ప్రతిపక్ష నేతను వాడు అంటావా?  | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేతను వాడు అంటావా? 

Published Sat, Oct 27 2018 4:29 AM

Botsa Satyanarayana fires on Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తరువాత  24 గంటల్లో నాలుగు సార్లు మీడియా ముందుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తూ..  ప్రతిపక్ష నేతను పట్టుకుని  ‘ఆడు, వీడు’ అంటూ అసభ్య  పదజాలం వాడారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారని.. ఆయన ముఖంలో మానవత్వం ఏ మాత్రం కనపడకుండా మృగంలో ఉండే క్రూరత్వం గోచరిస్తోందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ  చంద్రబాబు మాటలు, చేష్టలు ఆయన వాడిన భాష చూస్తే రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారా? అని  ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు.

చివరకు జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించిన రాజకీయ పార్టీలపైనా బురద జల్లాలని  ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. గాయపడిన జగన్‌ హాస్పిటల్‌కు వెళతారా? లేక పోలీసుస్టేషన్‌కు వెళతారా? అని  ప్రశ్నిస్తూ చంద్రబాబు చిన్న మెదడు చితికినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌ తొలుత తన ఇంటికే బయలు దేరారని మధ్యలో ఢిల్లీ నుంచి ఫోన్‌ వస్తే ఆస్పత్రిలో చేరారని ఆరోపించడం దుర్మార్గమని, అలా అనడానికి చంద్రబాబుది నోరా! తాటిమట్టా? అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్‌ హాస్పిటల్‌లో చేరిన తరువాత 9 కుట్లు పడ్డాయని డాక్టర్లు చెబుతూ ఉంటే దానిపై చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్‌ను బొత్స ప్రదర్శించారు. అన్ని విధాలా రాష్ట్రంలో చంద్రబాబు విఫలమయ్యారు కనుక రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పదిమంది ఐపీఎస్‌లు ఉంటే డీఎస్పీతో దర్యాప్తునకు సిట్‌ వేయడమేమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేను చంపినపుడే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలిసి పోయిందన్నారు. విమానాశ్రయంలో ఉన్న క్యాంటీన్‌ యజమాని హర్షవర్థన్‌ను ఎందుకు విచారించలేదని బొత్స ప్రశ్నించారు. గత ఎన్నికల్లో  ఆయన గాజువాక టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారని, హర్షవర్థన్‌ తాలూకు ఫుడ్‌కోర్టును లోకేష్‌బాబు ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇంకా రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఎలా ఉంటుందని, అందుకే థర్డ్‌ పార్టీ విచారణను కోరుతున్నామని బొత్స వివరించారు.    

Advertisement
Advertisement