‘తోక’ మాధ్యమాలకు అసాంజే పాఠం

ABK Prasad Article On Julian Assange - Sakshi

రెండో మాట

‘వికీలీక్స్‌’ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకి జరిగిన అవమానం ప్రపంచ పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న ఎవరికైనా జరగవచ్చు. నిరసన గళం విప్పకపోతే సమాజాన్ని నీరసం ఆవహించి నిలువెల్లా నిస్తేజ పరుస్తుంది. పత్రికలు, చానళ్ల నిర్వహణపై పెత్తనం కోసం జరుపుతున్న పెనుగులాటలో వృత్తి ధర్మాన్ని విడిచి, వీలును వాలునూ చూసుకుని అధికార రాజకీయ పక్షానికి కొమ్ముకాస్తూ ప్రజా స్పందనను, ప్రజల విశాల ప్రయోజనాలను పక్కకు నెట్టేస్తూ యాజమాన్యాలను సొంతం చేసుకోడానికో, వాటాలు చీల్చడానికో, వాటంగా అవకాశంగా చూసుకుని కొనేయడానికో సిద్ధమై దొరికిపోతున్న ఉంపుడు మాధ్యమాల అధిపతులకు అసాంజే  ఉదంతం పాఠం కావాలి.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఈ నెల మూడవ తేదీన మరోసారి దర్శనమిచ్చి వెళ్లి పోయింది. అది గడిచిపోయి పట్టుమని పది హేను రోజులు కూడా కాలేదు. అయినా ఈ స్వేచ్ఛా దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవలసిన మనం పాత్రికేయ వృత్తిలో, నిర్వహణలో పాటించవలసిన సూత్రవాఙ్మయానికి ఎన్ని వేల కిలోమీటర్ల  దూరంలో ఉన్నామో, మనలో కొందరు ఎందుకు వృత్తి ధర్మ విచక్షణలో పతన దశలకు చేరుకుంటున్నామో సమీక్షించుకోవలసిన సమయం వచ్చింది. మన పెద్దలు  అంటూంటారు. ‘అనృతం (అబద్ధం) అందచందాల అత్తి పండులాంటి’దని! అంటే అత్తిపండు చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ  పగలగొట్టి చూస్తే అన్నీ  పురుగులేనని! పాత్రికేయ వృత్తిని కోరి చేరినవారు ఆ సామెతకు దూరంగా జరిగి పోవాలి గానీ అత్తిపండుకు అతుక్కుపోకూడదు. అందుకే మానవుడి జీవితం  ముగిసేదాకా ఎవరినీ తెగడకపోయినా పొగడ్తలతో ముంచెత్తకూడదని అంటారు.

దశలవారీగా ఎదిగి రావలసిన మానవుణ్ణి అందుకే మంచిచెడుల పూర్ణ కుంభంగా  అనుభవజ్ఞులు వర్ణించాల్సి వచ్చింది. కనుకనే అతని మాటను చేతను బేరీజు వేయడంలో ఇదే ఆఖరిమాట అని చెప్పడానికి వీలుండదు. కని పించే జర్నలిస్టుకన్నా  అతనిలో కనిపించని జర్నలిస్టు కూడా ఒకడుంటా డని, అతను దుష్టుడో శిష్టుడో ఏదీకాని వశిష్టుడో చేష్టల్ని బట్టి బయట పడేదాకా మనం చెప్పలేం. నేడు పైకి బాగా  ఉన్నట్లు కనిపించే వాడు రేపు చెడిపోవచ్చు, చెడినవాడు తప్పులు దిద్దుకుని తిరిగి బాగుపడనూ వచ్చు. ఈ అన్ని దశలనూ పాత్రికేయులు సహా అందరూ గడిచి  రావలి సిందే, ఎవరు ఏ పదవులు వెలగబెడుతున్నా ఆయా వ్యక్తుల అధికారాం తంలో గానీ లేదా వయస్సు ముదిమికి చేరి మరణశయ్యపైకి చేరిన తర్వాతనే వారి  గుణగుణాల లెక్కలు తేల్చడం సాధ్యమవుతుంది.

ఇందుకు శతాబ్దిన్నర క్రితం సుప్రసిద్ధ సివిల్‌ సర్వెంటుగానే కాకుండా తెలుగు భాషకు మహోద్దండ సేవలందించి, నిఘంటువుల్ని,  శాసనాలను పరిశోధించి తెలుగు వారికి సేవలందించిన సర్‌ బ్రౌన్‌ మహాశయుడు వ్యక్తుల్ని అంచనా వేయడంలో గొప్పవాడని చూడకుండా ఒక అంచనా వేశాడు. గొప్పవాడు చనిపోయినప్పుడు చచ్చిన వాడి కళ్లు చారెడేసి, అని పొగడ్తలు కురిపించకుండా ఇప్పటిలాగా ‘అంతవాడు ఇంత గొప్పవాడు’ అని కీర్తించకుండా ఆ వ్యక్తి  నిజజీవితంలో పరమ దుర్మార్గుడు, అబద్ధాల కోరు అని తన పత్రికలో ‘స్మృత్యంజలి’ స్థానంలో కుండబద్దలు కొట్టినట్లు రాసేశాడని మిత్రుడు బంగోరె తాను పరిశో ధించి సంకలనం చేసిన బ్రౌన్‌ లేఖల సందర్భంగా పేర్కొన్నాడు.

అందుకే స్వాతంత్య్రానంతర భారతంలో మానికొండ చలపతిరావు ప్రభృతుల క్రియాశీల ప్రతిపాదనలు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పత్రికా నిర్వహణకు సంబంధించిన కొన్ని ఆదర్శ సూత్రాల రూపకల్పన కోసం రెండు ప్రెస్‌ కమిషన్‌లను  నియమిం చింది. ఈ కమిషన్‌లు ఆరోగ్యకరమైన పత్రికా నిర్వహణ సూత్రాలను రూపొందిస్తూ పెట్టుబడి వ్యవస్థ అనుమతించిన యాజమాన్యాలు నిర్వహించే పత్రిక నిర్వహణను, ఆయా యాజమాన్యాల కార్పొరేట్‌ ప్రయోజనాల నుంచి విడివడి  పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా హామీ పడాలని సూచించాయి. కానీ ఆచరణలో కార్పొరేట్‌ సంస్థలో భాగంగా ఉండే పత్రికల నిర్వహణను మధ్యమధ్యలో విమర్శించడంతోనే కమి షన్‌లు తృప్తిపడి  ఊరుకున్నాయి.

ఫలితంగా ఇప్పుడు టీవీ చానళ్లు కూడా కార్పొరేట్‌ యాజమాన్యాల ప్రయోజనాలను కాపాడవలసి రావడం వల్ల వాటిల్లో పనిచేసే పాత్రి కేయులు  కొందరు చొరవతో సొంత లాభం తామూ కొంత చూసుకుని జాంబవంతుడి అంగలు పంగలతో కార్పొరేట్‌ రంగంలో ఉంటూనే పత్రి కలు, చానళ్ల నిర్వహణపై పెత్తనం  కోసం జరుపుతున్న పెనుగులాటలో వృత్తి ధర్మాన్ని విడిచి, వీలును వాలునూ చూసుకుని అధికార రాజకీయ పక్షానికి కొమ్ముకాస్తూ, యాజమాన్యాలను సొంతం చేసుకోడానికో, వాటాలు చీల్చడానికో, వాటంగా అవకాశంగా చూసుకుని కొనేయడా నికో సిద్ధమై దొరికిపోతున్నారు. ఇందుకోసం వృత్తి ధర్మాల్ని పక్కకు తోసేసి,  కార్పొరేట్‌ యాజమాన్యం కోసం అర్రులు చాచి, కేసులలో ఇరు క్కుంటున్నారు, పాత్రికేయ వృత్తినన్నా మానుకుంటున్నారుగానీ యాజ మాన్యం పెత్తనంలోకి రావాలన్న ‘రంధి’ని మానుకోలేక రకరకాల మోసాలకు పూనుకుంటూ, తద్వారా అరెస్టుల భయంతో ఆయా పంచ లలో తలదాచుకుంటున్నారు. పరువుపోయినా పదవినీ, తద్వారా కార్పొ రేట్‌ యాజమాన్యాన్నీ చేజిక్కించుకొనే తాపత్రయంలో పడిపోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే మంచి పాత్రికేయుడుగా ఉద్యోగం ప్రారం భించిన రవిప్రకాశ్‌ పతన దశకు చేరి కార్పొరేట్‌ సాలెగూడులో కూరు కుపోవలసి వచ్చింది.

అలాగే ‘లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌’ అనే ప్రసిద్ధ సంస్థలు తాజా ఎన్నికల సందర్భంగా వివిధ దశల్లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సాధికార సర్వేక్షణల్లో టీడీపీ ఓటమిని, వైఎస్సార్‌సీపీ ఘన విజయాన్ని సూచిస్తూ సర్వే ఫలితాలు ప్రకటించాయి. కానీ ఆ సర్వే సంస్థలు ప్రకటించిన ఫలి తాల్ని ఒక స్థానిక ‘ఉంపుడు’ పత్రిక తారుమారు చేసి ఉల్టాగా చూపినం దుకు సర్వే సంస్థలు నేరంగా భావించి ఆలిండియాలో ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాయి. దానిపై ప్రెస్‌కౌన్సిల్‌ స్పందించి ఆ పత్రికకు నోటీసు జారీ చేసింది. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఇండియన్‌ ప్రెస్‌ కమిషన్స్‌ తాకీ దులను, ప్రతిపాదనలను లెక్క చేయనందుననే, ఆ తృణీకార భావంపై కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవటంలో విఫలం కావటంవల్లనే కొన్ని యాజమాన్యాలు కొందరు పాత్రికేయులూ అదుపు తప్పి విచ్చలవిడిత నంతో వ్యవహరిస్తున్నారన్నది పాఠకుల అనుభవం.

ఈ సందర్భంగా ప్రపంచ పాత్రికేయ, వార్తల పరిశోధనా రంగానికే తలమానికంగా నిలిచి ఏళ్ల తరబడి నిర్బంధాలకు గురవుతూ వచ్చిన ‘వికీలీక్స్‌’ అధిపతి, అసాంజేపై అమెరికా సామ్రాజ్యవాద పాలకులు ఎందుకు విషం కక్కుతున్నారో, అతన్ని ఎందుకు పట్టి పల్లార్చాలని ఉవ్విళ్లూరుతున్నారో ప్రపంచ పాత్రికేయులకు తెలియనిది కాదు. ఈ సందర్భంగా ప్రసిద్ధ అమెరికన్‌ పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సంపాదక సిబ్బంది మాజీ అధిపతి జాన్‌ స్వింటన్‌ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినో త్సవం (మే 3) సందర్భంగా ఫ్రీప్రెస్‌కు విందు ఇస్తూ నేటి పాత్రి కేయ ప్రమాణాలపైన, కొందరు పాత్రికేయుల ప్రవర్తనపైన చరిచిన చరు పులు మన పాత్రికేయులందరికీ గుణపాఠం కావాలి.

స్వింటన్‌ మాటల్లోనే: ‘‘అమెరికాలో ఉన్నవి స్వతంత్రంగా వ్యవ హరించగల పత్రికలంటూ నేడు లేవు. అది మీకూ తెలుసు, నాకూ తెలుసు. మీ నిజమైన ఆంతరంగిక అభిప్రాయాలను కాగితంపై పెట్టగల సాహసమున్న పాత్రికేయులు మీలో ఒక్కరూ లేరు. అధవా మీ సొంత అభిప్రాయాలన్ని తెల్పగలిగే పక్షంలో అవి అచ్చులో చస్తే కనపడే అవ కాశం లేదని మీకూ తెలుసు. నేను పనిచేస్తున్న పత్రికలో నిజాయితీగా నేను రాసే అభిప్రాయాలు ప్రకటించకుండా ఉండేందుకే నాకు జీతం ఇస్తున్నారు. ఇలా అభిప్రాయాల్ని వెల్లడించకుండా ఉండేందుకే మీకూ అలాగే జీతాలు ఇస్తున్నారు. ఒకవేళ తెగించి మీ భావాల్ని స్వతంత్రంగా పత్రికలో వ్యక్తం చేశారే అనుకోండి, అంతే.. వీధుల్లోకి పోయి మరో ఉద్యోగం వెతుక్కోవలసిందే. ఒకవేళ పొరపాటున నేను పనిచేసే పత్రి కలో కనీసం ఒక సంచికలో నా అభిప్రాయాలు వెళ్లబుచ్చానంటే నా ఉద్యోగం 24 గంటల్లోగా ఊడి పోవలసిందే. సర్వ సాధారణంగా పత్రికా సంస్థలలో పనిచేసే పాత్రికేయుల వ్యాపారమల్లా– నిజాన్ని నాశనం చేయడం, పచ్చి అబద్ధాలకు ఒడిగట్టడం, అభిప్రాయాల్ని పక్కతోవలు పట్టించటం, నిందలు వేయటం, డబ్బుకు దాసోహమనటం, తన రోజు వారీ రొట్టె కోసం దేశాన్నీ, జాతినీ అమ్మకానికి పెట్టడం. ఈ బాగోతం నీకూ తెలుసు, నాకూ తెలుసు. ఈ మాత్రానికి ‘స్వతంత్ర’ పత్రిక పేరిట ఈ విందు కుడుపులు దేనికట? ఈ తెర వెనక నాటకమాడే సంపన్నుల చేతిలో పాత్రికేయులం పనిముట్లుగా, దాసులుగా, కీలుబొమ్మలుగా మారుతున్నాం.

తాడు లాగితే చాలు తోలుబొమ్మలయిపోతున్నాం. మన ప్రతిభా పాటవాలు, మనముందున్న అవకాశాలు, ఆఖరికి మన జీవి తాలే ఇతరులకు ఆస్తిపాస్తులుగా మారుతున్నాయి. ఒక్కముక్కలో చెప్పా లంటే– మనం మేధో జీవులైన భ్రష్టాచారులం’’ అన్నాడు స్వింటన్‌. ప్రసిద్ధ పత్రికా వ్యాఖ్యాత జాన్‌ పిల్జర్‌ అన్నట్టుగా ‘వికీలీక్స్‌’ వ్యవ స్థాపకుడు, సంపాదకుడైన జూలియన్‌ అసాంజేకి జరిగిన అవమానం, దుర్మార్గం ప్రపంచ పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న ఎవరికైనా– వార్తా పత్రికలు, టీవీ, స్టుడియోలలో, రేడియోలలో, ఇతర మాధ్య మాలను నడుపుకుంటున్న వారికెవరికైనా జరగవచ్చు. నిరసన గళం విప్పకపోతే సమాజాన్ని నీరసం ఆవహించి నిలువెల్లా నిస్తేజపరుస్తుంది. తగిన సమయంలో ప్రజలు, పాఠకులూ ముఖ్యంగా మేధావులు, జ్ఞాన సంప న్నులు జరుగుతున్న అన్యాయాలపట్ల, అక్రమాలపట్ల నోరు మెదప కుండా, నాయకుల్ని, అడ్డదారుల్లో ఉన్న వార్తా మాధ్యమాలను ఎదురు ప్రశ్నించి ప్రజల ముందు నిలబెట్టకపోతే, అణిగిమణిగి ఉండిపోతే– ఆ అలుసు వల్ల ఈ పెట్టుబడి దోపిడీ వ్యవస్థలో ఏ విషయ పరిణామమైనా సంభవించవచ్చు. అందుకే అసాంజే తన పాంచజన్యాన్ని ఇలా పూరిం చాడు: ‘‘ఇంతకు మినహా మరో మార్గం లేదు. అది తేలికైన మార్గం– ప్రతిఘటన వెనుక కారణాల్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది, వారికి ప్రశ్నించే హక్కు ఉంది, అధికారాన్ని సవాలు చేసే హక్కుంది. ఇదే సుమా అసలు, సిసలు ప్రజాస్వామ్యం అంటే!’’.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top