'ప్రగతి'ని ప్రారంభించిన ప్రధాని

'ప్రగతి'ని ప్రారంభించిన ప్రధాని - Sakshi


న్యూఢిల్లీ: సామాన్యుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు పరిష్కారం, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, సమీక్ష.. లక్ష్యాలుగా కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ ఆధారిత కార్యక్రమం ‘ప్రగతి’ని బుధవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత్‌వైపు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో మనదేశంలో పరిపాలన మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకుందన్నారు. ప్రగతి(ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్-సానుకూల పాలన, సమయోచిత అమలు) అనేది 'సాంకేతిక పరి జ్ఞాన ఆధారితమైన ఒక ప్రత్యేకమైన సమగ్ర, పారస్పరిక వేదిక' అని ఆయన వివరించారు.



ఈ సందర్భంగా అకాల వర్షాలు, రైతులకు పరిహారం, ప్రజా ఫిర్యాదులు, ప్రాజెక్టుల అమలు, స్వచ్ఛ భారత్.. మొదలైన అంశాలపై ప్రధాని చర్చించారు. ఈ కార్యక్రమంలో ఈపీఎఫ్ చెల్లింపులకు సంబంధించి దాదాపు 20 మంది చేసిన ఫిర్యాదులను పరిష్కరించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపిం ది. మహారాష్ట్ర లేవనెత్తిన నవీ ముంబై విమానాశ్రయానికి అనుమతుల అంశం, యూపీ లేవనెత్తిన జాతీయ రహదారులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించారంది. దాదాపు డజ ను కేంద్ర మంత్రిత్వ శాఖలు, 13 రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్న ఆరు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించారని వెల్లడించింది. 'ప్రగతి' ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని, మెరుగైన వ్యవస్థను రూపొం దించడం సాధ్యమవుతుందని పేర్కొంది.



'ప్రగతి' ఏమిటి?


  •  ప్రగతి(ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) అనేది ఒక సమగ్ర ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాం.

  •  ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో, పథకాల సమీక్షలో అత్యాధునిక సాంకేతికాంశాలైన డిజిటల్ డేటా మేనేజ్‌మెంట్, వీడియో కాన్ఫరెన్సింగ్, జియో స్పేటియల్ టెక్నాలజీలను ఇది ఉపయోగించుకుంటుంది.

  • ప్రధాని కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు.. ఇలా మూడంచెల్లో ఇది పనిచేస్తుంది.

  • కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సహకార సమాఖ్య విధానం ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తుంది.

  • ఏదైనా అంశానికి సంబంధించి పూర్తి క్షేత్రస్థాయి సమాచారంతో ఒకేసారి సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రధాని నేరుగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తుంది.

  • ఈ ప్రగతి అప్లికేషన్ కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అందుబాటులో ఉంటుంది.

  • సెంట్రల్ సెక్రటరీలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నెలకోసారి ప్రధాని దీన్ని సమీక్షిస్తారు.

  • ఈ కార్యక్రమం జరిగే ప్రతీ నెల నాలుగో బుధవారాన్ని ‘ప్రగతి డే’గా నామకరణం చేశారు.


 ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఆర్థిక సాయం


ఆర్థిక సంక్షోభం కారణంగా స్తంభించిపోయిన పలు విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రైవేటు కంపెనీలకు ఆర్థిక సాయం చేసేందుకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. విదేశాల నుంచి ఖరీదైన ద్రవీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ)ను దిగుమతి చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఈ సాయం చేయాలని నిర్ణయించింది.  

రైల్వే ప్రాజెక్టులకు రూ.500 కోట్లు: ఓడరేవు సంబంధిత రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను పెంచేందుకు గాను రూ. 500 కోట్లతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగరమాల ప్రాజెక్టుకు ఓకే: తీరప్రాంత రాష్ట్రాల్లో ఓడరేవుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతించింది. సాగరమాల ప్రాజెక్టు విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.



ఈ-గవర్నెన్స్ ప్లాన్‌కు ఆమోదం



దేశంలో సమాచార, ప్రసార సాంకేతికతలను సమర్థంగా ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ‘ఈ-క్రాంతి: నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్ 2.0’ కింద వివిధ కార్యక్రమాల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.



101 నదుల్లో జలమార్గాలు


దేశంలో జలరవాణాను పెంచేందుకు గాను 101 నదులను జలమార్గాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆయా నదులను జాతీయ జలమార్గాలుగా మార్చేందుకు అవసరమైన చట్టాన్ని రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.



సూపర్‌కంప్యూటింగ్‌కు రూ. 4500 కోట్లు



జాతీయ స్థాయిలో విద్యా, పరిశోధన సంస్థలను అనుసంధానం చేసేందుకు గాను రూ. 4500 కోట్ల ఖర్చుతో జాతీయ సూపర్‌కంప్యూటింగ్ మిషన్‌ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top