తెలివైన బోస్‌ 

Seen is ours tittle is  yours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

స్కూల్‌ అయిపోగానే సైకిలేస్కొని ఎక్కడా ఆగకుండా ఇంటికొచ్చేసి, రాగానే అమ్మ ముందు వాలిపోయాడు బోస్‌ – ‘‘అమ్మా! నేనొచ్చేశానూ’’ అంటూ. ‘‘వచ్చావు బాబూ! కానీ ఏం చేసొచ్చావు?’’ అనుమానంగా అడిగింది అమ్మ. ‘‘ఉహూ! నేనెవర్ణీ ఏం చెయ్యలేదమ్మా! సత్యరాజ్‌ని, పాపారావుని కూడా..’’ అమాయకంగా సమాధానమిచ్చాడు బోస్‌. ‘‘నీకు తెలివితేటలు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదేరా! అమ్మను ఎప్పటికీ మోసం చెయ్యలేవు.’’ బోస్‌ను దగ్గరికి తీస్కొని చెప్పింది అమ్మ. బోస్‌కు వయసైతే పెరిగింది కానీ, బుద్ధి చాలా చిన్న వయసులోనే ఆగిపోయింది. ఇంత వయసొచ్చినా అల్లరి చేస్తాడంటూ నాన్నతో సహా చుట్టుపక్కల వాళ్లంతా బోస్‌ను తిడుతూ ఉంటారు. బోస్‌కు ఫ్రెండ్‌ అయినా, గైడ్‌ అయినా అన్నీ అమ్మే. బోస్‌ తమ్ముడు చందు అకడమిక్స్‌లో టాప్‌ ఉంటాడు. నాన్నేమో దేశంలోనే పెద్ద సైంటిస్ట్‌లలో ఒకరు. ‘‘బోస్‌ను చదువు మాన్పించొచ్చు కదా! వాడి బుద్ధి ఎప్పటికీ పెరగదు.’’ అని నాన్న గొడవ పెడుతూ ఉన్నా, అమ్మ మాత్రం బోస్‌ను బడికి పంపించడం మానదు. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ వచ్చింది. బోస్‌ గురించి ప్రత్యేకంగా కలిసి మాట్లాడాలని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అమ్మను పిలిపించాడు. బోస్‌ను ఇంకా స్కూల్లో ఉంచడంలో అర్థం లేదన్నాడాయన. గతం, భవిష్యత్‌ల పట్టింపే లేకుండా వర్తమానంలో బతకడమే బోస్‌ జీవితమని, అతణ్ని స్కూల్లో వేయడమంటే బంధించడమన్నట్టే అని చెప్పాడు – ‘‘ఇంకా ఇక్కడే ఉండి తను చేసేదేమీ లేదు. తనని దాటిపోతున్న పిల్లల్ని చూసి బాధపడటం తప్ప. ఏవైనా చిన్న చిన్న బాధ్యతలు అప్పజెప్పండి. లేదా హాయిగా, అలా స్వేచ్ఛగా వదిలేయండి!’’.ప్రిన్సిపాల్‌ మాటలనే తల్చుకుంటూ బయట మైదానంలో తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్న బోస్‌ దగ్గరికొచ్చింది అమ్మ. అమ్మ చేతిలోని రిపోర్ట్‌ను లాక్కొని చూశాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. ‘‘నేను బాగానే చదివానమ్మా!’’ అన్నాడు.

అమ్మ బోస్‌ను దగ్గరకు తీసుకొని అతని తలనిమిరి ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బోస్‌ స్కూల్‌కి ఇంకెప్పుడూ వెళ్లలేదు. ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్‌ అందరూ స్కూల్‌కు వెళ్లిపోతున్నారని ఒక్కడే కూర్చుని ఏవేవో బొమ్మలు ముందేసుకొని వాటికి కబుర్లు చెబుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. బోస్‌ని ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌లో పెడదామని నాన్న ఆలోచన చేశాడు. ‘‘వాడ్ని పిచ్చాసుపత్రిలో పెడతారా?’’ అని అమ్మ గొడవ చేసింది. అందరూ పడుకున్నాక ఒక్కతే గార్డెన్‌లో ఏడుస్తూ కూర్చుంది. అమ్మను చూసి బోస్‌ ఆమె దగ్గరకొచ్చి, ‘‘అమ్మా!’’ అని పిలిచాడు. ‘‘బాబూ! నువ్వింకా పడుకోలేదా?’’ అని కళ్లు తుడుచుకుంది అమ్మ. అమ్మ ఒళ్లో పడుకున్నాడు బోస్‌. ‘‘నేను ఏదైనా పనిచేస్తానమ్మా! బాగా కష్టపడి పనిచేసి నాన్నంత పెద్ద సైంటిస్ట్‌ అవుతా’’ అన్నాడు. మళ్లీ బోసే – ‘‘చదువుకోకున్నా బాగా పనిచేస్తే సైంటిస్ట్‌ అవ్వొచ్చు కదమ్మా!’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏం కావాలంటే అది కావొచ్చు నాన్నా!’’ అని బోస్‌ నుదుటిపై ముద్దు పెట్టి దగ్గర తీసుకుంది అమ్మ. 

