‘పునాది’పై నిర్లక్ష్యమా?!

‘పునాది’పై నిర్లక్ష్యమా?! - Sakshi


పాలకుల కబుర్లకేం గానీ మన దేశంలో బడి ఎప్పటిలాగే చతికిలబడి ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. లోక్‌సభకు సమర్పించిన ఈ నివేదికకూ... నేరాంగీకార ప్రకటనకూ తేడా లేదని ఎవరికైనా అనిపించకమానదు. ఏటా నివేదికలివ్వడం, ఫలానా లక్ష్యాలు పెట్టుకున్నట్టు ప్రకటించడం రివాజైంది. తీరా సాధిస్తున్నది మాత్రం సున్నా! కానీ ఆ నివేదికల్లో పాత లక్ష్యాల సాధనలో ఎందుకు విఫల మయ్యారో, అందుకు దారితీసిన పరిస్థితులేమిటో చెప్పరు. వాటిని ఇకపై ఎలా సరిదిద్దుకుంటారో వివరించరు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాథమిక, సెకం డరీ పాఠశాలల్లో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈసారి విడుదలైన వార్షిక నివేదిక చెబుతున్న తీరు చూస్తే గుండె చెరువవుతుంది. ఒకపక్క పిల్లలు పనుల్లో కాక బడుల్లో ఉండాలని, అక్షరాస్యతను పెంచాలని చెప్పే పాలకులు తీరా బడుల్లో ఉపాధ్యాయ ఖాళీలను మాత్రం భర్తీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.



ఏడేళ్ల క్రితం ఆర్భాటంగా విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. పాఠశాల విద్యకు దూరంగా ఉంటున్న 7 కోట్ల మంది పిల్లల్ని బడిబాట పట్టించాలని, వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత నిర్బంధ విద్య అందించాలని, ఉపాధ్యాయ–విద్యార్ధి నిష్పత్తి 1:30కి తీసుకురా వాలని, ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. తీరా ఇన్నేళ్లుగా జరుగుతున్నదేమిటి? గోడలు కూడా సరిగాలేని బడులు, కూర్చోడానికి కూడా సాధ్యంకాని తరగతి గదులు ప్రతి ఊళ్లోనూ కనిపిస్తాయి. చాలాచోట్ల  కనీస వసతులైన మంచినీరు, మరుగుదొడ్డి వంటివి లేవు. క్రీడా స్థలాలు లేవు. వీటన్నిటి సంగతలా ఉంచి చాలా పాఠశాలలు ఏకోపాధ్యాయ బడుల్లా కొనసాగుతున్నాయని తాజా నివేదిక వెల్లడిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లోని సెకండరీ పాఠశాలల్లో సగం టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ ఏలుబడిలోని జార్ఖండ్‌లో 70 శాతం టీచర్‌ పోస్టులు ఖాళీ!  బిహార్, గుజరాత్‌లలో మూడో వంతు టీచర్‌ పోస్టులు భర్తీ చేయ లేదని నివేదిక తెలిపింది. ఇందుకు భిన్నంగా గోవా, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాలల్లో చాలినంతమంది ఉపాధ్యాయులున్నారు. సిక్కింలో అయితే ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు రెండింటిలోనూ అవసరమైన టీచర్లున్నారు. ఆ మూడు రాష్ట్రాలకూ సాధ్యమైనది మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు అసాధ్యమవు తున్నది?   



ఈ నివేదిక చూస్తే అసలు రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తు న్నాయా, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటున్నదా అనే అనుమానాలు తలెత్తు తాయి. దేశంలో 60 లక్షల టీచర్‌ పోస్టులుంటే ప్రాథమిక పాఠశాలల్లో 9 లక్షలు, సెకండరీ పాఠశాలల్లో లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే తప్ప అక్కడ కూడా ఖాళీల సంఖ్య తక్కువేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పాఠశాలల్లో 19,468 పోస్టులు... తెలంగాణలో 13,049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెకండరీ పాఠశాలలకొస్తే ఏపీలో 5,056, తెలం గాణలో 3,144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి జిల్లాకూ కలెక్టర్‌తోసహా ఉన్నతా ధికారులు, వారికింద గ్రామ స్థాయి వరకూ ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు.



వీరికి పాఠశాలల్లో చదువులెలా సాగుతున్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు న్నాయో ఫిర్యాదులు రావా? కనీసం ఆయా పాఠశాలల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందవా? వీటన్నిటిపైనా చర్చలుండవా... చర్యలుండవా? జనం సమస్యలను మించి దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏ ప్రభుత్వానికైనా ఏం ఉంటాయి? విద్య విషయంలో ప్రభుత్వాలకుండే నిర్లక్ష్య ధోరణి వల్ల సమాజానికి తీరని నష్టం జరు గుతోంది. ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో అత్యధికులకు వివిధ పాఠ్యాం శాల్లో కనీస పరిజ్ఞానం ఉండటం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతో ఇంతో సంపాదించే కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో వారిని ప్రైవేటు పాఠశాలలకు పంపుతాయి. రెక్కాడితే తప్ప డొక్కాడని నిరుపేద కుటుం బాలు గత్యంతరం లేని స్థితిలో ప్రభుత్వ పాఠశాలలకు పంపక తప్పడం లేదు. ఈ కుటుంబాల్లో అత్యధిక భాగం అట్టడుగు వర్గాలకు చెందినవే. అంటే పాలకుల నిర్లక్ష్యం వల్ల అట్టడుగు వర్గాలవారు అధికంగా నష్టపోతున్నారు. వారు శాశ్వతంగా విద్యకు, విజ్ఞానానికి దూరమవుతున్నారు. అవకాశాలు కోల్పోతున్నారు.



దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక విద్యపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం మొదలెట్టాయి. శాశ్వత నియామకాలను అటకెక్కించి రకరకాల పేర్లుబెట్టి కాంట్రాక్టు టీచర్లను నియమించడం, వారికి అరకొర వేతనాలివ్వడం ప్రారంభిం చాయి. కేంద్రం సైతం విద్య కోసం రాష్ట్రాలకిచ్చే నిధుల్ని గణనీయంగా తగ్గించింది. నెలకు ఏడెనిమిది వందల జీతం ఇచ్చి ఉపాధ్యాయులను నియమించడం, ఏడాది కాగానే వారి బదులు మరొకరిని నియమించడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఇందువల్ల విద్యకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఉద్యోగ భద్రత లేని ఉపాధ్యాయుడు ఎన్నాళ్లని బోధనారంగాన్ని నమ్ముకుని ఉంటాడు? ప్రామాణికమైన విధానంలో బోధించగలిగిన ఉపాధ్యాయులను నియమించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా చాలా పాఠశాలల్లో ఈ కాంట్రాక్టు టీచర్లే దిక్కు.



ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి 1:30 మాటలా ఉంచి... వంద మందికి ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. అంతక్రితం కాంగ్రెస్‌ ఏలు బడిలో చదువు ఇలా అఘోరించిందనుకుంటే ఎప్పుడూ దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ఉండలేకపోతోంది. కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ కలిసి నిరుపేద, అట్టడుగు వర్గాల పిల్లలకు మెరు గైన, ప్రామాణికమైన చదువు అందించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయి. కనీసం వచ్చే నివేదిక నాటికైనా ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. అందుకు అవసరమైన ప్రణాళిక లను సిద్ధం చేసుకోవాలి. పార్లమెంటులో నివేదికను సమర్పించి పని పూర్తయిందని చేతులు దులుపుకునే ధోరణికి స్వస్తి పలకాలి.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top