ఒడిషా 37 ఆలౌట్ | Sakshi
Sakshi News home page

ఒడిషా 37 ఆలౌట్

Published Wed, Nov 25 2015 1:29 AM

ఒడిషా 37 ఆలౌట్

* 133 పరుగులతో బెంగాల్ ఘన విజయం
* దిండా, ఓజా బౌలింగ్ మెరుపులు
* రంజీ ట్రోఫీ
నాడియా: ఒడిషా లక్ష్యం 171 పరుగులు... చేతిలో 10 వికెట్లు... ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉంది.... ఇక ఒడిషా గెలుపు లాంఛనమే అనుకుంటున్న దశలో... బెంగాల్ బౌలర్లు సంచలన ప్రదర్శనతో చెలరేగిపోయారు. పేసర్ అశోక్ దిండా (7/19) నిప్పులు చెరిగే బౌలింగ్‌కు ప్రజ్ఞాన్ ఓజా (3/14) స్పిన్ మ్యాజిక్ తోడవడంతో ఒడిషా రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులకే ఆలౌటైంది.

దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్-ఎలో మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ 133 పరుగుల తేడాతో ఒడిషాపై ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమం లో ఒడిషా రెండో ఇన్నింగ్స్‌లో 19.2 ఓవర్లలో 37 పరుగులకు ఆలౌటైంది. రంజీల్లో నమోదైన అత్యల్ప స్కోర్లలో ఇది కూడా ఒకటి. అంతకుముందు 23/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన  బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 55.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.
 
పిచ్‌పై ఓసీఏ ఫిర్యాదు
ఒకటిన్నర రోజులోనే మ్యాచ్ ముగియడంతో పిచ్‌పై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ఒడిషా క్రికెట్ సంఘం (ఓసీఏ) వెల్లడించింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు ఇలాంటి వికెట్లను రూపొందిస్తారా? అంటూ ఓసీఏ కార్యదర్శి అసిర్బాద్ బెహ్రా ధ్వజమెత్తారు. ‘పిచ్ మమ్మల్ని చాలా నిరాశకు గురి చేసింది. ఇప్పటికే మ్యాచ్ రిఫరీ దగ్గర ఫిర్యాదు చేశాం. దీన్ని బోర్డు గ్రౌండ్స్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్‌కు పంపిస్తాం’ అని బెహ్రా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement