జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

Who is Leading in Food delivery, Zomato or Swiggy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే ఆహారాన్ని సరఫరా చేసే ఆహార సంస్థలు జొమాటో, స్విగ్గీలు నేటి పోటీ ప్రపంచంలో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఈ రంగంలో మూడొంతుల డిమాండ్‌ను ఈ రెండు సంస్థలే నెరవేరుస్తున్నాయి. మొత్తం దేశంలోని స్మార్ట్‌ఫోన్లలో 12 శాతం ఫోన్లు జొమాటో యాప్‌ను కలిగి ఉండగా, 10 శాతం ఫోన్లు స్విగ్గీ యాప్‌ను కలిగి ఉన్నాయి. మిగతా పోటీ సంస్థలు దరిదాపుల్లో కూడా లేవు. వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట్‌ లాంటి ‘టూటైర్‌’ నగరాల్లో ఈ రెండు సంస్థలు పోటాపోటీగా దూసుకుపోతుండడం విశేషమని మార్కెట్‌ అధ్యయన సంస్థ ‘ఉనోమర్‌’ తెలియజేస్తోంది. గత మే నెల నాటికి దేశంలో మొత్తం 60 లక్షల స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. 

‘జొమాటో ప్రారంభించిన గోల్డ్‌ ప్రోగ్రామ్‌’ బాగా పనిచేసిందని, అది వినియోగదారుల్లో విశ్వాసాన్ని బాగా పెంచిందని, పర్యవసానంగా పదే పదే ఆర్డర్లు జొమాటోకు వచ్చి పడ్డాయని ఉనోమర్‌ సంస్థ డైరెక్టర్‌ రిచా సూద్‌ తెలిపారు. దేశంలో దాదాపు 1200 రెస్టారెంట్లు, బార్లు, పబ్‌ల నుంచి సరఫరా చేసే ఏటా వెయ్యి రూపాయల ఆహారంపై గోల్డ్‌ ప్రోగామ్‌ కింద సబ్‌స్క్రిప్షన్‌ రాయితీ కల్పించడం జొమాటోకు బాగా కలిసివచ్చింది. ఇటీవల దాన్ని ఆహార పరిణామాన్ని బట్టి పరిమితం చేయడం పట్ల వినియోగదారుల్లో కొంత అసంతప్తి వ్యక్తం అయిందని, అయితే దాని వల్ల వ్యాపారం పెద్దగా దెబ్బతినలేదని రిచా సూద్‌ వివరించారు. 

క్రికెట్‌ వరల్డ్‌ కప్, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా మంచి డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా కూడా జొమాటో, స్విగ్గీ సంస్థలు మార్కెట్లో తమ స్థానాలను నిలబెట్టుకో గలిగాయి. స్మార్ట్‌ఫోన్ల ఆధారపడి సరఫరా చేసే ఆహారం గతేడాదిలో ఏడు శాతం వృద్ధి చెందింది. వాస్తవానికి ఇది పెద్ద వృద్ధిరేటు కాదు. మొత్తానికి ఆహార పరిశ్రమలో దీని వాటా 17 శాతానికి మాత్రమే చేరుకుంది. మొత్తం 79 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఈ కేటగిరీలో ఎంతో అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఆహారాన్ని సరఫరా చేసే యాప్‌లను వినియోగదారులు ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ వాటికన్నా తక్కువ వినియోగదారులను కలిగి ఉన్న హైదరాబాద్, జైపూర్‌ లాంటి టూ టైర్‌ నగరాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా నడుస్తోంది. ఢిల్లీ, కోల్‌కతా, చండీగఢ్‌ నగరాల్లో జొమాటో ముందుండగా, చెన్నై, గోహతి, కోచి నగరాల్లో స్విగ్గీ దూసుకుపోతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top