విజయమహల్‌ రిక్షా సెంటర్‌

Telugu Short Story In Sakshi Funday

 ఇది మీ పేజీ

నెల్లూరులో రైలు కట్టకు తూర్పు వైపున ఉన్న విజయమహల్‌ సెంటర్‌ ఊరికి  నడిబొడ్డు. రైలు గేట్‌కి తూర్పు పక్కన విజయమహల్‌ సెంటర్లో నాలుగు రోడ్ల కూడలిలో తూర్పు, దక్షిణ మూలను అనుకొనే మా ఇల్లు ఉండేది. మా ఇంటిముందు చాల పెద్ద జాగా ఉండేది. ఆ జాగాలో చాలామంది రిక్షా వాళ్ళు రాత్రి పూట బాడుగలు అయిపోయాక వాళ్ళ రిక్షాలను పెట్టుకొని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. రోజూ వాళ్ళు ఆ తావునే ఉండడంతో ఆ తావుకు  ‘విజయమహల్‌ రిక్షా సెంటర్‌’  అనే పేరు వచ్చింది.  దసరా వస్తే మా  రిక్షా వాళ్ళు అందరూ నవరాత్రులలో బాడుగలు మానేసి దసరా వేషాలు కట్టి నాలుగు రాళ్లు సులభంగా సంపాదించుకునే వాళ్ళు.

నెల్లూరులో మా విజయమహల్‌ సెంటర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో బాగా పాపులర్‌ అయిన దసరా వేషం  ఏదంటే మా తాగుపోతూ రమణయ్య వేసే శవం వేషం అని అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ కాస్త తాగుబోతు రమణుడు గురించి మీకు చెప్పాలి.అతనికి ఇల్లు, వాకిలి, భార్య,పిల్లా జల్లా...ఈ బంధాలు ఏవి లేకపోవడంతో రిక్షా బాడుగలు లేనపుడు పగలు రాత్రి తేడా లేకుండా  సారాయి తాగేసి రిక్షాలో పడి  మత్తుగా నిద్రలో జోగుతుండేవాడు.అందుకే అతనికి తాగుబోతు రమణుడు అని పేరు మా సెంటర్లో. దసరా రోజులలో పొద్దుపొద్దునే  తాగుబోతు రమణుడి చేత ఫుల్లుగా మందు తాగించేవాళ్ళు. బాగా తాగి మత్తులో వొళ్ళు తెలీకుండా ఉండే అతన్ని పాడె మీద పడుకోబెట్టి తాళ్లతో గట్టిగా కట్టసేవాళ్ళు. చెంచు రామయ్య ఆడమనిషి వేషం వేసుకొని జుట్టు విరబోసుకొని తాగుబోతు రమణయ్య భార్యలాగా నటించేవాడు.

ఇక సుధాకర్, రంగయ్య, శీనయ్య పాడె మోసేవాళ్ళు. మూడో మనుషులు అనిపించుకున్న మస్తాను, కస్తూరి కూడా ఆడ వేషాలలో చెంచురామయ్య ఏడుపుతో జతకలిపేవాళ్లు. అందరూ కలసి ఇంటింటి ముందరకు వెళ్లి పాడె దింపి తాగుబోతు రమణయ్య చనిపోయినట్టు గుండెలు బాదుకుంటూ ఏడ్చేవాళ్ళు. ఇళ్లలోని ఆడవాళ్లు ఇదెక్కడి పాడు వేషం అని చీదరించుకుంటూనే డబ్బులు ఇచ్చేవాళ్ళు త్వరగా వాళ్ళను వదిలించుకోవచ్చు అని. అలాగే వాళ్ళు  పాడెను అంగడి అంగడి ముందర దింపి ఏడుపు,పెడ బొబ్బలు మొదలెట్టేవారు. వాళ్ళ ఏడుపులకు కడ్డుపుబ్బా నవ్వుకొని పదో పరకో ఇచ్చేవాళ్ళు. నవరాత్రుల రోజులలో తాగుబోతు రమణయ్య శవం వేషం నెల్లూరు అంతా  ప్రాచుర్యం పొందింది. ఆ వేషం చూడడానికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కడెక్కడనుంచో  మా విజయమహల్‌ సెంటర్‌కి వచ్చేవాళ్ళు.

అప్పుడు మేము పదోతరగతిలో  ఉన్నప్పుడు అనుకుంటా ఎప్పటిలాగే ఆ  ఏడాది కూడా నవరాత్రులలో తాగుబోతు రమణయ్య చేత శవం వేషం వేయించారు. ఇంక విజయదశమి  రెండు రోజులు ఉందనగా, దుర్గాష్టమి రోజు పొద్దున మత్తులో ఉన్న రమణయ్యను పాడె మీద  వీధులలో తిప్పుతూ డబ్బులు దండుకోసాగారు. పండగ ఇక రెండు రోజులలో అయిపోతుంది. ఇక వేషాలేసి డబ్బులు సంపాదించే అవకాశం లేదని చెంచురామయ్య, సుధాకర్‌ , శీనయ్య వాళ్లంతా మధ్యాహ్నమైనా తిండి తినక పగలంతా ఎండలో తిరుగుతూ సాయంత్రం బాగా చీకటి పడేవేళకు  మా ఇంటిదగ్గరకు వచ్చి పాడెను దించి అందరూ మున్సిపాలిటీ కొళాయి దగ్గరకు వెళ్లి కాళ్లు, చేతులు కడుగుకుంటున్నారు. 

