మధుకాన్‌ కంపెనీలపై సీబీఐ కేసు 

Central Bureau of Investigation on Madhukan - Sakshi

బ్యాంకులకు  1,000 కోట్లకుపైగా టోపీ..

ప్రమోటర్లపైనా కేసు నమోదు

జార్ఖండ్‌ హైవే ప్రాజెక్టులో గోల్‌మాల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకు చెందిన మౌలిక రంగ కంపెనీ మధుకాన్‌పై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకులకు మోసపూరితంగా రూ.1,000 కోట్లకుపైగా నష్టం కలిగించినందుకు ఈ కేసు నమోదైంది. జార్ఖండ్‌లో  ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించిన రోడ్డు విస్తరణ ప్రాజెక్టును పూర్తి చేయకపోగా.. ప్రాజెక్టు కోసం మంజూరైన కోట్లాది రూపాయల నిధులను ఉద్ధేశపూర్వకంగా దారి మళ్లించారు. రోడ్డు విస్తరణ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడంతో జార్ఖండ్‌ హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సుమోటోగా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) రంగంలోకి దిగడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి. రోడ్డు ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ అయిన రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సీఎండీ కె.శ్రీనివాస రావు, డైరెక్టర్లు ఎన్‌.సీతయ్య, ఎన్‌.పృథ్వి తేజతోపాటు మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, మధుకాన్‌ ఇన్‌ఫ్రా, మధుకాన్‌ టోల్‌ హైవే, ఆడిటింగ్‌ కంపెనీ కోటా అండ్‌ కంపెనీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కెనెరా బ్యాంకుతోపాటు కన్సార్షియంలోని బ్యాంకులకు చెందిన కొందరు అధికారులపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం గమనార్హం.  

ఇదీ రోడ్డు ప్రాజెక్టు.. 
జాతీయ రహదారి–33పై జార్ఖండ్‌ రాష్ట్రంలో రాంచీ–రార్‌గావ్‌–జంషెడ్‌పూర్‌ సెక్షన్‌లో 163 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టును నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) మధుకాన్‌కు 2011 మార్చి 18న అప్పగించింది. ఈ ప్రాజెక్టు కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ పేరుతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను మధుకాన్‌ ఏర్పాటు చేసింది. కన్సెషన్‌ పీరియడ్‌ 15 సంవత్సరాలు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,655 కోట్లు. ఇందులో రూ.1,151.60 కోట్ల రుణం ఇచ్చేందుకు కెనరా బ్యాంకు నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్షియం ముందుకు వచ్చింది. ప్రమోటర్లు తమ వాటాగా రూ.503.60 కోట్లు సమకూర్చాలి. 2012 డిసెంబరులో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. 

అసలు ఏం జరిగిందంటే.. 
అయిదేళ్లలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో జార్ఖండ్‌ హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టాల్సిందిగా సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ను (ఎస్‌ఎఫ్‌ఐవో) ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐవో రంగంలోకి దిగడంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. రోడ్డు విస్తరణ పనుల ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో విచారణ చేపట్టకుండానే కెనరా బ్యాంకు కన్సార్షియం రూ.1,029.39 కోట్లను మంజూరు చేసిందని ఎస్‌ఎఫ్‌ఐవో తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.264 కోట్లను కంపెనీ దారి మళ్లించిందని గుర్తించింది. ఈ నిధులను ప్రాజెక్టుకు వినియోగించలేదని ఎస్‌ఎఫ్‌ఐవో తన నివేదికలో వివరించింది. 

బ్యాంకుల నుంచి రూ.1,029.39 కోట్ల మొత్తం రుణం పొందేందుకు డైరెక్టర్లు మోసపూరితంగా వ్యవహరించారని గుర్తించింది. రుణం తీసుకున్నప్పటికీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. దీంతో 2018లో ఈ రుణం కాస్తా నిరర్ధక ఆస్తిగా (ఎన్‌పీఏ) మారిందని ఎస్‌ఎఫ్‌ఐవో నిర్ధారించింది. ఎస్‌ఎఫ్‌ఐవో నివేదిక ఆధారంగా సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 31న ఎన్‌హెచ్‌ఏఐ ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. కంపెనీ బ్యాంకు గ్యారంటీగా పెట్టిన రూ.73.95 కోట్ల డిపాజిట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ స్వాధీనం చేసుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top