?
నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగియనుండగా, మరో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు, నర్సాపూర్, జహీరాబాద్‌ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కొండపాకకు చెందిన న్యాయవాది ఆర్‌.శ్రీనివాస్‌ గజ్వేల్‌ స్థానాన్ని ఆశిస్తుండగా, జహీరాబాద్‌ నుంచి జంగం గోపి, నర్సాపూర్‌ నుంచి సింగాయపల్లి గోపికి టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ ఇతర పార్టీల నుంచి నేతలెవరూ బీజేపీలో చేరే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఈ మూడు స్థానాల్లోనూ కొత్త ముఖాలను బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే?
దుబ్బాక మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ పార్టీలో పనిచేస్తున్న వారు, కొత్తగా వచ్చి చేరిన వారికి అవకాశం ఇవ్వడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఎంత మేర ప్రభావం చూపుతారనే విషయాన్ని పక్కన పెడితే, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తగా వచ్చి చేరే వారికి ఎలాంటి అనుమానం లేకుండా టికెట్లు దక్కుతాయనే సంకేతం ఇచ్చేందుకు అసెంబ్లీ బరిలో కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనుసరించిన వ్యూహం ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందో డిసెంబర్‌ 11న తేలనుంది.

నియోజకవర్గం  :-   అభ్యర్థి
సిద్దిపేట           :-   నాయిని నరోత్తమ్‌ రెడ్డి
దుబ్బాక         :-    రఘునందన్‌రావు
గజ్వేల్‌    –
హుస్నాబాద్‌   :-  చాడ శ్రీనివాస్‌ రెడ్డి
మెదక్‌           :-   ఆకుల రాజయ్య
నర్సాపూర్‌    –
సంగారెడ్డి       :- రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే
పటాన్‌చెరు     :-   కరుణాకర్‌ రెడ్డి
నారాయణఖేడ్‌  :-  రవికుమార్‌
అందోలు         :-   బాబూమోహన్‌
జహీరాబాద్‌    –

Advertisement
Advertisement