‘సమస్యలపై ఫోన్‌ చేస్తే ఎప్పుడూ స్పందించరు’ 

Ex Minister Gaddam Prasad Kumar Agitation On District Collector - Sakshi

కలెక్టర్‌ ఎదుట మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ ఆవేదన

సాక్షి, వికారాబాద్‌: ‘నేను చాలా సార్లు ఫోన్‌ చేశా, మీరు తీయడం లేదు, ఒక వేళ మీటింగ్‌లతో బిజీగా ఉంటే ఆ తర్వాతైనా ఫోన్‌ చేయొచ్చు కదా.. మీరు ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. వివరాలిలా ఉన్నాయి.. రైతు సమస్యల పరిష్కారం డిమాండ్‌తో సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్‌ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వద్దకు వెళ్లిన ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిదులంటే చిన్నచూపు ఎందుకని నిలదీశారు. మీతో మాకు వ్యక్తిగత అవసరలేవీ లేవని, ఈ ప్రాంతం గురించి మీకు గానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గానీ పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. అందుకోసమే కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్‌ చేస్తే మీరు స్పందించడం లేదని అసహనం వ్యక్తంచేశారు.

తాము 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్‌ తీయలేకపోతే తర్వాత చేసినా మార్యాద ఇచ్చిన వారవుతారన్నారు. పలు సమస్యలపై మాట్లాడేందుకు తాను చాలా సార్లు ఫోన్‌ చేసినా తీయలేదన్నారు. ఇది తమను అగౌరవపర్చినట్లేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సగం మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందలేదని, 50 శాతం రైతులకు రైతుబంధు అందలేదని తెలిపారు. జిల్లా అంటే మరుగుదొడ్లు నిర్మించడం, మొక్కలు నాటడమే కాదు, ప్రజల అవసరాలను తెలుసుకొని పాలన అందిస్తే మంచిదని ప్రసాద్‌కుమార్‌ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, మండల అధికారులు ఎప్పుడు చూసినా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వీసీ అంటూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. అధికారుల పనితీరుతో ఎంతో మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top