'బాబు మోసం.. మాస్టర్‌ప్లాన్‌తో బట్టబయలు' | alla ramakrishna reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'బాబు మోసం.. మాస్టర్‌ప్లాన్‌తో బట్టబయలు'

Dec 26 2015 2:45 AM | Updated on Jul 28 2018 6:51 PM

'బాబు మోసం.. మాస్టర్‌ప్లాన్‌తో బట్టబయలు' - Sakshi

'బాబు మోసం.. మాస్టర్‌ప్లాన్‌తో బట్టబయలు'

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలకు పాల్పడుతున్నాడనేది మరోసారి మాస్టర్ ప్లాన్ విషయంలో బట్టబయలైందని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు.

మంగళగిరి(గుంటూరు జిల్లా): రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలకు పాల్పడుతున్నాడనేది  మాస్టర్ ప్లాన్ ద్వారా మరోసారి బట్టబయలైందని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్న రైతులకు ఎలాంటి అన్యాయం జరగనీయబోమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. రైతులను ఆయా గ్రామాల నుంచి ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం చేపట్టింది రాజధాని కోసమో లేక ప్రజల కోసమో కాదని తన కుమారుడు, తన అనుచరుల అక్రమ సంపాదన కోసమేనని ఆరోపించారు.

 

భూ సమీకరణకు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి హామీలు ఇచ్చారని, సమీకరణ పూర్తయ్యాక మంత్రులు నారాయణ, పుల్లారావుల జాడే లేకుండా పోయిందన్నారు. మాస్టర్ ప్లాన్‌కు ముందే ప్రకటించాల్సిన గ్రామకంఠాలను ఇప్పటివరకు ప్రకటించకుండా రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ఆయా గ్రామాలను రైతులు ఖాళీ చేయకపోతే పోలీసుల చేత భయపెట్టి, హింసించి అవసరమైతే పొలాలను తగులబెట్టినట్లు, ఇళ్లను తగులపెట్టి లాక్కునేందుకు చంద్రబాబు దిగజారినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. సింగపూర్ సంస్థలకు తలొగ్గి రైతులకు స్థలాలే కేటాయించలేని ప్రభుత్వం రేపు అదే విదేశీ సంస్థలకు తలొగ్గి గ్రామాలను తరలించరని నమ్మకమేముందని ఆర్కే ప్రశ్నించారు. విదేశీ సంస్థలతో ఆయా గ్రామాల చుట్టూ బహుళ అంతస్తుల మేడలు నిర్మింపజేసి గ్రామాల్లో సామాన్యుడు నివసించేందుకు వీలు లేకుండా చేసి వారి చేతే గ్రామాలను ఖాళీ చేయించే దారుణానికి ఒడిగడతారన్నారు. అన్ని గ్రామాల రైతులకు వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించడంతోపాటు గ్రామకంఠాలను పూర్తిగా నిర్ధారించిన తర్వాతే మాస్టర్ ప్లాన్ ప్రకటించాలని ఆయన డిమాండ్‌చేశారు.

 

ఇప్పుడు ప్రకటించిన తొమ్మిది గ్రామాల రైతులతోపాటు ప్రతి గ్రామంలో భూములిచ్చిన పేద రైతులకు ఆయా గ్రామాల్లోనే వాణిజ్య, నివాస స్థలాలు కేటాయించాలని, లేదంటే వారితో కలిసి వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. తొలి నుంచి తమ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిలో సమీకరించిన భూములను జోన్లుగా విభజించి రైతులకే కేటాయిస్తే వారే వ్యాపారం నిర్వహించుకుని లాభాలు పొందుతారని చెప్పినా.. పట్టించుకోని ముఖ్యమంత్రి తన కొడుకు కోసం, అనుచరుల కోసమే అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు తేటతెల్లమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement