ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి

FOCUS ON 2024 ELECTIONS SAYS NARENDRA MODI - Sakshi

ప్రత్యర్థులపై ద్వేషం వద్దు: మోదీ  

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలంతా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పనిచేయాలనీ, గత ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయని ప్రజల మనసులను కూడా గెలుచుకుని, వచ్చే ఎన్నికల్లో వారంతా బీజేపీకే ఓటు వేసేలా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఓటు వేయని వారిపై లేదా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడిన వారిపై ద్వేష భావం వద్దనీ, అందరినీ కలుపుకుని పోతూ, అందరి మన్ననలూ పొందుతూ తర్వాతి ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయం చేసుకునేలా ప్రవర్తించాలని తమ ఎంపీలకు మోదీ మార్గ నిర్దేశం చేశారు.

అన్ని చోట్లా ప్రజలతోపాటే క్యూల్లో నిలబడాలనీ, జనంతో కలిసిపోయి మనుషులందరితో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. 380 మందికి పైగా బీజేపీ ఎంపీలకు శిక్షణనివ్వడం కోసం బీజేపీ శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముగింపు సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలం నుంచి ఇప్పుడు ప్రధానిగా రెండోసారి గెలిచేంత వరకు, దాదాపు రెండు దశాబ్దాలుగా తాను ఎప్పుడూ అధికారంలోనే ఎలా ఉంటున్నదీ మోదీ వివరించారు. ఎంపీలు కూడా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ ఎంతో నిబద్ధతతో ఉండాలనీ, నియోజకవర్గంలోని ప్రజలను ఎప్పుడూ కలుస్తూ, వారి మధ్యనే ఎక్కువ కాలం గడపాలని ఆయన సూచించారు.

వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించవద్దనీ, రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు, నియోజకవర్గానికి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఏయే పోలింగ్‌ బూత్‌ల్లో ఓట్లు సరిగ్గా పడలేదో గుర్తించి, ఆ బూత్‌ల పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిపై ద్వేషం పెంచుకోవడానికి బదులు మంచి చేస్తూ వారి ఆశీర్వాదం పొందాలంటూ ఎంపీలకు మోదీ పలు కిటుకులు చెప్పారు. కాగా, మోదీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు కచ్చితంగా చేరేలా చేసేందుకు ఎంపీలను ఉపయోగించుకోవాలని మంత్రులకు బీజేపీ సూచించింది. ఎంపీలతో ప్రతి నెలా మంత్రులు సమావేశమై పథకాల గురించి వారికి చెబుతుండాలనీ, ఈ భేటీలకు అన్ని పార్టీల ఎంపీలనూ ఆహ్వానించాలని తెలిపింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top