ఆ అమ్మాయి తిరిగి వచ్చేసిందా?! | Sikh Girl Allegedly Kidnapped In Pakistan Returns Family Denied Reports | Sakshi
Sakshi News home page

ఇష్టప్రకారమే వెళ్లాను; ఇంకా ఇంటికి రాలేదు!

Aug 31 2019 4:59 PM | Updated on Aug 31 2019 5:00 PM

Sikh Girl Allegedly Kidnapped In Pakistan Returns Family Denied Reports - Sakshi

నాంకానా సాహిబ్‌/ఇస్లామాబాద్‌ : తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని చెప్పిన సిక్కు యువతి జగ్జీత్‌ తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని జగ్జీత్‌ కుటుంబ సభ్యులు కొట్టిపడేశారు. తను ఇంటికి తిరిగి రాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు తమకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు శిరోమణి అకాళీదళ్ ఎమ్మెల్యే మజీందర్‌ సింగ్‌ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. కాగా పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గమైన సిక్కు మతానికి చెందిన పూజారి భగవాన్‌ సింగ్‌ కుమార్తె జగ్జీత్‌ కౌర్‌(19)ను ఓ ముస్లిం యువకుడు కిడ్నాప్‌ చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అమ్మాయిని ఎత్తుకువెళ్లిన అనంతరం మతం మార్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడని మజీందర్‌ సింగ్‌ గురువారం ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌, భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై పంజాబ్‌ (భారత్‌) ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ వీడియోను ట్వీట్‌ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌.. పాక్‌లో మైనార్టీల దుస్థితికి నిదర్శనం అని విమర్శించారు. భారత విదేశాంగ కూడా ఈ విషయంపై స్పందించాల్సిందిగా పాక్‌ను కోరింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్‌ కౌర్‌ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని పెళ్లాడానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ముస్లిం భర్త ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. కాగా తన కూతురిని ఎవరో కిడ్నాప్‌ చేశారని జగ్జీత్‌ తండ్రి ఫిర్యాదు చేయడం, యువతికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పంజాబ్‌ (పాకిస్తాన్‌) ముఖ్యమంత్రి సర్దార్‌ ఉస్మాన్‌ బుజ్డార్‌ స్పందించి విచారణకు ఆదేశించారు.

ఇక గత మార్చిలో పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ మైనర్‌ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్‌ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిని కోరిన విషయం తెలిసిందే. అయితే బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement