కరోనా బారిన పడ్డ యువ గాయని

American Singer Kalie Shorr Tests Positive For Corona Virus - Sakshi

టెనిస్సీ: అమెరికా కంట్రీ సింగర్‌ కేలీ షోర్‌(25) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా తనకు మహమ్మారి సోకిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు... ‘‘ మూడు వారాలుగా ఇంటికే పరిమితమయ్యాను. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లాను. అయినా కరోనా సోకింది. అప్పటి నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నా. ఒళ్లు నొప్పులు, జ్వరం, రుచిమొగ్గలు, ముక్కు పనిచేయడం మానేశాయి. దీనిని బట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం నాకు విసుగు తెప్సిస్తోంది’’ అని కేలీ ట్వీట్‌ చేశారు.(కరోనాతో ప్రముఖ సింగర్‌ మృతి)

కాగా అమెరికా జానపద, పాశ్చాత్య సంస్కృతుల మేళవింపుతో కూడిన పాటలు ఆలపించే కేలీ ఆరేళ్ల ప్రాయం నుంచే గీత రచన చేస్తున్నారు. 13వ ఏట గిటార్‌ వాయించడం నేర్చుకున్న ఆమె... యూట్యూబ్‌లో అనేక హిట్‌సాంగ్స్‌కు కవర్‌ సాంగ్స్‌ రూపొందించారు. ఆ తర్వాత ఫైట్‌ లైక్‌ ఏ గర్ల్‌ పాటతో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. 2019లో తన తొలి ఆల్బమ్‌ ఓపెన్‌ బుక్‌ను విడుదల చేశారు. కాగా ప్రముఖ కంట్రీ సింగర్‌, గ్రామీ అవార్డు విజేత జోయ్‌ డిఫ్పీ కరోనాతో మృతి చెందిన విషయం విదితమే. అదే విధంగా మరో సింగర్‌ , గ్రామీ అవార్డ్‌ విజేత జాన్‌ ప్రైన్‌(73), ఆయన భార్య సైతం కరోనా బారిన పడ్డారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top