
చెన్నై వరద కష్టాలు
ఎప్పుడూ గుక్కెడు నీళ్ల కోసం అగచాట్లు పడటం మాత్రమే తెలిసిన చెన్నై మహా నగరం ఇప్పుడు వరద నీటిలో తేలియాడుతోంది.
ఎప్పుడూ గుక్కెడు నీళ్ల కోసం అగచాట్లు పడటం మాత్రమే తెలిసిన చెన్నై మహా నగరం ఇప్పుడు వరద నీటిలో తేలియాడుతోంది. పగబట్టినట్టు చుట్టుముట్టిన జలరక్కసి బారినుంచి క్షేమంగా బయటపడటం ఎలాగో తెలియక విలవిల్లాడుతోంది. బడికెళ్లిన పిల్లలు, కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులు, పనిమీద బయటికెళ్లిన పౌరులు రవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోవడంతో ఎక్కడివారక్కడ చిక్కుకున్నారు.
విమానాశ్రయం సైతం పెద్ద చెరువులా మారింది. జూపార్క్ లోని 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోవడం, అనేకచోట్ల విష సర్పాల జాడ కనబడటం జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఆహారం దొరక్క, పరిశుభ్రమైన నీరు లభించక, నిత్యావసరాల జాడే లేక నగర పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. వందల ఇళ్లు ధ్వంసంకాగా, వేలాది ఇళ్లు, భవంతులు వరదనీటిలో మునిగి ఉన్నాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ల సదుపాయం నిలిచిపోవడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
జాతీయ విపత్తు నివారణ బృందాలు, నావికాదళ సిబ్బంది, సైన్యమూ రంగంలోకి దిగి చేయవలసిన సాయమంతా చేస్తున్నారు. వీరికితోడు పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా శ్రమపడుతున్నారు. అనేకమంది నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా విలువైన సమాచారాన్ని చేరవేస్తూ అటు ఆపదలో ఉన్నవారికీ... ఇటు సాయంలో తలమునకలైనవారికీ సంధానకర్తలుగా మారారు. ఇంతమంది ఇన్నివిధాలుగా పాటుపడుతున్నా వేలాదిమంది ఇంకా వరద నీటిలో చిక్కుకునే ఉన్నారంటే బీభత్సం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది.
శతాబ్ది కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షమే చెన్నై నగరానికి ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా వచ్చే భారీ వర్షాలు, తుపానులు చెన్నై నగరానికి కొత్తకాదు. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నగరం కనుక పదేళ్లకొకసారి వరద నీరు ముంచెత్తడం మామూలే. కాకపోతే అది నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఈసారి కనీవినీ ఎరుగని ఉత్పాతం వచ్చిపడింది. నెలరోజులపాటు కురిసే వర్షం ఒక్కరోజులోనే పడిన పర్యవసానంగా రాజధానిని ఒరుసుకుని ప్రవహించే రెండు నదులూ పొంగిపొర్లి నగరాన్ని పెద్ద జలాశయంగా మార్చాయి.
అర కోటిమంది పౌరులు నివసించే మహా నగరం జలగండంలో పడటమంటే మాటలు కాదు. ఒక క్రమపద్ధతి ప్రకారం సాగుతున్న పౌర జీవనం ఉన్నట్టుండి అస్తవ్యస్థమైపోతుంది. సాయం చేయడానికైనా, పొందడానికైనా వీల్లేని పరిస్థితులు ఏర్పడతాయి. చెన్నై నగరం దాదాపు నెలరోజులుగా ఇలాంటి కష్టాల్లో పీకల్లోతు మునిగిపోయి ఉంది. పక్షం రోజులక్రితమే నగరం వరద కష్టాల్ని ఎదుర్కొన్నది. 188మంది పౌరులు భారీ వర్షాలకూ, వరదలకూ చనిపోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆనవాళ్లు కనబడుతుండగానే మంగళవారమంతా కురిసిన కుండపోత వర్షం పరిస్థితిని మొదటికి తెచ్చింది. ప్రకృతి వైపరీత్యాలను ఏ ప్రభుత్వమూ నిరోధించలేదు. చేయగలిగిందల్లా సకాలంలో కదిలి ఇలాంటి విపత్తుల కారణంగా దాపురించే కష్టనష్టాల్ని పరిమితం చేయడమే.
భౌగోళికంగా మన దేశం ప్రకృతి విపత్తులకు ఆలవాలమైన ప్రాంతం. దేశంలో చాలా భాగం(దాదాపు 76శాతం) తీర ప్రాంతం గనుక తుపానులు, సునామీల ముప్పు ఉంటుంది. దేశంలో 10 శాతం భూమి నిత్యం వరదలతో, నీటి కోతలతో ఇబ్బందులు పడుతుంటుంది. భౌగోళికంగా ఇలాంటి లోటుపాట్లున్నాయి గనుకనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం తప్పనిసరవుతుంది. ఇక్కడే పాలకులు విఫలమవుతున్నారు.
దేశంలో వరదల బెడద లేకుండా చేయడానికి సంకల్పించుకుని 1954లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ వరదల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పుష్కరకాలంలోగా వరదల్ని అరికట్టే అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని నిర్ణయించారు.
ఆ మరుసటి సంవత్సరం జాతీయ వరద నియంత్రణ పథకాన్నీ ప్రకటించారు. యూపీఏ సర్కారు హయాంలో 2006లో జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) ఏర్పడింది. విషాదమేమంటే మనకు వరదల బెడదా తొలగలేదు...వాటి పర్యవసానంగా ఏర్పడే నష్టాలూ ఆగలేదు. కురిసిన కుంభవృష్టిని ఇముడ్చుకునే చెరువులూ, సరస్సులూ క్రమేపీ మాయమవుతున్నా వాటిగురించి ఆరా తీసేవారు లేరు. ఎడాపెడా నిర్మాణాలు చేపడుతున్నా డబ్బూ, పలుకుబడీ ఉన్నవారికి అనుమతులు సునాయాసంగా లభిస్తున్నాయి.
ఇప్పుడు చెన్నైలోని విమానాశ్రయమైనా, బస్సు టెర్మినల్ అయినా, ఎక్స్‌ప్రెస్‌వే, బైపాస్ రోడ్లు, కళ్లు చెదిరే భవంతులు వగైరాలైనా...అన్నీ చిత్తడి నేలల్లో నిర్మించినవేనని నిపుణులు చెబుతున్నారు. రెండు ప్రధాన నదులకు వరదలొచ్చినప్పుడు జనావాసాలను ముంచెత్తకుండా ఈ చిత్తడి నేలలు కాపాడేవి. ఇలాంటివన్నీ మాయమైతే కురిసిన వాన నీరంతా ఎటుపోవాలి? ఇది ఒక్క చెన్నై సమస్య మాత్రమే కాదు. అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీకరించి, లక్షలాదిమంది జనం రాకతప్పని స్థితి కల్పించడం...వారి ఆవాసాల కోసం, మౌలిక సదుపాయాల కోసం అడ్డగోలు నిర్మాణాలను అనుమతించడం...నగరాన్ని విస్తరించుకుంటూ పోవడం పాలకులకు అలవాటైంది.
అభివృద్ధిని వికేంద్రీకరిస్తే అన్ని ప్రాంతాలూ బాగుపడటంతోపాటు ప్రకృతిసిద్ధమైన వనరులు ధ్వంసం కాకుండా ఉంటాయన్న కనీస జ్ఞానం కొరవడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబోయే అమరావతిలోనూ ఇలాంటి లోటుపాట్లు పొంచి ఉన్నాయి. ఈమధ్యకాలంలో ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్ వంటిచోట్ల వరదలు ముంచెత్తి అపారనష్టాన్ని కలిగించాయి. వాటినుంచి కూడా మనం ఏమీ నేర్చుకోలేదని చెన్నై వరదలు వెల్లడిస్తున్నాయి. నెపాన్ని కేవలం ప్రకృతిపై నెట్టి ఊరుకుంటే కాదు. మన పాపం ఎంతో గుర్తించాలి. దాన్ని సరిచేసుకునేందుకు సిద్ధపడాలి.