ఎమ్మెల్యే నిధులతో అడవికి దారి! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నిధులతో అడవికి దారి!

Published Sat, Sep 9 2017 11:20 AM

ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన గ్రావెల్‌ రోడ్డు

కబ్జా భూములకు సర్కారు సోకులు
నెన్నెల మండల టీఆర్‌ఎస్‌ నేతల భూముల దారి
రూ.13 లక్షల ఏసీడీపీ నిధులతో గ్రావెల్‌ రోడ్డు
671, 672 సర్వే నెంబర్‌లలో అంతులేని అక్రమాలు
మిగతా గ్రామాల్లోనూ అధికార పార్టీ నేతల భూదందా
కొమ్ము కాస్తున్న వీఆర్‌వోలు, తహసీల్‌ సిబ్బంది


సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రం శివార్లలోని 671 నుంచి 674 వరకు ఉన్న భూమంతా ప్రభుత్వానిదే. అధిక శాతం అటవీశాఖ ఆధీనంలోని 672 సర్వే నెంబర్‌లోని కొంత భూమిని 25 ఏళ్ల క్రితం కొంతమందికి అసైన్డ్‌ చేశారు. తమ భూమిని అసైన్డ్‌ చేయడాన్ని వ్యతిరేకించి అటవీశాఖ అధికారులు ఇప్పటికీ లావుని పట్టా ఉన్న సాధారణ రైతులను సాగు చేయనీయకుండా అడ్డుకొంటున్నారు. కానీ ఇదే సర్వే నెంబర్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, వారి భర్తల పేర్ల మీదున్న ‘లావుని పట్టా’ల జోలికి ఎవరూ రారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ భూముల వద్దకు వెళ్లేందుకు సరైన దారికోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఆశ్రయించారు.

అటవీ ప్రాంతంలో రైతులు పొలాలు, మామిడి తోటల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని రోడ్డు వేయించాలని కోరారు. రైతుల కోసం దారి అనుకున్నారో... లేక సొంత పార్టీకి చెందిన నమ్మకమైన వ్యక్తి చెపుతున్నారనే ధీమాతోనో... తెలియదు గాని ఎమ్మెల్యే చిన్నయ్య ఏసీడీపీ (శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళిక) నిధుల నుంచి సుమారు రూ.13 లక్షలు విడుదల చేయించారు. దీంతో అడవికి వెళ్లే మార్గంలో... అటవీ భూమిలో వారి అనుమతి లేకుండా రెండు కిలోమీటర్ల దూరం మట్టి (గ్రావెల్‌) రోడ్డు ఏర్పాటైంది. ఈ రోడ్డు కారణంగా ఇక్కడి అసైన్డ్‌ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

అటవీ భూములకు ధీమా... ‘బీమా’!
నెన్నెల మండల కేంద్రంలో 1920.19 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఇది కాకుండా అటవీ భూమి వేల ఎకరాల్లో ఉంది. రెవెన్యూ భూములను అసైన్డ్‌ చేసిన అధికారులు 671, 672 సర్వే నెంబర్లలోని అటవీ భూమిని కూడా గతంలో కొంత అసైన్డ్‌ చేశారు. ఈ విషయంలో రెవెన్యూకు, అటవీశాఖకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి, ఆమె భర్త పేర్ల మీద 672 సర్వే నెంబర్‌లో ఎనిమిది ఎకరాల భూమి ‘లావునిపట్టా’ గా నమోదై ఉంది. ఇక్కడే మరో ప్రజాప్రతినిధి నాలుగు ఎకరాలు అక్రమ మార్గంలో సంపాదించినట్లు ఆరోపణలున్నాయి.

మాజీ ప్రజాప్రతినిధి బంధువులకు మరో ఏడు ఎకరాల భూమి ఉంది. ఇవన్నీ 2012 నుంచి 2014 లోపు వెబ్‌ పహాణీల్లోకి ఎక్కిన భూములే కావడం గమనార్హం. 20 ఏళ్ల క్రితం అసైన్డ్‌ చేసిన కొందరు రైతులు భూములు కూడా ఇక్కడున్నాయి. అటవీ భూములకు ధీమా... ‘బీమా’ అన్నీ స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడే కావడంతో రోడ్డు పడింది. ఈ నేపథ్యంలో సాధారణ గ్రామ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా అడవికి దారి వేయించిన ఘనత ఆయనదే.

కాగా నెన్నెల మండల కేంద్రంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మారుమూల మండలం కావడంతో ఎలాంటి మౌలిక సదుపాయలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రూ.13 లక్షలను గ్రామంలో కనీస అవసరాల కోసం వెచ్చించి ఉంటే బాగుండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇప్పించి అడవికి రోడ్డు వేయించారని స్థానికులు కూడా ధ్వజమెత్తుతున్నారు.

అధికార పార్టీ నేతల హవా!
సర్కారు భూములను కబ్జా చేయడంలో రికార్డు సాధించిన నెన్నెల మండలంలో అధికార పార్టీ నాయకులదే హవా. సాగుకు అనువైన సర్కారు భూములను ఎగరేసుకుపోవడంలో వారి నేర్పు అంతా ఇంతా కాదు. గ్రామ వార్డు సభ్యుల నుంచి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీల వరకు... మండల, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఇక్కడ సర్కారు భూముల విషయంలో తలుచుకున్నది జరిగిపోతుంది. వీఆర్‌వోల నుంచి తహసీల్దార్‌ వరకు ప్రభుత్వ భూములను నాయకుల పేర్ల మీదికి సాగనంపడంలో తమ వంతు పాత్రను పోషించిన సంఘటనలు కోకొల్లలు. అందుకే ఏకంగా 1977 ఎకరాల సర్కారు భూమి అధికారిక రికార్డుల ప్రకారమే ఆక్రమణల పాలు కాగా, 7,672 ఎకరాల భూమి అసైన్‌మెంట్‌ అయిపోయింది. ఈ అసైన్‌మెంట్‌ భూమిని కూడా అక్రమంగా విక్రయించి సొంతదారులుగా పట్టాలు చేయించుకుంటున్న సంఘటనలు త్వరలో జరిగే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో వెలుగు చూస్తాయని ప్రజలు భావిస్తున్నారు.

Advertisement
Advertisement