మక్కలో మనమే ‘టాప్’


సిద్దిపేట జోన్: తెలంగాణలోనే ఈ సంవత్సరం అత్యధికంగా మక్కలు కొనుగోలు చేసిన జిల్లాగా మెతుకుసీమ రికార్డు నమోదు చేసుకుంది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ రికార్డుల ప్రకారం మక్కల కొనుగోళ్లలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. జిల్లాలో ద్వితీయ పంటగా గుర్తింపు పొందిన మక్కను విస్తృతంగా కొనుగోలు చేసేందుకు జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు రెండు నెలల క్రితం 75 కేంద్రాలను ఏర్పాటు చేసి  మక్కల కొనుగోళ్లు చేపట్టింది.



అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 12 నాటికి జిల్లా వ్యాప్తంగా 39 వేల మెట్రిక్ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మరోవైపు కొనుగోళ్ల సీజన్ చివరిదశకు చేరుకోవడంతో ఈ నెల 20లోగా సంబంధిత కొనుగోలు కేంద్రాలన్నింటినీ మూసివేయాలంటూ మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొనుగోళ్ల మరింత పెరిగే అవకాశం ఉంది.  



గ్రేడ్‌లతో పెరిగిన కొనుగోళ్లు

జిల్లా రైతాంగం ఖరీఫ్‌లో పండించిన మక్కలను కొనుగోలు చేసేందుకు జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు ఐకేపీ పక్షాన 47, పీఏసీఎస్ పక్షాన 18 కేంద్రాలను ప్రారంభించారు. మెదక్, సంగారెడ్డి డివిజన్‌లలో స్వల్పంగా, సిద్దిపేట డివిజన్‌లో అత్యధికంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మార్పుతో ఈ సంవత్సరం వినూత్నంగా మక్క కొనుగోలు సాగింది. మద్దతు ధర అందించే విషయంలో సర్కార్ మక్కలను ఏ,బీ,సీ గ్రేడుల్లో కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టింది.



ఈ వినూత్న ప్రక్రియతో మక్క రైతు పెద్ద ఎత్తున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు. అందుకు నిదర్శనంగానే ఎన్నడూ లేనంతగా ఈ సారి జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టారు. సుమారు 16 వేల మంది రైతుల నుంచి 39 వేల మెట్రిక్ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఈ లెక్కన రూ. 53 కోట్లను మక్క రైతుకు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొనుగోళ్ల ప్రక్రియలో అత్యధికంగా మక్కలు కొనుగోలు చేసిన జిల్లాగా మెదక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అందులో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం లక్ష క్వింటాళ్లను సేకరించడం గమనార్హం.

 

ఈ నెల 20 చివరి రోజు...

జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు మరో పక్షం రోజులు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులంతా తాము పండించిన మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది రైతులు మక్కలను విక్రయించకుండా ఉన్నారు. ఇది గుర్తించిన మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారులు ఈ నెల 20లోగా జిల్లా వ్యాప్తంగా మక్కల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి, కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో సంబంధిత అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 75 మక్క కొనుగోలు కేంద్రాలను మూసివేయాలంటూ పీఏసీఎస్, ఐకేపీలతో పాటు మార్కెటింగ్ శాఖ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.

 

జిల్లా రైతుల మక్కలే కొనండి

మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల సరిహద్దులకు కూడలిగా ఉన్న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇక నుంచి పొరుగు జిల్లాలకు సంబంధించిన రైతుల మక్కలు కొనుగోలు చేయవద్దని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సీనియర్ మేనేజర్ సి. ఉదయసేనారెడ్డి, జిల్లా మేనేజర్ నాగమల్లికలు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.



ఈ సందర్భంగా యార్డులో  కొనుగోళ్లు చేస్తున్న పీఏసీఎస్ పనితీరుపై ఆరా తీశారు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు నిత్యం వస్తున్న మక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ సీజన్ కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చినందున జిల్లాకు చెందిన మక్కలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అనంతరం యార్డులోని మక్కలను పరిశీలించి నాణ్యత ప్రమాణంగా సేకరించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top