బోస్‌ ఉద్యోగంలో చేరాడు. తమ కాలనీలోనే ఉండే ఓ క్యాంటీన్‌లో ఫుడ్‌ డెలివరీ చేసే చిన్న ఉద్యోగం. బోస్‌ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.అక్కడే అతనికి ఒకమ్మాయి పరిచయమైంది. రజియా. పియానో టీచర్‌ ఆమె. ముందు ఆంటీ అని పిలిచాడు. తర్వాత టీచర్‌ అని పిలవడం మొదలుపెట్టాడు. ఉద్యోగం బోస్‌ను ఎప్పటికప్పుడు బిజీగా ఉంచేది. తాను జాయిన్‌ అయ్యాక ఆ క్యాంటీన్‌కు మరిన్ని లాభాలు కూడా తెచ్చిపెట్టాడు. ఎప్పుడైనా బోర్‌ కొట్టినట్టు ఫీలయితే ఒక్కడే ఆడుకునేవాడు బోస్‌. ఒకరోజు అలాగే ఒంటరిగా కూర్చుని ఉన్న అతని దగ్గరికొచ్చి, ‘‘ఫ్రెండ్‌! ఒక్కడివే ఆడుకుంటున్నావేం? ఎందుకు బ్యాడ్‌ మూడ్‌లోఉన్నావు?’’ అనడిగింది రజియా. అతనేం మాట్లాడలేదు. ‘‘హలో! ఎందుకు బ్యాడ్‌ మూడ్‌లో ఉన్నావు?’’ మళ్లీ అడిగింది.‘‘చందు తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తున్నాడు. నన్ను రావొద్దన్నాడు. నా క్లాస్మేట్స్‌ కూడా ఎవ్వరూ నాతో డిన్నర్‌కి రారు. పార్టీలకు రారు. వాళ్ల పేరెంట్స్‌తో వెళతారు.’’ ‘‘నన్ను కూడా ఎవ్వరూ డిన్నర్‌కి తీసుకెళ్లరు. పోనీ నన్ను డిన్నర్‌కి తీసుకెళ్లడానికి నీకు వీలవుతుందా?’’ సరిగ్గా బోస్‌ మాట్లాడినట్టే అమాయకంగా మాట్లాడుతూ అడిగింది రజియా.బోస్‌ ఉత్సాహంగా ఆమె వైపు చూశాడు. ఆ వెంటనే, ‘‘జోక్‌!’’ అన్నాడు.‘‘కాదు నిజం.’’ అని చెప్పి రజియా బోస్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లింది. ‘‘నువ్వే నా బాయ్‌ఫ్రెండ్‌వి.’’ అని చెప్పి డేట్‌కి కూడా తీసుకెళ్లింది. రోజులు గడుస్తున్నాయి. రజియా ఇప్పుడు బోస్‌కి బెస్ట్‌ఫ్రెండ్‌. ఆమెకు లెక్కలేనన్ని కబుర్లు చెబుతూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. టీచర్‌ అని పిలవడం దగ్గర్నుంచి ఫ్రెండ్‌ అనే మాటకు వచ్చేశాడు.

భవిష్యత్‌ భయాల్లేని బోస్‌ జీవితం ఒకరోజు ఎవ్వరూ ఊహించని మలుపు తీసుకుంది. అది స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుగుతున్న రోజు. బోస్‌ నాన్నతో పాటు ఆ కన్వెన్షన్‌ ఏరియాలో ఉండే సైంటిస్టులంతా హాజరయ్యారు. వైభవంగా జరుగుతున్న వేడుక వద్దకు పోలీసులు వచ్చి అప్పుడే ఎగరేసిన జెండాలో పెద్ద బాంబు ఉందని చెప్పారు. దగ్గర్లో ఉన్న 150 గజాల్లో ఉన్న ఏ ఒక్క బిల్డింగూ మిగలదు. ఆ బిల్డింగ్‌ లోపల గొప్ప సైంటిస్టులు ఉన్నారు. వాళ్లంతా కళ్లముందు చనిపోతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. ఇరవై కేజీల జెండాను ఎవరైనా కొద్దిదూరం మోసుకెళితే సైంటిస్టులను కాపాడుకోవచ్చు. ‘‘సైంటిస్టులను చంపడానికి ఇది పాకిస్తాన్‌ చేసిన కుట్ర. ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే తప్ప వాళ్లు మనకు మిగలరు.’’ రీసెర్చ్‌సెంటర్‌ పెద్దాయన అందరికీ ఈ మాట చెప్పి ఎవరైనా ముందుకొస్తారేమోనని చూశాడు. ఎవ్వరూ రాలేదు. అక్కడున్న చాలామందికి బోస్‌ ఒక్కడే ఈ పని చేయదగ్గ వాడని అనిపించింది. అతని జీవితం ఇక్కడితోనే ఆగిపోయినా ఫర్వాలేదనుకున్నారంతా. అమ్మను ఒప్పించారు. బోస్‌కి బాంబువిషయం చెప్పకుండా జెండా మోసుకు వెళ్లమని మాత్రం చెప్పారు. ‘‘అమ్మా! చాలా నొప్పిగా ఉంటుందా అమ్మా’’ అనడిగాడు బోస్‌.‘‘అమ్మ కోసం ఈ పని చెయ్యి..’’ అంది అమ్మ. బోస్‌ జనగణమన పాడుతూ జెండాని ఎత్తుకొని పెద్దాయన చెప్పినంత దూరం పరిగెత్తాడు. ఆ తర్వాత బోస్‌ ఎవ్వరికీ కనిపించలేదు. బోస్‌ చేసిన గొప్పలు చెబుతూ అతని పేరుమీద ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఎవ్వరూ చేయలేని సాహసం బోస్‌ చేశాడని కొనియాడారందరూ.కానీ ఆ రోజు అక్కడున్న వారెవ్వరికీ తాను చనిపోతాడని తెలిసినా బోస్‌ ఈ సాహసం చేశాడని తెలియదు, రజియా చెప్పేవరకూ.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top