చెంచు రాముడు ఆకలికి ఓర్వలేక రోడ్డు దాటి పరుగులాంటి నడకతో మా కిష్టమామ అంగడికి వచ్చి పులి బొంగరాలు పొట్లం కట్టించుకోసాగాడు. ఈలోగా మిగతా వాళ్ళు తాగుబోతు రమణయ్య కట్లు విప్పి  అతని ముఖాన నీళ్లు చల్లారు. రమణయ్యలో  ఎటువంటి చలనం లేదు. అందరూ కంగారుగా ‘ఒరే  రవణా లేవరా పొద్దు పోయింది. తిని పడుకుందువుగాని, ఎల్లుండి నించి మనం రిక్షా బాడుగలకు పోదాం’ అంటూ అతన్ని తట్టి లేపసాగారు. రమణయ్యలో ఎటువంటి ఉలుకు,పలుకు లేదు. ఎందుకో వారిలో  తెలియని భయం, నిస్తేజం ఆవహించింది. ‘రవణా, రవణా’ అంటూ  అతన్ని  కుదిపేస్తున్నారు. అంగడిలో నుంచి ఇదంతా చూస్తున్న మా కిష్టమామ గబగబా పక్క వీధిలోకి వెళ్లి మేము రూపాయి డాక్టర్‌ అని  పిలుచుకునే ఆర్‌.ఎం.పి. డాక్టర్‌ పుల్లయ్యను తీసుకువచ్చాడు.

అందరూ బెరుకు గుండెలతో దిగాలుగా రమణయ్యను చూస్తున్నారు. పుల్లయ్య డాక్టర్‌ రమణయ్యను పరీక్ష చేసి పెదవి విరిచాడు. రమణయ్య చనిపోయి అప్పటికే దాదాపు మూడు గంటలు గడిచాయట. అప్పుడే రోడ్డు దాటి పులిబొంగరాల పొట్లంతో వచ్చిన చెంచురామయ్య అక్కడి దృశ్యం చూశాడు. చేతిలో ఉన్న పొట్లం జారిపోయి పులిబొంగరాలన్నీ  నేల మీద పడి చెల్లా చెదురు  అయిపోయినాయి. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు చెంచురామయ్య. పొద్దున లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి  నిద్రపోయేవరకు తనతో కలసి మెలిసి ఉండే తాగుబోతు రమణయ్య ఇక లేడని తెలిసిన చెంచురాముడు కుప్పకూలి పోయాడు. పాడె  మీద శవం వేషం వేసిన తాగుబోతు రమణుడు ఆ పాడె మీదనే శవం అవుతాడని ఊహించని  వాళ్ళు అప్పుడు వేషం కోసం కాకుండా నిజంగానే తాగుబోతు రమణయ్య శవం మీద పడి ఎన్నవలు  పెట్టి ఏడ్చారు. ఏ పాడె మీద ఐతే అతన్ని ఊరు అంతా తిప్పారో అదే పాడె మీద ఉన్న అతని శవాన్ని  పూలతో కప్పేసి ఏడ్చుకుంటూ రిక్షా వాళ్ళు, అంగళ్ల వాళ్ళు అందరూ కలసి తప్పెటల మోతల నడుమ తాగుబోతు రమణయ్య  శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లారు.

ఇదంతా మా కళ్ళ ముందే జరిగింది. మా సెంటర్‌లో ఆ రోజు పెద్దవాళ్ళతో పాటు  మా పిల్లల మనసులు కూడా విషాదంతో నిండిపోయాయి. ప్రతి ఏడాది ఎన్నో సంతోషాలు నింపే దసరా పండుగ ఆ ఏడాది  మా తాగుబోతు రమణయ్య  మరణంతో మాకు విషాదాన్ని పంచింది. ఆ తర్వాత కాలంలో మా విజయమహల్‌ సెంటర్లో శవం వేషం వేసేవాళ్ళే లేరు. ఇక ఎప్పుడు దసరా పండుగ అన్నా మా నెల్లూరు విజయమహల్‌ సెంటర్లో ఉన్నవాళ్ళకి ఇప్పటికీ తాగుబోతు రమణయ్య శవం వేషం గుర్తుకు రాకమానదు.  కళ్ళు చెమ్మగిల్లక మానవు. 

– రోహిణి వంజరి, హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top