శివోహం..శివోహం

Adi Shankaracharya Life Story Written By Neeti Suryanarayana Sharma 03/11/2019 - Sakshi

వైశాఖ శుద్ధ షష్ఠి ఘడియలు ప్రవేశించాయి. పదహారేళ్లు నిండి శంకరుడు పదిహేడులో అడుగు పెట్టాడు. అది కలియుగాది 2609కి (క్రీ.పూ. 492) సరియైన శ్రీకీలక నామ సంవత్సరం. అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. శంకరుడు గంగాస్నానంలో ఉన్నాడు. తల్లి మనసులా సరళంగా సాగిపోతున్న గంగలో మునకలేస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలేవో చుట్టుముడుతున్నాయి. ‘నీ కొడుకు ఆయుష్షు నిజానికి పదహారేళ్లే. కానీ...’ అన్న మాట దగ్గర ఆనాడు అగస్త్య మహర్షి భవిష్యవాణి ఆగిపోయింది. అదివిన్న పిచ్చితల్లి ఎంతగా తల్లడిల్లిపోయిందో కదా. గర్భశోకాన్ని అనుభవించలేకనే కాబోలు... తన ఆయుష్షు కూడా బిడ్డకు పోసి ముందుగా వెళ్లిపోయింది. వ్యాస భగవానుడు స్వయాన వచ్చి వరమిచ్చి దీవించాడు. మహాభారతంలోని సనత్సు జాతీయానికి కూడా భాష్యం రచించమని చెప్పి అంతర్థానమయ్యాడు. అజాగ్రత్తయే మృత్యువు. నిజానికి మృత్యువు అనేది లేనే లేదు.. అని బ్రహ్మమానస పుత్రుడైన సనత్సుజాతుడు ఇచ్చిన మహత్తర సందేశమది. దాన్ని అద్వైతానికి అన్వయించాడు శంకరుడు. నేటితో రచన పూర్తయింది. శంకరుడింకా గంగ నుంచి లేచి బయటకు రాకముందే అతడికో లేఖ వచ్చింది. ప్రతిష్ఠాన పురం నుంచి ప్రభాకరుడు పంపించాడు... ‘మా గురువుగారైన భట్టపాదులు త్వరలో ప్రయాగ సమీపంలోని రుద్రపురానికి విజయం చేయబోతున్నారు. తమరు వారిని కలుసుకోవాలనుకుంటే వెనువెంటనే బయలుదేరగలరు’ అన్నది సందేశ సారాంశం. హుటాహుటిన బయలుదేరాడు శంకరుడు. వారణాసి నుంచి పాతిక యోజనాల దూరంలో ఉన్న రుద్రపురానికి మరి కాసేపటిలో చేరుకోబోతున్నాడు.

రుద్రపురంలో ఆనాడు... కుమారిల భట్టు తన ప్రాయోపవేశానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఒక హోమగుండాన్ని తవ్వించుకున్నాడు. శ్రోత్రియులందరూ హోమంలోని అగ్ని చల్లారకుండా ఉండేందుకు ఉపయోగించే ధాన్యపు పొట్టును పెద్దమొత్తంలో సేకరించాడు. అగ్నిహోత్రంతో సహా హోమగుండంలోకి వెళ్లి కూర్చున్నాడు. విరజాహోమ మంత్రాలు పఠిస్తున్నాడు. శిష్యులు ఊక నింపుతున్నారు. భట్టపాదుడు గొంతు వరకూ కప్పబడ్డాడు. కొద్దిసేపటిలోనే పొగ చెలరేగింది. అగ్నిహోత్రం తన సహజ ప్రభావాన్ని చూపుతోంది. ఊక మధ్యలో ఆ మహానుభావుని చర్మం కనలిపోతోంది. వేడిమి క్షణక్షణానికి తీవ్రమవుతోంది. ఇంతలో శంకరుడు పొలిమేరలో అడుగుపెట్టాడు. అప్పటిదాకా విజృంభించిన నిప్పు కాస్తా చల్లగా చందనసేవలా మారిపోయింది. శంకరుని రాకను భట్టపాదుడు గుర్తించాడు. మహాపండితుడైనా వేద ప్రామాణ్యాన్ని నిరూపించడానికి సరైన శాసనం చేయని కారణంగా కుడికన్ను పోగొట్టుకున్న వాడాయన. మిగిలినవున్న ఎడమ కన్నెత్తి శంకరుణ్ణి తేరిపార చూడడానికి పాపం సంకోచించాడు.

‘‘భట్టపాదా!’’ ఆదుర్దాగా పిలిచాడు శంకరుడు. ఆ పిలుపుతో భట్టపాదుడు కన్ను తెరిచాడు. ‘‘తండ్రీ! మీకు చేయెత్తి నమస్కరించలేని అసహాయ స్థితిలో ఉన్నాను. మన్నించండి’’ అన్నాడు. ‘‘ఏమిటీ పని? ఎందుకు చేస్తున్నట్లు?! మీ వంటివారిలా ప్రాయోపవేశంతో బలవన్మరణానికి పూనుకోవడం సమంజసమేనా? దయచేసి బయటకు రండి’’ అన్నాడు శంకరుడు. ‘‘తండ్రీ! మీ దయవల్ల నాకు హిమగిరి శిఖరంపై ఉన్న అనుభూతి కలుగుతోంది. బయటికి వస్తే అగ్నితప్తమైన నా దేహాన్ని చిటికెలో బాగు చేయగలరని తెలుసు. కానీ నేనందుకు ఒప్పుకోలేను. ఈ జీవితం ఇలా అంతమైపోవాల్సిందే. ఇది నాకుగా నేను విధించుకున్న ప్రాయశ్చిత్తం’’ అని సమాధానమిచ్చాడు భట్టపాదుడు. ‘‘ప్రాయశ్చిత్తమా ఎందుకు?’’ ‘‘గురుద్రోహం చేసిన నేరానికి. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి నాస్తిక గురువుల వద్ద శిష్యరికం చేశాను. ఆ నిషిద్ధ గురువులను ఆశ్రయించకూడదని తెలిసినా ఆశ్రయించాను. వారి సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని వారిపైనే తిరుగుబాటు చేశాను. బోధించిన అంశమేదైనా వారు గురువులు. వారిపట్ల కృతఘ్నత చూపడం నేను చేసిన ఘాతుకం. అందుకు ఇదే సరైన శిక్ష.’’ ‘‘అలా అనవద్దు. ధర్మరక్షణ కోసం నడుం కట్టి, మీరు చూపిన సాహస పరాక్రమాలు అనుపమానం. మిమ్మల్ని ఏ పాపమూ అంటదు.

కర్మబలం చేత మీరు ఎప్పటికైనా ఉన్నతినే సాధిస్తారు కానీ, ఎన్నటికీ పతనం చెందరు. ఈ ప్రయత్నం విరమించండి.’’ ‘‘అంటే యజ్ఞయాగాలు స్వతంత్రంగా కర్మఫలాన్ని అనుగ్రహిస్తాయని మీరు ఒప్పుకోబోతున్నారా? వద్దు స్వామీ! కర్మభ్రష్టులై, ధర్మదూరులై చరించే మానవులకు... యజ్ఞప్రభావం అప్రమేయమని చెప్పడానికే జైమిని మహర్షి పూర్వమీమాంసను రచించారు. కామ్యకర్మలతో అయినా సరే పరమాత్మతో ప్రమేయం కలిగించుకుని నిర్గుణోపాసన వైపుకు మళ్లాలన్నదే మా ఆశయం. చిట్టచివరి మెట్టుమీద మీరు ఉన్నారు. మొదటి మెట్టు నుంచి జీవుణ్ణి పైకి చేర్చే ఉపాయం మేము బోధిస్తున్నాం. సర్వత్ర మీ స్థానమే ఉన్నతం. నిజం చెప్పాలంటే మీ భాష్యాలను చూసింది మొదలు వాటికి వార్తికాలు రచించాలని ఎంతగానో తపన పడ్డాను. కానీ విధి నన్ను మరోవైపుకు నడిపిస్తోంది’’ ఆవేదనగా చెప్పాడు భట్టపాదుడు.
శంకరునితో పాటు అక్కడున్న వారందరి కన్నులూ చెమర్చాయి.

‘‘కనీసం నా భాష్యాలకు వివరణాత్మకమైన వార్తికాలు రచించేందుకైనా ఈ ప్రాయోపవేశాన్ని విరమించండి’’ అడిగాడు చివరిగా శంకరుడు. భట్టపాదుడు సుతరామూ అంగీకరించలేదు. ‘‘తండ్రీ! ఈ మందభాగ్యుణ్ణి మన్నించండి. కానీ ఈ అవకాశం నా శిష్యునికి ఇప్పించండి. పూర్వమీమాంసలో నా తరువాత అంతటివాడతను. సృష్టికర్త బ్రహ్మ ఏరికోరి అతని అవతారంలో దిగివచ్చాడని అనిపిస్తుంది. అతడి భార్య సాక్షాత్తూ శారదాంబయే కనుక అది నిజమే అని దృఢపరుచుకున్నాం కూడా. అతడు మీ భాష్యాలకు వార్తికాలు రచిస్తాడు. కానీ, పూర్వమీమాంసలో అతడు గట్టి నమ్మకం ఉన్నవాడు. ఒకపట్టాన మీ జ్ఞానమార్గాన్ని అంగీకరించడు. మీరు చాలానే శ్రమపడవలసి రావచ్చు. అయినా మంచిదే... అటువంటివారు ఇప్పటి మానవులలో దొరకడం దుర్లభం అని మాత్రం చెప్పగలను. దయచేసి మీరు మాహిష్మతీ నగరానికి వెళ్లండి. మండన మిశ్రుణ్ణి కలుసుకోండి’’ అని సలహా ఇచ్చాడు భట్టపాదుడు.

