నోట్‌కు ముందే తీర్మానం | YS Vijamma Letter to CM Kirankumar Reddy | Sakshi
Sakshi News home page

నోట్‌కు ముందే తీర్మానం

Sep 27 2013 1:41 AM | Updated on Jun 2 2018 4:41 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడానికి తక్షణమే శాసనసభను సమావేశ పరచాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌ చేశారు.

* వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌.. సీఎంకు లేఖ
* విభజనకైనా, ఏకీకరణకైనా అసెంబ్లీ తీర్మానం సంప్రదాయం..
* అదే సంప్రదాయం ప్రకారం ముందుగానే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడానికి తక్షణమే శాసనసభను సమావేశ పరచాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌ చేశారు. విభజన నోట్‌ కేంద్ర కేబినెట్‌ ముందుకు రావడానికి ముందే ఈ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం ఆమె లేఖ రాశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి...

ముఖ్యమంత్రి గారికి,
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30న సీడబ్ల్యూసీ ఏకపక్షంగా, అడ్డగోలుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన నాటి నుంచీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోయాయి. ఈ అవాంఛిత రాజ్యాంగ సంక్షోభానికి పూర్తి బాధ్యత వహించాల్సింది కేంద్ర, రాష్ట్రాలు రెండింట్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే.

ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవడం సముచితం. సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేయనిదే కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలే కాబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. పైగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకే జరిగినా... ఆ మేరకు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాల విలీనానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది.

కాబట్టి, అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేబినెట్‌ నోట్‌ సిద్ధమవక ముందే తీర్మానాన్ని ఆమోదించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
- వైఎస్‌ విజయమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement