మైక్రోమాక్స్ ప్రమోటర్లకు జాక్‌పాట్!

మైక్రోమాక్స్ ప్రమోటర్లకు జాక్‌పాట్!


మొబైల్ అమ్మకాల్లో దూసుకెళుతున్న దేశీ దిగ్గజం మైక్రోమాక్స్.. త్వరలో చేతులు మారనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం టాప్‌గేర్‌లో ఉండటంతో ఇదే అవకాశంగా మంచి రేటుకు విక్రయించి బయటపడేలా ప్రమోటర్లు ప్రణాళికలు వేస్తున్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ.21,000 కోట్ల వేల్యుయేషన్ లభించినట్లు సమాచారం. కేవలం మొబైల్స్‌ను అసెంబుల్ చేసి విక్రయించే దేశీ కంపెనీకి ఇంత భారీ విలువ రావటం... మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.


 

వాటా విక్రయానికి తహతహ..  

కంపెనీ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా

సాధ్యమైతే పూర్తిగా కంపెనీని అమ్మేసే ప్రణాళిక!  

అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు


దేశీ మొబైల్స్ మార్కెట్‌లో మైక్రోమాక్స్ ఒక కెరటం. శామ్‌సంగ్ లాంటి దిగ్గజాలతో పోటీగా సెల్‌ఫోన్లను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్న ఈ కంపెనీ ప్రమోటర్లు... సరైన భాగస్వామి లభిస్తే కొంత వాటాను విక్రయించాలని, లేదంటే పూర్తిగా వేరొకరికి అమ్మేసి కంపెనీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ప్రపంచ ఈ-కామర్స్ అగ్రగామి అలీబాబా, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం కంపెనీ విలువను ప్రమోటర్లు 3-3.5 బిలియన్ డాలర్లుగా (గరిష్టంగా రూ.21,000 కోట్లు) లెక్కగట్టారు. ఇది 2013-14లో మైక్రోమాక్స్ ఆదాయానికి 2.5-2.9 రెట్లు కావడం గమనార్హం.

 

ఐదేళ్లలో 14 రెట్లు జూమ్...

మైక్రోమాక్స్ వాటా విక్రయంతో అటు ప్రమోటర్లతో పాటు పెట్టుబడిపెట్టిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండనుంది. ప్రస్తుతం ప్రమోటర్ల తర్వాత మైక్రోమాక్స్‌లో టీఏ అసోసియేట్స్ 15 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 2010లో ఈ కంపెనీ రూ.225 కోట్లను పెట్టుబడిగా పెట్టి బోర్డులో చోటు దక్కించుకుంది. అప్పటి ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం మైక్రోమాక్స్ వేల్యుయేషన్ రూ.1,500 కోట్లు మాత్రమేనని అంచనా.ఇప్పుడు ఏకంగా దీనికి 14 రెట్ల విలువను ప్రమోటర్లు ఆశిస్తుండటం గమనార్హం. సెకోయా క్యాపిటల్, శాండ్‌స్టోన్ క్యాపిటల్‌తో పాటు మాడిసన్ ఇండియా క్యాపిటల్‌కు స్వల్ప వాటాలున్నాయి. చైనాకు చెందిన స్ప్రెడ్‌ట్రమ్ కమ్యూనికేషన్స్ కోటి డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రమోటర్ల అంచనా ప్రకారం సంస్థ అమ్ముడుపోతే ఇన్వెస్టర్లకు బొనాంజా తగిలినట్లే.

 

పదిహేనేళ్ల ప్రస్థానం...


2000వ సంవత్సరంలో నోకియా కంపెనీకి మొబైల్ విడిభాగాల సరఫరాదారుగా మైక్రోమాక్స్ ప్రస్థానం మొదలైంది. రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్... ఈ నలుగురూ దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో హ్యాండ్‌సెట్ విక్రయాల్లోకి అడుగుపెట్టింది. అనేక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ హ్యాండ్‌సెట్లను చౌక రేటుకు అందించడంతో మైక్రోమాక్స్‌కు విశేష ఆదరణ లభించింది. తర్వాత స్మార్ట్‌ఫోన్లలోనూ వేగంగా కొత్త మోడళ్లను పరిచయం చేయడం కంపెనీకి కలిసొచ్చింది. ప్రస్తుతం నెలకు 30 లక్షలకుపైగా హ్యాండ్‌సెట్లను విక్రయిస్తోంది.ఇందులో స్మార్ట్‌ఫోన్‌ల వాటా 45 శాతంగా ఉంది. ప్రస్తుతం  కంపెనీలో ప్రమోటర్ల వాటా దాదాపు 80 శాతం. అంటే తాజా వేల్యుయేషన్ ప్రకారం ఈ నలుగురికీ రూ.16,000 కోట్లకుపైగా లభిస్తాయి. మరోవంక మొబైల్స్ రంగంలో ఉద్ధండులైన ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడం ద్వారా వాటా విక్రయానికి ముందు బ్రాండ్ విలువను మరింత పెంచుకునేలా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది.భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ సంజయ్ కపూర్, శామ్‌సంగ్ ఇండియా మొబైల్ హెడ్ వినీత్ తనేజా తదితరులు గతేడాది మైక్రోమాక్స్‌లో చేరారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లను సమీకరించేందుకు సన్నాహాలు కూడా చేశారు. అయితే, ఇప్పుడు ప్రమోటర్లు ఐపీఓ కంటే వ్యూహాత్మక భాగస్వామి లేదా పూర్తి వాటా విక్రయంపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు వృద్ధి పథంలో కంపెనీని ఒక ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్(కంపెనీ) చేతికి అప్పగించాలనేది ప్రమోటర్ల వ్యూహంగా చెబుతున్నారు.

 

భారత్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి మొబైల్ ఫోన్ కంపెనీగా... డ్యుయల్ సిమ్ ఫోన్లను దేశంలో ప్రవేశపెట్టిన తొలి హ్యాండ్‌సెట్ సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సైనోజెన్ ఓఎస్‌తో(యురేకా బ్రాండ్) తొలిసారిగా చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది.

భారత్‌లో పెట్టుబడులకు ఉరకలేస్తున్న అలీబాబా... ఇటీవలే ఎం-కామర్స్ దిగ్గజం పేటీఎంలో 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దేశీ మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టింది.

సాఫ్ట్‌బ్యాంక్ కూడా వచ్చే కొన్నేళ్లలో భారతీయ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల్లో 10 బిలియన్ డాలర్లను వెచ్చించే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే స్నాప్‌డీల్, హౌసింగ్.కామ్, ఓలా క్యాబ్స్ తదితర కంపెనీల్లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుపెట్టింది.

దాదాపు ఏడాది క్రితం భారత్‌లోకి అడుగుపెట్టిన చైనా ‘యాపిల్’ షియోమి ప్రస్తుత వేల్యుయేషన్ 45 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012లో దీని విలువ 4 బిలియన్ డాలర్లే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top