శంకరుడు సాలోచనగా తల పంకించాడు. సరేనని చెప్పడానికి సంకోచిస్తున్నాడు. మౌనాన్ని ఆశ్రయించాడు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ‘‘తండ్రీ! నాకు అనుమతినివ్వండి. మీ కరుణను దయచేసి ఉపసంహరించండి. ఈ అగ్నిహోత్రాన్ని తన పని తాను చేసుకోనివ్వండి. నాకు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించండి. ఈ అంతిమ ఘడియల్లో మీ ఉపదేశంతో నాకు సద్గతిని ప్రసాదించండి’’ అని వేడుకున్నాడు భట్టపాదుడు. శంకరుడు అతడి కోరిక మన్నించాడు. నిర్వాణషట్కాన్ని ప్రారంభించాడు. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుర్వా్వ్యప్య సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః చిదానందరూపః శివోహం శివోహం – సత్యదర్శనంతో ద్వైధీభావాన్ని విడిచిపెట్టాను. కనుక నాలో వికల్పాలన్నీ మాయమయ్యాయి. నేను అనగా ఆత్మను... సర్వవ్యాపిని కనుక నాకో ఆకారమంటూ లేదు. సమస్తాన్నీ సమదృష్టితో చూసే నన్ను కట్టి ఉంచేది ఏదీ లేదు. ఏ బంధాలకూ లొంగను కనుక నాకు బంధమోక్షాలు లేవు. జ్ఞానమనే ఆనందమే రూపమైన శుభంకరుణ్ణి... శివుడినే నేను – అని మొదటిశ్లోకం చెప్పాడు. భట్టపాదుడు కన్ను మూసుకున్నాడు. అగ్నిహోత్రుడు తన పని ప్రారంభించాడు.

రెండోశ్లోకం ఇలా వచ్చింది.... నాకు మృత్యువు లేదు. మరణం నన్ను నశింప చేస్తుందనే భయమూ లేదు. జాతిభేదాలు లేని సార్వజనీనుణ్ణి నేను. ఈ జన్మకు రాకముందు నుంచి ఉన్నాను, ఇకముందు కూడా ఉంటాను. కనుక నన్ను పుట్టిస్తున్నది ఎవరో కాదు, నేనే. నాకు బోధించే గురువులు, అనుసరించే శిష్యులు, అంటిపెట్టుకుని బంధుమిత్రులంటూ ఏ బాదరబందీ లేదు. నేను జ్ఞానమే రూపమైన వాడిని. శివుణ్ణి.... భట్టపాదుని ఇహలోక బంధాలు సడలిపోతున్నాయి. నిర్వాణషట్కం ఆత్మావిష్కారం చేస్తూ ముందుకు సాగింది. పుణ్యపాపాల హెచ్చుతగ్గులతో నాకు ప్రమేయం లేదు. వాటివల్ల కలిగే సద్గతులు, పతనావస్థలు నాకు పట్టవు. సుఖదుఃఖాలకు అతీతంగా సంచరించే నన్ను అనిత్య వస్తువులు ఎల్లకాలమూ సుఖపెట్టనూ లేవు, దుఃఖాన్ని కలిగించనూ లేవు. నేనెవరో తెలిపే సిసలైన మంత్రం కనిపించదు. ఏ తీర్థంలో వెతికినా దొరకదు. వేదాలు, యజ్ఞాలు నా స్వరూపాన్ని వివిధ రీతుల్లో వివరించి చెబుతాయి.

కానీ నన్ను తెలుసుకోవాలంటే ఎవరికి వారే ఉద్యమించాలి. ఎందుకంటే నేను కర్మఫలాన్ని కాను. కర్మరూపాన్ని కాను. కర్మ చేస్తున్న వాణ్ణి కాను. నేను జ్ఞానానంద శివుణ్ణి.... భట్టపాదునిలో కలిగిన సంచలనం కైలాసాచలం వరకూ పరివ్యాప్తమయింది. తదుపరి శ్లోకాన్ని శంకరుని కంఠం ఇలా వెలువరించింది... ఒకరిపై ద్వేషం లేదు. వేరొకరిపై అనురాగమూ లేదు. అనిత్య వస్తువులు నాకే చెందాలనే లోభమూ, వాటిని విడిచిపెట్టి ఉండలేని మోహమూ లేవు. నేను అందరికంటే గొప్పవాడిననే మదమూ, ఇతరులతో మాత్సర్యమూ లేవు. దేహాన్ని ధరించి దేహినయ్యాను కనుకనే కానీ, నాకు పురుషార్థాల సాధన కోసం పాటుపడే పని లేదు. దేహంలో ఉన్నంతవరకూ ఈ ఉపాధిని నిలబెట్టుకోవడమే ధర్మం. దీనిని అనుసరించి వచ్చే కర్మలను పాటించడమే అర్థం. ఇది చిట్టచివరి దాకా కొనసాగించడమే నాకు కామం. అయినా దేహంతో నాకెలాంటి సంబంధమూ లేదు కనుక, దీనినుంచి మోక్షం నేను కోరుకోను.....మహావిహంగం ఒకటి తన విస్తారమైన రెక్కలను అత్యంతమూ వేగంగా కదుపుతూ భూమిపైకి దూసుకువస్తున్నట్లుంది. కుమారిలభట్టు నిలబడివున్న తుషాగ్ని నుంచి నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయి.

శిష్యులు మరింత ఊకను దానిపై పోశారు. భట్టపాదుడు పూర్తిగా కప్పబడి పోయాడు. శంకరుడు కొనసాగించాడు. ‘నేను ప్రాణాన్ని కాదు. త్రేనుపు, రెప్పపాటు, తుమ్ము, హృదయస్పందన, ఆవులింతలనే ప్రాణ సంకేతాలేవీ నేను కాదు. సూక్ష్మగతిలో సంచరించే ప్రాణవాయువు, అధోముఖంగా పయనించే అపానం, ఉష్ణోగ్రతలను సరిచేసే సమానం, గుటక వేయనిచ్చే ఉదానం, అంతటా నిండివుండే వ్యానవాయువులనే పంచప్రాణాలు నన్ను నియంత్రించలేవు. సప్తధాతువుల్లో ఏ ఒక్కటీ నన్ను పోషించడం లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశాలలో సంచారం చేస్తున్నది కర్మానుభవం పొందుతున్న దేహియే కానీ నేను కాదు. వాక్కు, కాళ్లు, చేతులు, పాయువు, ఉపస్థలనే ఇంద్రియాలు నిర్వహించే కర్మలతో నాకు ప్రమేయం లేదు’ అన్నాడు. ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్ని కుండం నుంచి పెద్దపెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే  న చ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం

సంకల్ప వికల్పాలకు కారణమయ్యే మనస్సు నా చలనాన్ని అరికట్టలేదు. జ్ఞాపకాల ప్రోగు అయిన బుద్ధి నన్ను గుర్తించలేదు. కర్తృత్వాన్ని తనకు ఆపాదించుకునే అహం స్ఫురణకు నిజానికి నేనెవరో స్ఫురించదు. కంటితో చూసిన ప్రతిదాన్ని దృశ్యబద్ధం చేసి మనస్సుకు చేరవేసే చిత్తం నా రూపాన్ని ముమ్మాటికీ చిత్రించలేదు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే ఈ నాలుగు అడ్డుగోడలను దాటుకుని నన్ను వినాలంటే చెవులు, వర్ణించాలంటే నాలుక, పసిగట్టడానికి ముక్కు, చూడటానికి కన్నులూ చాలవు. నేను ఆకాశంలో ఉండను. వట్టి మట్టిని కాను. హోమాగ్నియందు జనించేది నేను కాదు. ఉందని తెలుసు కానీ ఎక్కడుందో, ఎలాగుందో తెలుపడానికి వీలులేని వాయువులాంటి వాణ్ణి కాను.

నేను జ్ఞానరూపాన్ని ధరించిన శివుణ్ణి... అని ముగించాడు శంకరుడు. పొగమబ్బు ఆకాశమంతా దట్టంగా పట్టేసింది. చూస్తుండగానే అది నెమలిపింఛపు ఆకారాన్ని ధరించింది. కుమారిల భట్టుగా నేలపై సంచరించిన సుబ్రహ్మణ్య తత్త్వానికి నమస్కరించాడు శంకరుడు. శిష్యులతో కలిసి అక్కడి నుంచి కదిలాడు. మాహిష్మతి దిశగా అడుగులు వేస్తున్నాడు. దారిమధ్యలో వీలుచూసుకుని, ‘‘ఆచార్యదేవా! ఏమిటీ స్తోత్రం? ఇంత అసంబద్ధంగా ఉంది?!’’ అడిగాడు విష్ణుశర్మ. అందరూ అతనికేసి వింతగా చూశారు. (సశేషం) ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్ని కుండం నుంచి పెద్దపెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది.
ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర
నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top