పనులు మా వాళ్లే చేయాలి!


సాక్షి, అనంతపురం : ‘అధికారం మాది. ప్రభుత్వపరంగా ఎలాంటి పనులనైనా మా పార్టీ నాయకులు, కార్యకర్తలే చేపట్టాలి. గతంలో కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి పనులను రద్దు చేసి, మా వారికి ఇవ్వండ’ం టూ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు.. అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

 

 కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక్కో

 నియోజకవర్గానికి రూ.50 లక్షల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు రూ.7 కోట్ల విలువైన ప్రత్యేక అభివృద్ధి పనులు మంజూరు చేశారు. ఈ పనులన్నీ నామినేషన్ పద్ధతిన చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ఎవరి ఆధ్వర్యంలో పనులు చేపట్టాలనే విషయంపై చర్చించి తీర్మానం చేయాల్సి ఉంటుంది.

 

 ఆ ప్రతిని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఇస్తే పనులు చేపట్టేందుకు వారు అనుమతిస్తారు. సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌చార్జ్ మంత్రి మంజూరు చేసిన నిధులను వినియోగించేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తిస్తూ... వాటిని చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖలు ఇచ్చారు.

 

 ఆ వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో చాలా పనులు ఆగిపోయాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అధికారులపై ఒత్తిడి తెచ్చి వెంటనే పనులు మొదలు పెట్టించారు. ఇప్పటి వరకు మొదలు కాని పనులను వెంటనే రద్దు చేసి, తాము సూచించిన వారికి వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటూ పంచాయతీ రాజ్ అధికారులపై అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. గ్రామ స్థాయిలో ఇప్పటికే తీర్మానం చేసిన వాటిని రద్దు చేయడానికి వీలుకాదని అధికారులు చెబుతున్నా ఎమ్మెల్యేలు మాత్రం ససేమిరా అంటున్నారు.

 

 రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి పనుల కింద రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రూ.5 లక్షలు, అక్కంపల్లికి రూ.3 లక్షలు, కలికివాండ్లపల్లికి రూ.2 లక్షలు, కనగానపల్లి మండలం తల్లిమడుగులకు రూ.5 లక్షలు, చెన్నేకొత్తపల్లి మండలం చిన్నప్పేటకు రూ.2.50 లక్షలు, చిన్నపల్లికి రూ.2.50 లక్షలు, పల్లొన్నగారిపల్లికి రూ.5 లక్షలు, రాప్తాడు మండలం బండమీదపల్లికి రూ.5 లక్షలు, యర్రగుంటకు రూ.2.50 లక్షలు, గొందిరెడ్డిపల్లికి రూ.2.50 లక్షలు, హంపాపురానికి రూ.5 లక్షలు, రాప్తాడుకు రూ.5 లక్షలు, ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొన్ని పనులు ఇప్పటికే మొదలుపెట్టారు. ఇప్పటికీ మొదలు పెట్టని పనులను ఇతర పార్టీలకు చెందిన వారికి ఇచ్చివుంటే వెంటనే రద్దు చేయాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఎఫ్), మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ (ఎంఆర్‌ఆర్), 13వ ఆర్థిక సంఘం తదితర నిధులతో చేపట్టే పనులకు కూడా బ్రేక్ పడే అవకాశముంది. ఇదిలావుండగా.. పదేళ్లుగా ఎలాంటి కాంట్రాక్టు పనులూ దక్కని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం పనులు దక్కించుకునేందుకు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. అలాంటి వారితో జిల్లా పరిషత్ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతోంది.   

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top