రైలు ఢీకొని విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని విద్యార్థి మృతి

Published Sat, Jul 7 2018 12:56 PM

Man Died In Train Accident In Srikakulam - Sakshi

గరివిడి: పట్టణంలోని ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. జీఆర్‌పీ హెచ్‌సీ ఎం.చిరంజీవిరావు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండపేట గ్రామానికి చెందిన అనుపోజు సురేష్‌ పట్టణంలోని అవంతీ సెయింట్‌ థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సరం (మెకానికల్‌) చదువుతున్నాడు.

ఉదయం 9.30 గంటల సమయంలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద నుంచి తోటి విద్యార్థులతో కలిసి కళాశాలకు వెళ్తున్నాడు. ఈ సమయంలో చీపురుపల్లి వైపు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న గూడ్స్‌ను చూసి తోటి విద్యార్థులు ఆగిపోయారు. సురేష్‌ మాత్రం ట్రాక్‌ దాటుతుండగా కాలు ఇరుక్కుపోవడంతో ట్రైన్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతని శరీరం రెండు ముక్కలైంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

కొండంపేటలో విషాదచాయలు

రాజాం సిటీ: నగరపంచాయతీ పరిధిలోని కొండంపేట గ్రామానికి చెందిన విద్యార్థి అనుపోజు సురేష్‌ (16) విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రాజాంలో పదో తరగతి చదివాడు. విజయనగరం జిల్లా గరివిడి అవంతి కాలేజీలో పాలిటెక్నిక్‌ కోర్సులో చేరారు. ఆరు రోజులుగా కళాశాలకు వెళుతున్నాడు.

రోజూ రాజాం నుంచి ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం బయలుదేరిన సురేశ్‌.. చీపురుపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద బస్సు దిగాడు. అడ్డదారిలో కళాశాలకు వెళ్లేందుకు ట్రాక్‌ దాటే ప్రయత్నం చేశాడు. ఇంతలో అతని షూ ట్రాక్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగానే ఎదురుగా వస్తున్న గూడ్స్‌రైలు ఢీకొట్టింది.

30 నిమిషాల ముందు ఇంటి నుంచి బయలుదేరిన తమ కుమారుడు ఇంతలోనే మృత్యుఒడికి చేరిన విషయాన్ని తల్లిదండ్రులు దామోదరాచారి, లక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలవిసేలా విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దామోదరరావు ఆచారి రాజాంలోని జ్యూట్‌ కర్మాగారంలో పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మి గృహిణి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని పెద్ద చదువులు చదివించాలని, ఓ ఉద్యోగిగా చూడాలని అనుకున్నామని కానీ ఇంతలోనే ఇలా అయ్యిందని కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.

Advertisement
Advertisement